పఠనీయం

టీవీ సీరియల్స్‌పై సంధించిన వ్యంగాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్టావక్ర నాయికలు.. టీవీ సీరియల్స్‌పై సంధించిన వ్యంగాస్త్రం-
రచన: అత్తలూరి విజయలక్ష్మి, వెల:రూ.120/-, కాపీలకు: విశాలాంధ్ర బుక్ హౌజ్ వారి వివిధ బ్రాంచీలు.
================================================================
వాసవ సజ్జిక విరహాత్కంఠిత, స్వాధీనపతిక, కలహాంతరిత, ఖండిత, విప్రలబ్ద, పోషిత భర్త్రుక, అభిసారిక- అని అష్టవిధ నాయికల గురించి మన శాస్త్రాలు పేర్కొన్నాయి. కాని అష్టవిధ ‘ఉపనాయికలు’ ఎక్కడా ముచ్చటించబడలేదు. అష్టవిధ నాయికలున్నపుడు ఉపనాయికలు ఎందుకు ఉండగూడదు? ఉండాల్సిందే!ఈ కొరత తీర్చటానికి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిగారు సంకల్పించారు. నవలా, కథా రచయిత్రిగా, సమకాలీన సమాజాన్ని ముఖ్యంగా స్ర్తిల గురించి సాధికారికంగా రాసేవారిలో విజయలక్ష్మిగారు పేరొందినవారు. ఎంతో ఆలోచనాత్మకంగా, నేటి ట్రెండ్‌కు విభిన్నంగా హాస్యము, వ్యంగ్యము సమపాళ్ళలో రంగరించి అష్టావక్ర నాయికల (వీరు టీవీ సీరియల్‌లో పుట్టారు)ని సృష్టించారు. హాస్యరసపోషణ కళలన్నింటికెల్లా మేలైనది మెరుగైనది. నాలుగు కాలాలపాటు నిలచేది. హాయిగా నవ్వుకోగలిగి, పాఠకుడిని ప్రాపంచిక ఈతిబాధల్లోంచి కాసేపు బయటికి లాగగలిగే ‘మలామా’ హాస్యం. హాస్యానికి వ్యంగ్యంతోడయితే, పాలకు చక్కెర చేర్చినట్లు స్వాదిష్టంగా ఉండి స్వస్థత చేర్చుతాయి రచనలు. పైకి కనబడని, కచీదెబ్బలా సున్నితంగా మనసుకు తాకి, మనలో నాలుగు కాలాలపాటు నిలిచిపోతాయి. ప్రముఖ హాస్య, వ్యంగ్య రచయిత విమర్శకులు కాలమ్నిస్టు, ఆర్టిస్టు సుధామగారన్నట్లు ‘వంద హితోక్తులు చేయలేని పని ఒక వ్యంగ్యోక్తి సాధించగలదు’.
తీగపాకంలా, జీళ్ళలా సాగే నేటి టీవీ సీరియల్స్‌పై రచయిత్రి తన దృష్టి సారించారు. టిఆర్‌పి (టెలివిజన్ రేటింగ్ పాయింట్)లు పెంచుకోవటమే ముఖ్య లక్షణంగా ‘సాగు’ తోన్న సీరియల్స్‌పై సీరియస్‌గా స్పందించారు.
వెనె్నల్లో పిల్లగాలుల్ని ఆస్వాదిస్తూ ‘ఆఁజా సనమ్ మధుర్ చాందినీ మె హమ్’ అనో ‘సడి చేయకే గాలి సడి చేయబోకే ఒడలి ఒడిలో రాజు పవ్వళించేనే’ అనో రొమాంటిక్‌గా పాడుకుంటూ తన భార్య సుబ్బలక్ష్మి ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని కలలు కనే యువకుడు బాలకృష్ణ. ముందు ‘రచయిత్రి సుబ్బలక్ష్మి’ అనిపించుకోవాలనీ, ఆ తర్వాతే ఏవైనా అని ఆ అల్టిమేటం ఇస్తుంది భార్య సుబ్బలక్ష్మి. గత్యంతరం లేని భర్త, ఆమెలోని రచనా కౌశలానికి ‘కాకా’పడుతాడు. టీవీ సీరియల్ రచయిత్రి సుబ్బలక్ష్మి, లంకా లంఘనానికి ఎదిగిపోయిన ఆంజనేయుడిలా ఎదిగి, దుష్టిత, నీచిత, పాపిత, వంచిత, మదిత లాంటి విలన్ పాత్రల్ని సృష్టించి సీరియలాంతం (అదే జీవితాంతంలా.. పే.25) హీరోయిన్ను కష్టపెడుతుంది. సృష్టించిన పాత్రలు సుబ్బలక్ష్మితో ఇష్టాగోష్టి సలుపుతాయి. చివరకు రాసే కాగితం, కలం కూడా రచయిత్రితో సంభాషిస్తాయి అచ్చు తెలుగు టీవీ సీరియల్స్‌లోలాగ.. ప్రతీ ఎపిసోడ్‌లో ఏదో ఓ అవాంతరం వచ్చి నాయిక ఈ ప్రమాదాలనుంచి తప్పించుకుంటూ, పాఠకులను ఉత్కంఠకు గురిచేస్తుంది.
ఎంతటి జీళ్ళపాకం అయినా, ఎక్కడో ఓ చోట పుటుక్కుమనాలి. కనుక మన అష్టావక్ర ఉపనాయికలు 10వ అధ్యాయంలో.. బగుభ (బబుల్లం భయంకర్) ప్రవేశంతో, రంగ నిష్క్రమణ గావిస్తాయి. బగభ ఫేక్ టీవీ ప్రొడ్యూసర్ అని తేలిపోయి ఆకాశంలో విహారం చేస్తోన్న సుబ్బలక్ష్మి కాళ్ళు నేలకు ఆనుతాయి.
ఇంత సమగ్రంగా, ఇంత హాస్య ఫణితలో ఇంత వ్యంగ్య వచోవైభవంతో టీవీ సీరియల్స్‌పైన రచయిత్రి కల్పించిన ‘సెటైరు’ బహుశా తెలుగు సాహిత్యంలో ఇదే ప్రప్రథమం అనుకుంటాను. ప్రముఖ కార్టూనిస్టు ‘సరిపి’గారి చిత్రాలు పాత్రలకు జీవం పోస్తాయి. టీవీ సీరియల్స్‌లా, కాలక్షేపానికి పనికివచ్చే పుస్తకం ఇది.

-కూర చిదంబరం 8639338675