అమృత వర్షిణి

శ్రీపతి సుతుబారికి నేనోపలేక వేడితే కోపాలా? మువ్వగోపాలా? (అమృతవర్షణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిక్కిరిసిన సభా ప్రాంగణం. ఎదురుగా మహా విద్వాంసులందరూ కొలువై యున్నారు. సంప్రదాయ వేషధారణతో యిద్దరు విదుషీమణులు అభివాదం చేస్తూ వేదిక నలంకరించారు.
వారి కట్టూ బొట్టూ సనాతన ధర్మాన్ని ఆవిష్కరిస్తూ సంగీత రసికులకు ఆనందాన్ని కలిగిస్తోంది. కాని వారి మాతృభాష తమిళం. స్వచ్ఛమైన అచ్చ తెలుగులో గానం ఆరంభమైంది. ‘వగకాడ మా కంచి వరద తెల్లవారెననుచు/ మగువ తన కేళికా మందిరము వెడలెన్’ అంటూ అనుపల్లవితో ప్రారంభించిన ఆ క్షేత్రయ్య పదంలోని మోహన రాగంలోని సొగసులు హొయలూ, అందచందాలూ రసజ్ఞుల్ని కట్టిపారేశాయి.
సాహిత్య విషయంలో చూస్తే ప్రబంధ కవుల వర్ణనా చాతుర్యాన్ని తలపింపజేసే వర్ణన పది మోహన రాగ కీర్తనలకు సమాధానం చెప్పగల ఒక్క ఆ పదం.. వింటున్న వారి హృదయాలలో అలా స్థిరమై కూర్చుండి పోయింది.
నాయిక యొక్క ‘కేళికా మందిరం’ అంటే ఏకాంత మందిరం నుండి వెళ్లే నాయిక తన ప్రియుణ్ణి వీడి వస్తున్న భావాలు ఎంతో కమనీయంగా ఆవిష్కరించబడి వీనులవిందుగా వినిపిస్తోంటే రసికులు తన్మయులై వింటున్నారు. గంటన్నర గడిచింది.
మరో నాలుగు పదాలు దాటగానే ‘పున్నాగవరాళి’లో ‘నిన్ను జూచి నాలుగైదు నెలలాయె మువ్వగోపాల!’
‘నిన్ను జూడ గలిగేను ఇన్నాళ్లకు’ అనే పల్లవి అందుకోగానే పున్నాగవరాళి రాగం మత్తులో పడ్డ రసికులను ఆనంద లోకాల్లో విహరింపజేస్తూ సాగుతోంది.
ఎదురుగా కూర్చుని వింటున్న శ్రోతల గుండెలు కాస్త బరువెక్కాయి. నియంత్రించుకో లేకపోయారు. భావోద్వేగానికి లోనయ్యారు. చేతిరుమాళ్లతో కళ్లు తుడుచుకుంటూ పున్నాగవరాళి పదాన్ని అలా హృదయంలో పదిలపరచుకుంటూ ఎకాడమీ నుండి నిష్క్రమించిన దృశ్యాన్ని మరుసటి రోజు వార్తాపత్రికలలో ప్రచురించారు. సమ్మోహనంగా పాడిన ఆ యిద్దరూ వీణ ధనమ్మాళ్ కుటుంబంలోని ‘బృందముక్త’ సోదరీమణులు. వేదిక మద్రాసు మ్యూజిక్ ఎకాడమీ.
* * *
కొన్ని రాగాలు తాత్కాలికంగా కాసేపు ఆనందాన్నివ్వచ్చు. ఆ క్షణంలో కాస్త రక్తిగా ఆకర్షణగా వుండవచ్చు. కానీ హృదయం లోతుల్లోకి వెళ్లి గంభీరమైన సంస్కారాన్నివ్వవు. ఈ విషయం వాగ్గేయకారులకు తెలుసు. కానీ కొన్నికొన్ని రాగాలు మాత్రం గుండెలోతుల్ని స్పృశిస్తూ ఒకవైపు సాహిత్యంతో పెనవేసుకుంటూ మరోవైపు రాగంలోని అందచందాలను అనుభవింపజేసేలా సాగుతూంటాయి.
దీనికి సామాన్య సంస్కారం సరిపోదు. అలా వినగలిగే వారివల్లనే ఈ పదాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాదిలో సంప్రదాయ రాగాలతో పెనవేసుకుపోయిన సంగీత రసికులు ఈ పదాలను అందుకుని ప్రచారం చేయడానికి ప్రధానమైన కారణం ఇదే.
మన తెలుగువాడైన క్షేత్రయ్య (వరదయ్య) వివిధ క్షేత్ర పర్యటన చేస్తూ ఆయా సంస్థానాల ప్రభువుల ప్రాపకంతో పేరు సంపాదించుకోవడం, ముఖ్యంగా తంజావూరు రాజులలో అచ్యుతప్ప నాయకుని కుమారుడైన రఘునాథ నాయకుడి కొలువుకు చేరడం కూడా ఒక కారణం. పైకి శృంగారంలా కనిపించే భక్త సాంద్రమైన ఆధ్యాత్మిక సంకీర్తనలను అన్నమాచార్యులు అందిస్తే, శృంగారాన్ని ప్రధాన వస్తువుగా చేసుకుని, తరంగాలతో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లిన వాడు నారాయణతీర్థులు.
నాట్యాభినయానికి ఉపయోగపడే యక్ష గానాలకు దారి చూపించి, భజన పద్ధతికి మార్గాన్ని సుగమం చేశాడు.
ఈ యిద్దరి కంటె నాలుగడుగులు ముందుకు వేసి ఈ వేళ మనం వింటున్న కాంభోజి, భైరవి, కేదారగౌళ, కల్యాణి, ఆహిరి, నీలాంబరి వంటి అనేక సంప్రదాయ రాగాలలోని సంపూర్ణ స్వరూపాలను తన పదాలలో నింపేసి, కళ్లకు కట్టినట్లు చూపించిన వాడు మన క్షేత్రయ్య.
ఒకో క్షేత్రయ్య పదం ఐదారు కీర్తనలకు సమానం. ఒక్క పదం వింటే చాలు. త్యాగయ్య విరచితమైన నాలుగు విలంబకాల కీర్తనలకు సమాధానం చెప్పగలవు. అతివిలంబ కాలంలో పాడే అటతాళ వర్ణాల్లా వుండే పదాలు, ఈ వేళ నాట్యాభినయాలలో వినిపించటం దాదాపుగా తగ్గిపోయింది. వినేవారు లేరు. పాడేవారు కూడా తగ్గిపోయారు. యింతటి ఖ్యాతిని సొంతం చేసుకున్న క్షేత్రయ్య కృష్ణాజిల్లా వాసి. అచ్చమైన తెలుగువాడు. కూచిపూడికి దగ్గరలోని మొవ్వ గ్రామవాసి.
కర్ణాటక సంగీత పద్ధతిలో క్షేత్రయ్య రాగ స్వరూప చిత్రము అత్యంత మనోహరంగా ఉంటూ రాగాలకు అదివరకెవ్వరూ యిటువంటి అందాన్ని ఆవిష్కరించిన వారు లేరని సంగీతజ్ఞులు భావించే క్షేత్రయ్యగా పిలువబడే వరదయ్యను దాదాపుగా మన తెలుగుదేశం మరిచిపోయింది. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మొవ్వ వేణుగోపాలస్వామి ఆలయాన్ని తన అధీనంలోకి తీసుకుని క్షేత్రయ్య పదాలు వెలుగులోకి రావటానికి కృషి చేయ సంకల్పిచింది. గత కృష్ణా పుష్కరాల సందర్భంగా ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్‌వి ప్రసాద్ తీసుకున్న నిర్ణయ ఫలితమే ఇది.
క్షేత్రయ్య పద సాహిత్య వైభవానికి ఆయన తీసుకున్న ఆలోచన ఆచరణ సాధ్యవౌతుందనే భావం సర్వత్రా వ్యక్తవౌతోంది. ఆయన అభినందనీయుడు. ఈ పదాలు మన ఆంధ్రదేశంలోకంటే దక్షిణాదిలో మారుమ్రోగడం ఆశ్చర్యం కలిగించే విషయం.
1984-85 ప్రాంతంలో సంగీత కళానిధి డా.శ్రీపాద పినాకపాణి, విజయవాడ రేడియో కేంద్రానికి వచ్చి సంగీత శిక్షణ కోసం రెండు క్షేత్రయ్య పదాలు రికార్డు చేశారు. ఆయన ఎదురుగా కూర్చుని శిష్యుడుగా నేర్చుకున్నవి రెండు పదాలు.
ఒకటి మోహన రాగంలో ‘పడకింటికిక పోవలెనే’ రెండోది సారంగ రాగంలో ‘ఎక్కడి నేస్తము’ అనే పదం. రెండుకు రెండే. ఆ పదాలలో వున్న మాటలను ఆశ్రయించుకున్న రాగం నా మనసుకు ఆవహించేసింది. మరికొన్ని పదాలు నేర్చుకోవాలనే ఆశ పుట్టి ఆయనకే ఉత్తరం రాశాను. అప్పుడు పినాకపాణి గారి వయస్సు ఎనభై పై మాటే. ‘పదాలు నేర్చుకోవాలనే కోరిక పుట్టడం విశేషమే. మీదే ఆలస్యం. బయలుదేరి రండి’ అని తిరుగుటపాలో సమాధానం వచ్చింది. కర్నూలులో అడుగుపెట్టి ఆయన ఎదురుగా కూర్చోగానే ‘ఏ సంగీత రచనకైనా పర్యవసానం భావమే. అదే జీవం. భరతముని పేరులోనే ఈ రహస్యముందేమో! ‘్భ’ అనేది భావానికి, ‘ర’ రాగానికీ, ‘త’ తాళానికి గుర్తుగా పెట్టారేమో అనిపిస్తుంది.
నాట్య వేదానికి భరతుడే గదా ఆదిముని! క్షేత్రయ్య పదాల్లోని అర్థవంతమైన మాటలూ, వాటికి తొడిగిన ప్రతి సంగతికీ ఆంగికం కనిపిస్తుంది. భావం కనిపిస్తుంది. గమనించండి’ అంటూ నాకు పినాకపాణిగారు నేర్పిన పదం.
‘ఎవతె తాళునమ్మా! ఈ నడతలు!
ఏమందునే కొమ్మా!’ అఠాణా రాగంలో సర్వాంగ సుందరంగా పాడి వినిపిస్తూ నేర్పారు.
1.కాంభోజి రాగంలో ‘బాల వినవే..’
2.్భరవిలో ‘ముందటి వలె నాపై’
3.సావేరిలో ‘లేమరో మా మువ్వ గోపాలుడు’
4.శహనలో ‘మేరగాదు...’
5.హుస్సేనిలో ‘అలిగిత భాగ్యమాయె’
వంటి పదాలలో ‘రాగదేవతలు’ ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు.
పినాకపాణిగారి మధురమైన కంఠంలో పున్నాగవరాళి లోని ‘నిన్ను...’ భైరవిలోని ‘ముందటి వలె నాపై..’ పదాలు అనన్య సాధ్యం.
ఆ పదాలు నన్ను కదిలించాయి. 10, 12 పదాలు నేర్చుకునే అదృష్టం కలిగింది నాకు.
ఒక్క భైరవి రాగంలోనే ఈ క్షేత్రయ్య పదాలు 40 వరకూ వున్నాయి. వోలేటిగారు తన సంగీత కచేరీలలో పాడలేదు కానీ అభిమానుల కోసం పాడేవారు.
తోడిలో ‘ఇన్నాళ్లవలె గాదమ్మా.. మా మువ్వగోపాలు డెనె్నన్నో నేర్చినాడమ్మా’ అనే పదం- ఒక్కటి పాడగలిగితే చాలు తోడిరాగంలోని ఛాయలన్నీ మనసుకు పట్టేస్తాయి.
అంతేకాదు. అందులోని సాహిత్యం ఎప్పుడూ వినాలనిపించేలా చేస్తుంది.
‘మువ్వగోపాల’ పేరుతో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తీ ఆకాశవాణి కోసం ఒక సంగీత రూపకాన్నిచ్చారు. దానికి వోలేటి సంగీతం నిర్వహించటం, 1,2 పదాలు నేనూ పాడటం మర్చిపోలేని జ్ఞాపకం. పదాలన్నీ అభినయం కోసం పుట్టినవే.
క్షేత్రయ్య పదాలను అభినయించటంలో వీణ ధనమ్మాళ్ మనవరాలైన బాలసరస్వతికి ఎంతో పేరుంది. దక్షిణాదిలో క్షేత్రయ్య పదాలు ప్రసిద్ధమవటానికి ఈ ధనమ్మాళ్ కుటుంబమే కారణం. ‘మాలి’ ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి వారు ధనమ్మాళ్ పదాలు శ్రద్ధగా కూర్చుని నేర్చుకున్న సందర్భాలున్నాయి.
పైకి శృంగారభూయిష్టంగా కనిపించినా లోలోపల అంతర్వాహినిగా పరమాద్వైత భావాన్ని మనం చూడవచ్చు. క్షేత్రజ్ఞుని ఇష్టదైవం మువ్వ గోపాలుడు. క్షేత్రయ్య పదాలలో శృంగార నాయికలు రకరకాల సందర్భాలలో ఆయా పదాల ననుసరించి కనిపిస్తారు.
వరదయ్య సంగీత సాహిత్య నాట్యాభినయాలభ్యసించే రోజుల్లో తన సహపాఠియైన ఒక దేవదాసిని ప్రేమించాడు. ఆమె కూడా చక్కదనంతోపాటు, తెలివితేటలు కలిగినది. క్షేత్రయ్యను పద రచనకు ప్రోత్సహించిన ఈమె పేరు మోహనాంగి. క్షేత్రయ్య ప్రేమను తిరస్కరించిందని చెప్తారు. క్షేత్రయ్యకు మేనమామ అచ్యుతరామయ్య ఒకాయన వుండేవాడు. ఆయన ప్రథమ భార్య సంతానం రుక్మిణిని.. తండ్రి మొవ్వ వేణుగోపాలస్వామికి ధారపోశాడు. దేవదాసీ వ్యవస్థ వున్న రోజుల్లో జరిగిన సంఘటనగా దీన్ని భావించాలి సినిమా కథలా. ఈ యిద్దరు నాయికలకూ క్షేత్రయ్యతో సంబంధం వుంది. కాశీలో విద్యాభ్యాసం ముగించుకుని, కృష్ణా తీరానికి వస్తూ, నూజివీడు దగ్గర ఆగిరిపల్లిలోని శోభనాచల నరసింహుణ్ణి దర్శనం చేసుకుంటాడు. అప్పట్లో నూజివీడు జమీందారులు ఆ దేవుని పేరునే ముందుంచుకుని (శోభనాద్రి అప్పారావు అనే పేరు ఉంది) పిలవబడేవారు. నివాసమున్న రోజులలో క్షేత్రయ్య ఇక్కడ ‘శోభనగిరి’ పదాలు రాశాడు. క్షేత్రయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పటి సంగీత వాతావరణం తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల గోష్టులతో నృత్య సేవాభినయాలతో, లీలాశుకుని శ్రీకృష్ణ కర్ణామృత శ్లోకాలతో ఆ మండలమంతా మారుమోగేది. గొల్ల యానాదుల వంటి దేశి రచనలతో ప్రభావితుడైన వరదయ్య సంగీత నృత్యాభినయాల్లో పండిపోయాడనే చెప్పాలి. పరమభక్తుడైన అన్నమయ్య అలంకార ప్రియుణ్ణి తన సంకీర్తనములతో వర్ణిస్తే, క్షేత్రయ్య యిదే మధురమైన భక్తిని మువ్వగోపాల పదాల్లో దర్శింపజేశాడు.
మొవ్వ చేరుకున్న వరదయ్యకు ఒక యతీంద్రుడు ఉపదేశించిన గోపాల మంత్రంతో (గవాం శాంతం కరోత్యాశు/ గోవిందో గోకుల ప్రియః) పునీతుడైనట్లుగా చరిత్ర.
ఆ మంత్రాన్ని ధ్యానిస్తూ జపిస్తూ, అన్నపానాదులు వదిలేసి, తదేక ధ్యానంలో నిండిపోయిన వరదయ్యకు ఒక విచిత్ర సన్నివేశం కనిపించింది.
ఒకవైపు బాలారుక్మిణియో, ఆలయ నర్తకి మోహనాంగియో తెలియని స్థితిలో మధుర భక్తి సన్నివేశంగా మారిన సందర్భంలో
ఆనందభైరవి రాగంలో ‘శ్రీపతి సుతుబారికి నేనోపలేక నిను వేడితే కోపాలా? మువ్వగోపాలా’ అనే పదం వరదయ్య ఆలపించటంతో క్షేత్రయ్య పద ధార ప్రారంభమైంది. వరదయ్య నాయిక. గోపాలస్వామి నాయకుడైయ్యాడు. భక్తి సంప్రదాయంలో భక్తుడికి గానీ, భక్తురాలికి గానీ నాయకుడైన భగవానుడితో సంబంధం పరకీయమే.
యతీశ్వరుని అనుగ్రహంతో లభించిన మంత్ర జపం ఆవృతులు పూర్తవటంతో మహాకవిగా మారిన క్షేత్రయ్య జీవితమే మారిపోయింది.
ఆ తర్వాత 20 ఏళ్లు కంచిలో వున్నాడు. అక్కడ నుండి నెల్లూరు చేరాడు. ‘పరిమళ రంగపతి’పై పదాలు అల్లాడు. 80 ఏళ్లు జీవించినట్లు చెప్తారు. క్షేత్రయ్య పదాలు వందల సంఖ్యలోనే వున్నా, అద్భుతమైన వచనలై, విలంబ లయలో రాగభావాన్నీ, చతుర్విధమైన అభినయాలనూ ఆవిష్కరించగల అసమానమైన రచనలుగా సంగీతజ్ఞులు ప్రశంసిస్తారు. సుప్రసిద్ధ సంగీతవేత్త, వైణికుడు, ధనమ్మాళ్ శిష్యుడైన రంగ రామానుజయ్యంగార్, కొన్ని పదాలను స్వరబద్ధం చేసి గ్రంథస్థం చేశారు.

చిత్రాలు.. క్షేత్రయ్య
* రంగ రామానుజ అయ్యంగార్, ధనమ్మాళ్

- మల్లాది సూరిబాబు 9052765490