పఠనీయం

నీలిదొర వన్నెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(శ్రీకృష్ణవిలాసము -పద్య సుమాలు)
రచన:నీలకంఠ \ పుటలు:80, వెల:రూ.100/-
ప్రతులకు: నీలకంఠ, ఇం.నెం.1-191, టీచర్స్ కాలనీ, ఆదిలాబాద్ (తెలంగాణ)-504001, ఫోన్:9440037012
===============================================================
తెలుగులో ఎం.ఏ చేసి, సైకాలజీలో ఎంఏ చేసి సైన్సు టీచరుగా పనిచేసి విశ్రాంత ఉపాధ్యాయులు నీలకంఠ చేసిన ప్రథమ రచన ఇది. 61 పేర్లతో నీలిదొర వనె్నలను వివరించారు.
రచయిత కృతజ్ఞతలు అని వ్రాస్తూ ఈ రచనకు కారణం చెప్పారు. ఆటవెలదులు, తేటగీతాలు, సీసాలు, కందాలు మొదలైనవి దేశీ చందమునకు చెందినవే రాయగల్గాను. వృత్తాల జోలికి పోలేకపోయాను అని సవినయంగా చెప్పారు. అయితేనేమీ వారు వ్రాసిన పద్యాలు శ్రీకృష్ణునియందు వారికిగల ప్రౌడ భక్తిని విశదీకరిస్తున్నది. కవిత అంటే మెచ్చని వసంతరావు దేశపాండే ముందుమాటలో నీలకంఠ ఎంచుకున్న ప్రక్రియ ఈ పద్య కవిత్వం సరిఅయినదే అని తన అభిప్రాయం మార్చుకున్నాడంటే నీలకంఠ రచించిన ఈ నీలిదొర వనె్నలు ఎంతగా ఆకర్షించాయో అర్థమవుతుంది. కొన్ని పద్యాల నడక, భావావేశం, అభివ్యక్తి, కల్పనా చతురత చూసి చదవడం ఆపేసి కాసేపు ట్రాన్సులోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి అని వసంతరావు చెప్పడం తెలుగు కవిత్వానికి లేక పద్యానికి ఉన్న శక్తి తెలుస్తున్నది. కవి కొన్ని మాండలికాలను అవసరమైన చోట చెప్పారు. ఉదాహరణకు సిస్తుగ, బళ్ళెక్కము, బోనము. కవి యొక్క ప్రతిభ కొన్ని పద్యాలలో బాగా వ్యక్తమవుతున్నది.
ఉదాహరణకు -ఇష్టదేవతా స్తుతిలో ‘ముక్కంట పెనుమంటలిక్కట్లు పెట్టగా- నిదురెట్లు బోదువో నీలకంఠ’ (పుట 2), ‘చాటుగ నీ యందమ్ము -కాటుక కనులింత జేసి కాంతలు చూడనే’ (పుట 13), సీసమాలికలు (పుట 77), ఆద్యుడైనవాడు ఆత్మస్వరూపుడు, వేదవాక్కులందు వెలసినవాడు, సత్యమైనవాడు సచ్చిదానందుడు, చింతనంబు జేయ జిక్కువాడు! పుట 78లో ‘వేదముల సారమంతయు వెన్నజేసి గీతరూపాన దెలిపెనా కృష్ణయోగి’- సీసమాలికలు ఆయన కవిత్వానికి, వేదాంత పరిజ్ఞానానికి మణిపూసలలాగా ఉన్నవి.
ఈ కవి పద్యాలు ఆయన భావుకతకు, సహజ సన్నివేశ కల్పనకు, వర్ణనా వైచిత్రికి, కొన్ని పద్యాలు పోతనను జ్ఞప్తికి తేవటం, తేటతెలుగులో చెప్పటం- అలా కవి తన ప్రతిభతో ఈ గ్రంథంలో రమ్యంగా రాణించాడు. అష్టవిధ నాయికలను వర్ణించిన తీరు అద్భుతం. మొదటి రచనయైనా మేటిగా కాగలడని విశ్వసిస్తున్నాను. తెలుగు పద్యం మన తెలుగువాళ్ళ స్వంతం. ఇది నమ్మేవాళ్ళందరూ ఈ గ్రంథం చదివి ఆస్వాదించాలని నీలిదొర వనె్నల వెనె్నలలో విహరించాలని కోరుకుంటున్నాను.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ 9849793649