పఠనీయం

కార్టూనిస్టుల ఆల్బమ్ కమ్ ఆటోగ్రాఫ్ బుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల:రూ.350/-
ప్రతులకోసం:నవోదయ బుక్‌హౌజ్
8341450673, 9840372415
*
తెలుగులో కార్టూనిస్టులెంతమంది ఉన్నారు? కార్టూనిస్టులలో మహిళలున్నారా? కార్టూన్లు వేసి నవ్వించే కార్టూనిస్టులు నవ్వు మొహాల్తోనే వుంటారా? తెలుగు కాకుండా ఇతర భాషా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన కార్టూనిస్టులు ఎవరు? వీటన్నిటికీ ఒకే జవాబు-
‘మన కార్టూనిస్టుల రూపురేఖలు’ అనే 416 పేజీల బుజ్జి పుస్తకం. శంకర్ పేరున పెన్సిల్‌తో అసంఖ్యాకంగా బొమ్మలు వేసి, వేస్తున్న శంకర నారాయణగారి సరికొత్త బొమ్మల సంకలనం ఇది.
శంకర్‌గా సంతకం చేసే సత్తిరాజు ‘శంకర్’నారాయణ ఆకాశవాణిలో సంచాలకులుగా పదవీ విరమణ చేశారు. బాపు సోదరుడు అయిన వీరు మొదటినుంచీ బొమ్మలు వేసినా, అరవై సంవత్సరాలు పైబడిన తర్వాత యువకుల ఉత్సాహంతో పోటీపడుతున్నారు. కార్టూనిస్టు ‘బ్నిం’ అక్షజ్ఞ వారి పూనికతో ఈ తెలుగు కార్టూనిస్టుల బుక్ కమ్ ఆల్బమ్ కమ్ ఆటోగ్రాఫ్ బుక్ వెలువడింది. శంకర్ వేసిన 150 మంది తెలుగు కార్టూనిస్టుల మొహాల బొమ్మలతోపాటు, వారి జీవిత వివరాలు, కాంటాక్టు డీటైల్స్, సంతకం, ఇంకా వారి ఒక కార్టూన్ జోడించబడ్డాయి. ఇది ఒక రిఫరెన్స్ బుక్‌లాంటిది.
కార్టూనింగ్ అనేది అసంఘటిత ప్రయత్నం. తెలుసుకోవడానికి, చదువుకోవడానికి, నేర్చుకోవడానికి పెద్దగా అవకాశం కానీ, పుస్తకాలు కానీ అందుబాటులో లేవు. దీన్ని వృత్తిగా స్వీకరించినవారు లేదా అందులో అలా ఎదిగినవారు చాలా తక్కువమంది. ఎక్కువమంది స్వచ్ఛందంగా, హాబీగా, ఆదాయం కాకపోయినా ఫర్వాలేదనే రీతిలో సాగుతున్నారు. ఒక గుర్తింపు మాత్రమే వారికి లభించే ఊరట. తమ కార్టూన్లను పుస్తకాలుగా వెలువరించినవారు కూడా ఎక్కువమంది లేరు.
కనుక ఇలా ప్రాథమికమైన సమాచారంలో, ప్రతి కార్టూన్‌కూ రెండున్నర పేజీలు కేటాయిస్తూ పుస్తకం వెలువరించటం ముదావహం.
ఇందులో 150మంది తెలుగు కార్టూనిస్టులతోపాటు, 18 మంది ఇతర రాష్ట్రాల కార్టూనిస్టులూ, 8 మంది ఇతర దేశాల కార్టూనిస్టుల వివరాలున్నాయి. శంకర్‌గారు చాలా మక్కువగా, శ్రమించి చిత్రించిన బొమ్మల్లో కొన్ని- బాపు, బాలి, మోహన్, సుభాని, బ్నిం.. వగైరా చాలా బాగా పండాయి. మాస్టర్ పీసెస్ మాస్టర్స్ (ఇతర రాష్ట్రాల, దేశాల కార్టూనిస్టుల బొమ్మలు) అన్నీ బాగా వచ్చాయి. 176 మంది చిత్రాలు సేకరించి, వారి మొహాల్లో రూపురేఖల రసాయన మేళవింపు పట్టుకొని చిత్రించడం మామూలు విషయంకాదు. అంతకుమించిన శంకర నారాయణగారు ఇపుడు 83 సం.ల వయోవృద్ధులు. ఆయన గీచిన కార్టూనిస్టుల్లో చాలామంది ఆయనకన్నా వయసులో చిన్నవారు. ఆ విషయం పట్టించుకోకుండా వేయడం ఆయన ఉదారత, ఇతర కార్టూనిస్టుల అదృష్టం.
ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన ‘బ్నిం’ తెలుగు కార్టూనిస్టుల వివరాలు సేకరించి చక్కని రైటప్‌లు రాశారు. సమాచారం సేకరించడం ఒక రకంగా బొమ్మవేయడంకన్నా కష్టం. కొందరు ఇవ్వరు, ఇవ్వలేమని చెప్పరు, కొందరు మనం భరించలేనంత ఇస్తారు. ఈ సమస్య సముద్రాన్ని ఈది నాలుగు వాక్యాల్లో జననం, ఉద్యోగం, బొమ్మలు, పెళ్లి పిల్లలు ఇలా ఒకే నిడివితో, సమాచార లోపం కనిపించకుండా వైవిధ్యంతో చక్కగా వ్యక్తీకరించి సఫలీకృతులయ్యారు బ్నిం.
ఇతర ప్రాంతాల, ఇతర దేశాల కార్టూనిస్టుల గురించి ఒకే పేజీలో ఇచ్చిన బొమ్మలు, సమాచారం బాగున్నాయి.
జర్నలిజం, సాహిత్యం, రాజకీయ రంగాలలో లాగానే ఇక్కడ కూడా వివక్ష ఉంది. 26 మంది ఇతర ప్రాంతాల, దేశాల కార్టూనిస్టులలో ఒక్క మహిళ కూడా కనబడలేదు. అయితే తెలుగులో 150 మంది కార్టూనిస్టులలో రాగతిపండరి, భార్గవి, ధీరజ, పద్మ, రోహిణి, సునీల, ఉష, వాగ్దేవి అనే ఎనిమిదిమంది మహిళలు మాత్రమే కనబడటం కించిత్ ఆనందం.
ఒకప్పుడు ఆంగ్ల సంపాదకులలో ఎక్కువమంది తెలుగు ప్రాంతం నుండి వచ్చారు. సి.వై.చింతామణి, ఎం.చలపతిరావు, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, ఖాసా సుబ్బారావు, కుందుర్తి ఈశ్వరదత్ ఇలా.. అలాగే కార్టూనిస్టులలో మలయాళీలది ఇప్పటికీ అగ్రస్థానం. హిందూ, క్రానికల్ పత్రికల ద్వారా దేశ స్థాయిలో కార్టూన్ పతాకాలు ఎగురవేస్తున్న తెలుగు మిత్రులు సురేంద్ర, సుభానీ అభినందనీయలు.
అక్షజ్ఞ పబ్లికేషన్స్ వారి ఈ పుస్తకం తెలుగు జర్నలిజానికీ, చిత్రకళకూ, పరిశోధనకూ విలువైనది. కార్టూనిస్టులందరికీ గర్వకారణం. శంకర్ నారాయణ, బ్నిం ప్రచురించిన వెంకట్-విద్యాగార్లు బహు అభినందనీయులు.

-డా నాగసూరి వేణుగోపాల్ 9440732392