జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, మే 30: సమాజంలోని వివిధ వర్గాల మధ్య నెలకొన్న అసమానతలు, అసంతృప్తి వల్లే నక్సలిజం ప్రబలుతోందని, తక్షణం దీన్ని రూపుమాపాల్సిన అవసరముందని ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ అభిప్రాయపడ్డారు. చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నాయకులను మావోయిస్టులు హతమార్చడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనన్నారు. దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించడానికి హింస సరైన మార్గం కాదని, తప్పుడు భావజాలానికి యువత ప్రభావితమవుతోందని అన్నారు. అయుధాల ద్వారా అభివృద్ధి సాధిస్తామనుకుంటే పొరపాటేనని, దీనివల్ల పేదలు లబ్ధి పొందుతారని చెప్పడంలో అర్థం లేదని అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన నేషనలిస్టు యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక అసమానతలవల్ల గిరిజనులు, ఇతర వర్గాల్లో అసంతృప్తి పెరిగిపోతోందని, చివరకు అది నక్సలిజం ప్రబలడానికి దోహదపడుతోందని అన్నారు. ‘్ఢల్లీ, ముంబై వంటి నగరాల్లో ఒకపక్క కొద్ది గంటల వ్యవధిలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టేవారున్నారు. మరోపక్క అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన బాలబాలికలకు కనీసం ఒక్కపూట ఆహారం దొరికే భరోసా లేదని’ పవార్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రోజు ‘ప్రత్యేక మార్గాన్ని’ ఎంచుకుంటారని, దీనిని లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీన్నిబట్టి నక్సలిజం ఎలా వ్యాప్తి చెందుతోందో మనం మరువజాలమన్నారు. నక్సలిజం కేవలం శాంతిభద్రతల సమస్య కాదని పవార్ స్పష్టం చేశారు. అసమానత మధ్య నలిగిపోతున్న గిరిజనులను నక్సలిజం ఎప్పటికీ ఉపయోగించుకుంటూనే ఉంటుందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనతో పాటు, రోడ్లు, ఆసుపత్రులు, విద్యా సదుపాయాలను కల్పించాలన్నారు. దేశాన్ని పటిష్ఠపరచడం, సార్వభౌమత్వానికి భంగం కలగకుండా చూడటం పెద్ద సవాలని తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ సైనికులతో పోరాడింది యువతేనని, ప్రస్తుత సమాజంలో మార్పు కోసం యువత పోరాడినప్పుడే నిజమైన స్వేచ్ఛ దరిచేరుతుందని పిలుపునిచ్చారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు, మతకల్లోలాలు రేపి రాజకీయ ప్రయోజనం పొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలను ఎన్‌సిపి తిప్పికొడుతుందని పవార్ పేర్కొన్నారు. (చిత్రం) గురువారం ఢిల్లీలో జరిగిన నేషనలిస్టు యూత్ కాంగ్రెస్ సమావేశంలో తనకు బహూకరించిన కత్తితో శరద్ పవార్
Add new comment