సబ్ ఫీచర్

ప్రేమ కొలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలంతా ఒకటే. వారిలో హెచ్చుతగ్గులుండవు. పిల్లల్ని భగవంతుని రూపంగా భావిస్తాం. వారంతా కలసి మెలసి ఉంటారు. కాని, వారిలో తరతమ భేదాలను పెద్దలే సృష్టిస్తారు. పెద్దవారు చెప్పిన మాటలు విని పిల్లలు వారిలో వారు ఘర్షణకు దిగుతారు. మరలా వారికి పెద్దలే సర్దిచెబుతుంటారు.
అలాంటి సంఘటనే మేరి, రీతుల మధ్య జరిగింది. వీరిద్దరూ మంచి స్నేహితులు మేరి ధనవంతుల బిడ్డ. రీతు మధ్యతరగతికి చెందినవారి బిడ్డ. ఒకరోజు మేరి చర్చికి వెళ్లి ఆలస్యంగా ఆడుకోవడానికి వచ్చింది. రీతు ఆలస్యంగా వచ్చిన మేరిని ఎందుకు ఆలస్యమైందని అడిగింది. మేరి మేము చాలా ధనవంతులం కదా... ఈ రోజు ఆదివారం కదా... చర్చికి వెళ్లాం... అక్కడ పేదవారికి బ్రెడ్, పాలు ఇచ్చాము. అందుకే లేట్ అయ్యింది అని చెప్పింది. అలా ఇవ్వడం ఎందుకు అని రీతు అడిగింది.
లేనివాళ్లు చాలామంది ఉంటారు. వారికి మనం ఇస్తే యేసు మనలను ఎక్కువ ప్రేమిస్తాడు. అపుడు మనం ఏది కోరుకుంటే అది మనకు లభ్యమవుతుంది. అందుకని మేము అలా చేస్తాం అని చెప్పింది. అంతా విని రీతు వాళ్ల అమ్మను అడిగింది. ‘అమ్మా! నేను కూడా మేరి లాగా ఆరెంజ్స్ పంచిపెడుతాను. అపుడు యేసు నా మీద కూడా ఎక్కువ ప్రేమను చూపిస్తాడు’ అంది.
రీతు వాళ్ల అమ్మ అట్లాకాదు మనం ఏ మంచి పనిచేసినా దానికి యేసు మనపై ప్రేమను చూపిస్తాడు. కమలాపండ్లు ఇస్తేనే చూస్తాడనేది ఉత్తమాట. మనకున్న దానిలో మనం ఇవ్వాలి అని ఆమె చెప్పింది.
ఆ మాటలు రీతుకు అంతగా నచ్చలేదు. మరుసటిరోజు ఆడుకోవడానికి వెళ్లేటపుడు దారిలో ఒక ముసలాయన దాహంతో బాధపడుతున్నాడు. లేవడానికి శక్తిలేక అవస్థపడుతూ రీతుకు కనిపించాడు.
రీతుని ఆయన సైగతో దగ్గరకు పిలిచి నీళ్లు కావాలని చెప్పాడు. రీతు ఇంటికి వెళ్లి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అవి తాగి ఆయన నిన్ను యేసు చల్లగా చూస్తాడని దీవించాడు. ఈ విషయం రీతు మేరికి చెప్పింది.
మేరీ వాళ్ల అమ్మను నీళ్లు ఇస్తే చల్లగా చూస్తాడా అని అడిగింది. నీళ్లు ఇస్తే చాలా తక్కువగా చూస్తాడు. నీవు పండ్లు ఇచ్చావు కనుక నినే్న ఎక్కువగా చూస్తాడు. ఎపుడైనా మనం గొప్ప బహుమతులు ఇవ్వాలి అని చెప్పింది. అదేవిషయాన్ని రీతుకు మేరి చెప్పింది. రీతు కూడా అట్లాంటి గొప్ప బహుమతులు ఇవ్వాలని అనుకొనేది. వాళ్ల అమ్మను అడిగేది. కాని వాళ్ల అమ్మ మన దగ్గర డబ్బులు లేవు కనుక నీవు మనకున్న దానిలో ఏదైనా ఎవరికైనా ఇవ్వు కాని లేనిదికావాలని గొడవ చేయకు అని చెప్పేది. రీతుకు అది నచ్చేది కాదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వాళ్ల బడికి ఒక ఫాదర్ వచ్చారు. ఆయన ఇలా చెప్పారు. మీరు చిన్న పిల్లలు. దేవునితో సమానం. ఎవరైనా ఏదైనా సాయం అడిగితే తప్పకుండా చేయండి. మిమ్ములను యేసు సదా కాపాడుతాడు అని చెప్పాడు. గొప్ప బహుమతులు ఇస్తేనే కదా యేసు కాపాడేది అని రీతు తన సందేహం చెప్పింది.
ఫాదర్ అట్లా కాదు అమ్మా బహుమతుల్లో ఎక్కువ తక్కువ అన్న భేదాలు ఏమీ ఉండవు. కాని ఇచ్చే బహుమతి మనస్ఫూర్తిగా ఇవ్వాలి. అది ఎదుటివారికి పనికి వచ్చేట్టు ఉండాలి. అపుడు యేసు మీరు చేసిన పనిని మెచ్చుకుంటాడు అని చెప్పాడు.
అపుడు మేరీకి, రీతుకు అసలు విషయం తెలిసింది. అప్పట్నుంచి వారిద్దరూ ఫాదర్ చెప్పినట్లు ఎవరికి ఏ సాయం కావాలో తెలుసుకొని మరీ చేసేవారు. పిల్లలు స్వచ్ఛమైన మనసు కలవారు. వారికి మనం ఏం చెప్పితే అదే వారు నిజమనుకొంటారు. కనుక మనం చెప్పేటప్పుడే సత్యాన్ని గురించి ధర్మాన్ని గురించి అవసరాన్ని గురించి చెప్పాలి. కాని మన గొప్పతనాలను వారిపైన రుద్దకూడదు. అపుడే వారు మంచి పౌరులుగా వికసిస్తారు.

- దాసరి రాణి