పఠనీయం

భారతంలో ధర్మగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమహాభారత సారామృతం
రచయిత:చల్లా రామారావు,
పుటలు: 140,
వెల: అమూల్యం
ప్రతులకు: చల్లా రామారావు పురోహితులు,
శివాలయం వద్ద, రావూరిపేట,
వేటపాలెం (పోస్ట్)- 523187,
ప్రకాశం జిల్లా
*
‘్భయాం రతం - ఇతి భారతం. భారతం అంటే ఎప్పుడూ కాంతియందు (జ్ఞాన, విజ్ఞానములందు) మునిగి ఉండేది అని అర్థం. భారతేతిహాసం ఎన్నో విధాలైన ధర్మాలకు, ధర్మ రహస్యాలకు, తత్సంబంధమైన ఎరుకకు (జ్ఞానానికి) కల్పవృక్షం. ఆ వృక్షాన్ని తమ తమ మేధో వైదుష్యాల ప్రతిభతో అనేక కోణాలలో దర్శించి, అసంఖ్యాకంగా అద్భుత రచనల రూపాలలో ఎందరో ఎన్నో అందించారు పాఠక ప్రపంచానికి.
మల్లాది చంద్రశేఖర శాస్ర్తీగారు, డాక్టర్ డి.విద్యేశ్వరి, చందూరి వేంకట సుబ్రహ్మణ్యంగారు మొదలైనవారు ఈవరకే భారతంలోని చాలా విశేషాల గురించి పుస్తకాలు రాసి ఉన్నారు. ఇటీవల ‘శ్రీమహాభారత సారామృతం’ అనే పేరుతో చల్లా రామారావుగారు ఇదే కోవలో భారతంలోని కొన్ని ధర్మసూక్ష్మాలను, నైతిక అనైతిక విషయాలను చర్చిస్తూ ఒక మంచి పుస్తకం రాశారు.
‘అసత్య వచన దోషము లేదు ప్రాణరక్షణ సమయంబున; అతని కొడుకు సచ్చెన యనుమీ’ అని శ్రీకృష్ణుడు ధర్మజునితో అన్నాడు- ద్రోణుడిని వికల మనస్కునిగాను, అస్త్ర సన్యాసిగాను చేయించటానికి. ఈ సందర్భంలో ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగాను, ‘కుంజరః’ అని చిన్నగాను అన్నాడు యుధిష్ఠిరుడు, తనకు అనృత దోషం రాకుండుటకుగాను.
ధర్మరాజు అబద్ధమాడినాడా లేదా అంటూ ఈ విషయం మీద మంచి చర్చే చేశాడు రచయిత 37వ పుట నుంచి 42 వరకు. బాగుంది. చివరకు ధర్మరాజు అబద్ధమాడినాడు అని అనటంలో సందేహం లేదు అనే తీర్మానమే కనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర మహాభారతం ద్రోణపర్వం పంచమాశ్వాసం- వివరణ, విశే్లషణాల సందర్భంలో డాక్టర్ కె.రాజన్న శాస్ర్తీగారు కూడా అలానే విశే్లషించి చెప్పారు.
‘సంజయ రాయబారం ధర్మసమ్మతమైనదేనా’ అనే అంశంమీద 68వ పుటనుంచి నాలుగు పుటలసుదీర్ఘ వ్యాఖ్యానపూర్వక చర్చ ఉంది. చివరకు సంజయ రాయబారం ధర్మ సమ్మతమైనది కాదు అనే తనదైన ఉపపత్తి పూర్వకంగా తన నిశ్చయాభిప్రాయం ప్రకటించారు రచయిత రామారావు.
ఇలా ఈ గ్రంథంలో దేవర న్యాయము, శల్యసారధ్యం, కురుక్షేత్రాన్ని కర్ణుడు ఆపలేడా? దుష్యంతుని ఆంతర్యం మొదలుగాగల 72 పఠనాసక్తి కల్పన చర్చనీయాంశాలమీద విశేషమైన విశే్లషణలు చేశారు గ్రంథకర్త.
భాష చాలా సరళంగాను, సుందరంగాను ఉంది. సరళ గ్రాంథికము- శిష్ట వ్యావహారికాల సమ్మిళితంగా సాగిపోయింది రచన.
అక్కడక్కడ అనవసరంగా కర్మణీ ప్రయోగ పూర్వక వాక్యాలు (పాసివ్ వాయిస్డ్ సెంటెనె్సస్) చోటుచేసుకోవడంతో పఠనంలో రవ్వంత అసౌకర్యంగా అనిపిస్తుంది.
మొత్తంమీద ఈ భారత రసామృత రచన భారతంలో ధర్మగమనం ఎలా ముందుకు సాగింది అనే రక్త్భిర, ఆసక్తికర అంశంమీద చివరి పుటదాగా ఒకే ఊపులో చదివిస్తుంది. తింటే గారెలే తినాలి- విశే్లషిస్తే భారతానే్న విశే్లషించాలి అనే స్ఫూర్తిని కలిగిస్తుంది ఈ పుస్తకం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం