Others

తెలుగేగతి బాగుపడునోయ్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన తెలుగు వారిది చిన్నపిల్లల మనస్తత్వం అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏమికావాలో మనకే తెలియదు. ఇంకొకరు చెబితేనే మనం ఉత్సాహం చూపిస్తాం. అంతవరకూ స్వంతంగా ఆలోచించం. మన గురించి ఎవరో ఒకరు మనకు చెప్పాలి. ‘ముత్యాలముగ్గు’ సినిమాలో విలన్ రావుగోపాలరావు చెప్పిన దానికి విరుద్ధంగా ‘తిని తొంగుంటూ మనిషికి, గొడ్డుకీ తేడా లేకుండా’ బతికేస్తాం!
సాధారణంగా పసిపిల్లలు ఏదైనా వస్తువు అక్కడ పడివున్నా తీసుకోరు. దాన్ని ఎవరైనా తీసుకునే సరికీ- ‘నాది.. నాది..’ అంటూ గోల చేస్తారు. అదే పద్ధతి మన తెలుగువాళ్లదీనూ! తమిళులు వారి భాషకి ప్రాచీన హోదా సంపాదించుకున్నారని తెలిశాక- ‘మాకూ అది కావాలం’టూ ఏకధాటిగా పోరాడితే- ‘సరే! తీసుకోండి..’ అంటూ ప్రభుత్వం వారు మనకీ అది పడేశారు. అయితే- ఇంతకీ మనకేం ఒరిగింది? గొడవ చేసి లాక్కునే వరకే గాని, తరవాత దాన్ని పట్టించుకుంటున్నామా? చిత్తశుద్ధితో అన్ని విషయాల్లోనూ మనభాషని అమలుపరుస్తున్నామా?
తమిళులని చూసి ఏడిచి, సంపాదించుకున్న మనం వాళ్ళు ఆచరిస్తున్న పద్ధతులను అమలుచేస్తున్నామా? భాషాభిమానం వారికున్నంతగా మనకి ఉందా? తల్లిదండ్రులే పిల్లలకి- ‘ఆ..! తెలుగు నేర్చుకుని ఏం ప్రయోజనం?’అంటూ మాతృభాషపై ఏ మాత్రం మమకారం చూపించకుండా ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఎంతమంది తెలుగు చదివి రాయగలుగుతున్నారు? ఈ సందర్భంగా ఓ ముచ్చట చెప్పుకోవాలి. ఇటీవల చెన్నైలో మా స్నేహితులింటికి కొత్తకోడల్ని తీసుకువచ్చారంటే చూడడానికి వెళ్ళాం. వాళ్ళు ఎన్నో తరాలుగా ఇక్కడే స్థిరపడిన తెలుగువారు. ఆంధ్రాలో వారు ఏ ప్రాంతం వారో వారికే తెలియదు. ఇక్కడ అలాంటివారు కోకొల్లలు. మధురై, కోయంబత్తూరు లాంటి ప్రాంతాల్లో మరీను. అయినా వారు తెలుగువారిమనే చెప్పుకుంటారు. వారిలోవారు తెలుగే మాట్లాడుకుంటారు. ఎటొచ్చీ తరాల తరబడి ఇక్కడే వుండడంవల్ల వారి భాషలో తమిళ పదాలు కలిసిపోయి వుంటాయి. అయినా ఇంకా మరిచిపోకుండా తెలుగు మాట్లాడుతున్నందుకు వారిని అభినందించాలి. మా స్నేహితులకి తెలుగుభాష మీద అభిమానం కొద్దీ తెలుగు అక్షరాలు నేర్చుకుని కూడబలుక్కుని కొద్దిగా చదువుతారు. అందుకే విజయవాడ అమ్మాయిని కోడల్ని చేసుకున్నారు. అయితే- నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఆ అమ్మాయికి తెలుగు రాయడం, చదవడం రాదని. ఆంధ్రా నడిబొడ్డున విజయవాడలో వుండి తెలుగు రాయడం, చదవడం రాదంటే ఏమనుకోవాలి? నా ఉత్సాహం నీరుగారిపోయింది. ‘మా ఆంధ్రావాళ్ళది స్వచ్ఛమైన తెలుగు’ అంటూ సొంతడబ్బా వాయించుకునే నాకు తలకొట్టేసినట్లయింది. ఎందుకంటే ఆ అమ్మాయి మాట తీరులో కూడా స్వచ్ఛత లేదు. ఇక్కడి వారి తెలుగులో తమిళపదాలు కలిస్తే, అక్కడి వారి తెలుగులో ఆంగ్ల పదాలు కలిశాయి. అంతే తేడా! ‘ఏ రాయయితేనేం? పళ్ళూడగొట్టుకుందుకి?’ అన్నట్లు ఏ భాష కలిస్తేనేం? తెలుగుభాష మరుగున పడేందుకు?
చెన్నైలోని ప్రాథమిక విద్యాలయాల్లో తమిళ భాష అభ్యాసం తప్పనిసరి. అందుకే వారికి తెలుగు రాదంటే అర్థం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాలయాల్లో ఇలాంటి నిబంధన లేదా? తెలుగు రాదని చెప్పుకోడానికి సిగ్గుపడాల్సింది పోయి గర్వపడుతున్నారు. అదీ ముఖ్యంగా తల్లిదండ్రులు. వీరిని ఏమనాలి? టీవీ మాధ్యమాల్లో మాట్లాడే అమ్మాయిలు (యాంకర్లు) ఆంగ్లపదాల మధ్యలో తెలుగు పదాలు పెడుతున్నారు. అదే తెలుగనుకోవాలా? తమిళ ప్రసారాలు ఒకసారి వినండి తెలుస్తుంది. వంటల కార్యక్రమంలో సైతం ఒక్క ఆంగ్ల పదం వుండదు. మనవారి తెలుగు వంటల కార్యక్రమాల్లో ‘స్టౌ అంటించి, బౌల్ పెట్టి, ఆయిల్ పోసి, కట్ చేసిన వెజిటబుల్స్ వేసి, ఫ్రై చేసి, వాటర్ పోసి, బాయిలయ్యాక సాల్టు వేసి..’ ఇలాగే మొత్తం సాగుతుంది. దీన్ని తెలుగు మాధ్యమం అనుకోవాలా? ఏమనుకోవాలి?
తెలుగు భాషకు ప్రాచీన హోదా కావాలంటూ పోరాడడంతోనే ఆగిపోకూడదు. ప్రజలపై ఎక్కువ ప్రభావం చూపగల ‘బుల్లితెర’ మాధ్యమాల్లోనూ, యువతరాన్ని ఆకర్షించే చలనచిత్రాల్లోనూ భాష మీద అభిమానం చూపి ఉచ్ఛారణ దోషాలను సరిదిద్దాలి. నేడు తెలుగు సినిమాలు చూస్తే మాలాంటివారికి ఇదసలు తెలుగు సినిమాయేనా? అనిపిస్తోంది. ఆ భాష, ఆ ఉచ్ఛారణ పరమ దరిద్రంగా వుంటున్నాయి. టీవీ, సినిమాల్లోని భాషని ఆధారంగా చేసుకుని మాట్లాడే నేటి యువతరం అదే ఒరవడిలో సంభాషణలు సాగిస్తున్నారు. ప్రాచీన హోదా సంపాదించుకోగానే సరికాదు. అపురూపమైన భాషని నిలబెట్టుకునేందుకు తగిన కృషి చెయ్యాలి. ముందుగా తల్లిదండ్రులు పిల్లలకి సరళమైన తెలుగుభాష మాట్లాడడం అలవాటు చెయ్యాలి. నేటితరం దంపతులకే సరిగ్గా తెలుగు భాష రాదు. తెలుగు పదాలకి ఇంగ్లీషులో అర్థాలు చెప్పవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇది ఆంగ్ల భాషాభిమాన ప్రభావం.
ప్రభుత్వాలు ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తప్పనిసరి చెయ్యాలి. అందుకు సరైన తెలుగుభాషా పండితులనే నియోగించాలి. తెలుగు పదాలకి తెలుగులోనే అర్థాలు వివరించాలి గాని ఆంగ్లంలో వివరించే అలవాటు చెయ్యరాదు. భాషకు సంబంధించి చిన్నచిన్న ఒత్తులు, దీర్ఘాల విషయంలో కూడా ‘పోనీలే!’ అంటూ అలసత్వం పనికిరాదు. ఆ తప్పులకి మార్కులు తగ్గించవలసినదే! అప్పుడే పిల్లలు సరిగ్గా నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. నేడు ఎందరో తెలుగు రాయగలవారిని కూడా చూస్తున్నాం! దీర్ఘాలు ఇవ్వవలసినచోట ఇవ్వరు. అక్కర్లేనిచోట ఇస్తారు. అలాగే ఒత్తులు కూడా! టీవీ, సినిమా మాధ్యమాల్లో సరిగ్గా తెలుగు మాట్లాడగలవారినే ఎంపిక చేసుకోవాలి. లేనిపక్షంలో ఉన్నవారికే సరైన శిక్షణ ఇవ్వాలి. భాషని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా సరైన విధంగా శ్రద్ధతీసుకుంటే మన తెలుగుభాష శాశ్వతంగా నిలుస్తుందనడానికి సందేహం లేదు. ఈ విషయంలో మన ఆంధ్రుల కన్నా అమెరికాలోని ప్రవాసాంధ్రులు ముందంజలో ఉన్నారు. వారక్కడ తీరిక సమయాల్లో తెలుగుభాష నిలబడేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. పిల్లలకి, పెద్దలకి కూడా రాయడం, చదవడం కొన్ని ప్రాంతాల్లో నేర్పుతున్నారు. కూచిపూడి వంటి నృత్యరీతులు, త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలతో కచేరీలు నిర్వహిస్తూ, ఔత్సాహికులకి నేర్పిస్తూ తమవంతు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇతర దేశాల్లో మన భాషని గౌరవిస్తూంటే- ఇక్కడ మనం మన భాషని అశ్రద్ధ చెయ్యడం సమంజసమా? ప్రతి ఒక్కరూ ఆలోచించి తమవంతుగా భాషా ప్రయోజనాలకి నడుంకట్టి ముందడుగు వేయాలి.

-ఆర్.ఎస్.హైమవతి