అమృత వర్షిణి

ఆ మధుర గానానికి ప్రాణం సునాదమే... (అమృతవర్షణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు 27 వోలేటి వేంకటేశ్వర్లు జయంతి
**

అప్పటికీ జ్ఞానం రాని శిశువుకూ, ఎప్పటికీ జ్ఞానం తెలియని పశువుకూ జ్ఞానం వున్నా పాలుపోసే వానినే కాటేసే గుణం వున్న భయంకరమైన సర్పాలకూ నచ్చేది సంగీతం - కారణం? నాదం.
శృతి సుఖంలో వున్న మాయే అది.
వెయ్యి ఆవుల్లో లేగదూడ తన తల్లిని ఎలా వెదుక్కుని గుర్తించి అపరిమితానందాన్ని పొందుతుందో గాయకులు ఈ శృతి మాధుర్యం కోసం అలా తపిస్తారు. అందులోనే రమిస్తారు. ఈ లక్షణం ముఖ్యంగా కర్ణాటక సంగీతం పాడే విద్వాంసుల కంటే ఒకపాలు హిందుస్థానీ సంగీతం పాడేవారికెక్కువ. శృతిలో కంఠం నిలిపేందుకు వాళ్లు చేసే సాధన చాలా ప్రధానంగా ఉంటుంది. ఇది కర్ణాటక సంగీతం పాడేవారికి తక్కువ. శృతి మాధుర్యంలోని ‘సుఖం’ చెబితే రాదు. ఎవరికి వారు తెలుసుకోవాలి. ఈ జ్ఞానం కలిగిన గురువుల శిక్షణలో మాత్రమే లభించే అరుదైన లక్షణం ఇది. సంగీతంలో ఓనమాలు తెలియని వారే ‘అపశృతి’ దోషం చాలా తేలికగా ఇట్టే గుర్తిస్తారు.
ఇంక సంగీతం జ్ఞానం తెలిసిన వారైతే, చెప్పేదేముంది? తక్షణం లేచి వెళ్లిపోతారు.
ఓంకార నాదాను సంధానమైన గానానికి రెండే రెండు మూల స్తంభాలు. ఒకటి శృతి. మరొకటి లయ. సంగీత సౌధం పునాది మొత్తం వీటి మీదే ఆధారపడి ఉంటుంది. పరమానందం లభించేది వీటి వల్లనే.. అని తెలిసిన గాయకులే ‘నాదయోగులు’.
తింటే ఆకలి తీరుతుంది.
మంచినీరు తాగితే దాహం తీరుతుంది.
కొంత సమయం గడిచిన తర్వాత మళ్లీ అదే ఆకలి, అదే దాహం.
తాత్కాలికంగా లభించే ఆనందం అలాగే ఉంటుంది. నాదలోలురై బ్రహ్మానందం అనుభవించే వాళ్లకు అసలు ఆకలిదప్పుల సమస్యే ఉండదంటారు. అందుకే త్యాగయ్య నిద్దుర నిరాకరించి, ముద్దుగ తంబురబట్టి శుద్ధమైన మనస్సుతో సుస్వరములతో పరమాత్మను స్మరించే వారికి లభించేది బ్రహ్మానందమని తాను అనుభవించి లోకానికి చెప్పాడు.
నాదోపాసన చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రకాశిస్తున్నారు. ఈ ముగ్గురూ వేదాల నుద్ధరించిన మహానుభావులు. మంత్రాధీనులు అని తీర్మానిస్తాడు కూడా.
‘మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు వోవునే మదనములకు’ అంటాడు పోతన భాగవతంలో.
‘ఆనందమనేది ఎవరి వల్ల లభిస్తోందో ముక్కుపచ్చలారని ప్రహ్లాదుడికి తెలిసినట్లుగా తండ్రికి తెలియలేదంటే అదీ! సంస్కారంలోని తేడా! సంగీతమైనా ఇంతే. ఎవరైనా సరే! రుచి తెలియనంతకాలం ఏం పాడినా, ఎంతకాలం పాడినా మనసులోకి ప్రవేశించదు. ఏదో చెవులలో కాసేపు వినేంత వరకే పరిమితమై కూర్చుంటుంది. అదో రకమైన ధ్వని. ఇంకెందుకా పాట? సంగీతానందం కోసమే. సంగీతం పాడే కొందరు నిజమైన విద్వాంసులు. బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ దాని కోసమే వెంపర్లాడే రుచి కలిగిన శ్రోతల కోసం వెదుకుతారు విద్వాంసులు. అందుకే ‘వక్తా శ్రోతా చ దుర్లభా!’ వినగలిగే చెవులుంటే కనగలిగే మనసుంటేనే అలాటి ఆనందం దొరుకుతుంది - జన్మ సంస్కారమే పునాది.
ఓ అబ్దుల్ కరీంఖాన్, అల్లావుద్దీన్ ఖాన్, ఓ బడే గులామాలీ ఖాన్, ఉస్తాద్ అమీర్‌ఖాన్, రోషనారా బేగం, బిస్మిల్లాఖాన్, భీమ్‌సేన్ జోషి, జస్‌రాజ్, మల్లికార్జున్‌మన్, హరిప్రసాద్ చౌరాసియా లాంటి మహా విద్వాంసుల సంగీతాన్ని వినండి. ‘నాదానుభూతి’కి అర్థం తెలుస్తుంది.
శృతి మాధుర్యంలోని మజా తెలుస్తుంది. నాదానుభూతినివ్వని పాట పాడితేనేమి? పాడకపోతేనేమి? మన కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధులైన నాదయోగులు కొందరున్నారు. వీరికి లౌకిక విషయాల పట్ల ఆసక్తి ఉండదు. సత్కారాలు, సన్మానాలు గిట్టవు. వాటికి దూరంగా ఉంటారు. అలాటి ఉభయ సంప్రదాయాల్లోనూ నిష్ణాతులైన ఉత్తమ సంగీత విద్వాంసుడు వోలేటి వెంకటేశ్వర్లు.
ఈ రోజు ఆయన 89వ జయంతి.
న నాదేన వినా గీతం
న నాదేన వినా స్వరం
అసలు ఈ జగత్తే నాదాత్మకం.
మనిషి వెనకాలే నీడ ఎలా ఏర్పడుతుందో పాట వెనుక స్వరం కూడా అంతే!
మాటకు ప్రాణం సత్యం.
పాటకు ప్రాణం స్వరం.
ఉపాసనలో గాయత్రీ మంత్ర జపానికి ఎటువంటి ఫలితమో నాదోపాసకుని స్వరగాయత్రికి అటువంటి రససిద్ధినిస్తుంది.
సప్త స్వర సుందరులను మనసా, వాచా, కర్మణా అనుష్టించిన నాదయోగి వోలేటి.
ఈమని శంకరశాస్ర్తీ, అల్లంరాజు సోమేశ్వర్రావు, వోలేటి, జానపద గాయనీమణులైన సీత, అనసూయ వంటి అనేక మంది -కాకినాడలోని మునుగంటి వెంకట్రావు పంతులుగారి శిష్యరికంలో పెరిగినవారే. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. అందరికంటే భిన్నమైన శైలి వోలేటిది.
ఆ రోజుల్లో కాకినాడలోని శ్రీరామ గాన సమాజంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో సంగీతం నేర్పుతూ, కేవలం సంప్రదాయ సంగీతానే్న కాకుండా ఇతర బాణీల పట్ల సదవగాహన కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి మునుగంటి.
ప్రధానమైన మేళకర్త రాగాల్లో 2,3 కాలాల్లో అలంకారాలు, స్వర సహితంగా అకారంతో పాడించటం ఆయన ప్రత్యేకత. ఈ సాధన వోలేటికి సంపూర్ణ స్వర జ్ఞానానికి బాట చూపింది.
ఆది గురువు మునుగంటి వెంకట్రావు పంతులైతే మార్గదర్శక గురువుగా శ్రీపాద పినాకపాణి సాహచర్యంతో కట్టుదిట్టమైన సంప్రదాయ సంగీతానికి గట్టి పునాదులు ఏర్పడ్డాయి ఆయనకు.
కాకినాడలోని సరస్వతీ గానసభలో ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులెందరో దక్షిణాది నుంచి వచ్చి కచేరీలు చేసేవారు.
ముఖ్యంగా హిందుస్థానీ సంగీత కచేరీలు కూడా బాగా జరిగేవి.
పెద్దపెద్ద వస్తాదుల గానం, వారి సంగీత ప్రభావం వోలేటి గారి మీద పడింది.
హిందుస్థానీ సంగీతంలో ‘తాన్’ సంప్రదాయానికి వశుడైన వోలేటి, సర్వ లఘువులో స్వర సంచారాలకు అలవాటుపడి తనదైన సొంత శైలిని ఏర్పరచుకున్నారు. ఇదో విశిష్టమైన బాణీ. (తాన్). ఆయన రాగాలాపనలో ఈ తాన్ శైలికి ప్రముఖ వయొలిన్ విద్వాంసులైన లాల్‌గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్ మొదలైనవారు ఈ బాణీకి ముచ్చట పడుతూ వాయించేవారు. వోలేటికి సహకరించడం అదృష్టంగా భావించేవారు.
వోలేటి గారి శిష్యరికంలో నేను నేర్చుకున్న ఎన్నో అపురూపమైన కీర్తనలు, కర్ణాటక సంగీత సంప్రదాయానికి వనె్న తెచ్చే అద్భుత రస గుళికలు. వివిధ భారతిలో నేను ఎనౌన్సర్‌గా ఉండేవాణ్ణి. ఆయన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సంగీత శాఖకు ప్రొడ్యూసర్‌గా ఉంటూ భక్తిరంజని కార్యక్రమంలోనూ, యక్షగానాల రూపకల్పనలోనూ సంగీత రూపకాల నిర్వహణలోనూ ప్రముఖ పాత్ర వహించేవారు.
ముఖ్యంగా ఆయన ఇష్టపడి ఎంతో శ్రద్ధగా చేసిన కార్యక్రమం ‘సంగీత శిక్షణ’. ఆ కార్యక్రమం ఆయనకు ప్రాణ సమానం. తెలుగువారికంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాలలోని ఉత్సాహవంతులైన సంగీత విద్యార్థులు, సభలు, సంస్థలు ఆసక్తితో ఈ కార్యక్రమం వింటూ కీర్తనలు నేర్చుకునేవారు.
వర్ణమైనా, కృతియైనా, రాగ భావం వచ్చేలా పాడాలనే లక్ష్యంగా సాగితే, మనోధర్మం బాగా అలవడుతుందనేవారు. అటువంటి మేరునగధీరుడైన వోలేటికి శిష్యుడవడం నా పుణ్య విశేషం.
ఉభయ సంగీత బాణీలలోనూ సమానమైన ప్రతిభ కలిగిన వోలేటి లాంటి విద్వాంసులు చాలా అరుదుగా ఉంటారు.
ఏయే రాగానికి ఏయే స్వరాలు జీవస్వరాలుగా ఉంటూ రాగ భావాన్ని వెంటనే స్ఫురింపజేస్తాయో ఆ స్వరాలతోనే రాగం ప్రారంభించడం ఆయనలోని ప్రత్యేకత. ఇది హిందుస్థానీ విద్వాంసులలో కనిపించే గుణం.
విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమయ్యే అనేక సంగీత రూపకాలు, యక్షగానాలు మరెన్నో వైవిధ్యభరితమైన అంశాలతోబాటు ప్రధానంగా ఆయన భక్తిరంజని కార్యక్రమం కోసం చేసిన ‘ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు’, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టి, లక్షలాది శ్రోతలకు ఆనందాన్ని పంచాయి.
ఈనాటికీ అవి ప్రసారమవుతూనే ఉన్నాయి. గత శతాబ్దపు జ్ఞాపకాల దొంతరలో ఆకాశవాణి సంగీత వైభవానికి ముఖ్య కారకులలో వోలేటి, ‘రజని’గా ప్రసిద్ధుడైన బాలాంత్రపు రజనీకాంతరావులు ప్రధానమైన వ్యక్తులు. ‘్భక్తిరంజని’ కార్యక్రమాన్ని సృష్టించినది రజని. పెంచి పోషించి సంగీత గౌరవంతో ఆధ్యాత్మిక వాతావరణాన్నిచ్చి జనబాహుళ్యం చేసిన వోలేటి, బాలమురళీకృష్ణ, గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, ఎన్‌సివి జగన్నాథాచార్యులు మొదలగు వారు. తూము నరసింహదాసు, భద్రాచల రామదాసు, ప్రయాగ రంగదాసు, నరసదాసు, నారాయణతీర్థుల తరంగాలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి మొదలైనవి ‘్భక్తిరంజని’ స్థాయిని పెంచిన మధుర మనోజ్ఞమైన రచనలు. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు దగ్గరుండి సాధన చేయించి విద్వాంసులు, పండితులూ, పామరులూ కూడా విని మెచ్చుకునేలా పాడించిన ఘనత వోలేటికి చెందుతుంది.
ఆ రోజుల్లో ఆకాశవాణి ట్రాన్‌స్క్రిప్షన్ సర్వీస్ రికార్డ్స్ ద్వారా వోలేటి, గోపాలరత్నం కాంబినేషన్‌లో ఎన్నో లలిత గీతాలు రికార్డయి జనరంజకమయ్యాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందినవి ‘మనసౌనే ఓ రాధా’ అనే రజని గీతం.. ‘మరు నిముసమో మనదో కాదో’ (రజని), ‘ఆశా! నా ప్రాణ సఖీ’ (రజని), ‘తలనిండ పూదండ’ (దాశరథి).. లాంటి లలిత గీతాలలో వోలేటి, శృతిశుద్ధమైన కంఠంలోని ఒదుగులు విని తీరాలి. ‘రంజని, పూర్వికల్యాణి, బేగడ’ వంటివి పాడుతూ హిందుస్థానీ, కర్ణాటక బాణీలు రెండూ మిళితమైన గమకాలకు వోలేటి పెట్టింది పేరు.
కర్ణాటక సంగీత కచేరీలలో ఓ బుద్ధ విగ్రహంలా కూర్చుని, యోగిలా మారిపోయి, అలసటనేది ఏమీ లేకుండా అలవోకగా త్రిస్థాయిల్లో పాడుతూ చేసే స్వర సంచారాలు, ప్రక్కవాద్య కళాకారులనే కాదు, ఎదురుగా కూర్చుని వింటున్న విద్వాంసుల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూండటం అందరికీ అనుభవైకవేద్యమే.
ఆయన దృష్టి సుస్వరం మీదనే వుండేది - స్వర దేవతలను దర్శిస్తూ గుక్క తిప్పుకోకుండా, సర్వ లఘువు స్వరాలతో ఆరోహణ, అవరోహణ క్రమంలో అకారంతో పాడే రాగాలాపనను అనుసరించడం వయొలిన్ వాయించే వారికి కష్టంగానే ఉండేది. వయొలిన్ విద్వాంసులందరి కంటే ఒక్క ఎం.ఎస్.గోపాలకృష్ణన్ వోలేటితో దీటుగా వాయిస్తూ పూర్తి న్యాయం చేసేవారు.
వింటే వినండి! లేదా ‘నా పాట నేను పాడుకుంటా’ననే ధోరణిలోనే ఉండేది ఆయన పాట. తన ఆత్మానందం కోసమే పాడేవారు. శ్రోతల స్థాయికి దిగిపోవడం లేదు. లోతుగా అధ్యయనం చేస్తూ, అర్థం చేసుకుంటూ వినే సంస్కారవంతమైన శ్రోతలకు ఆయన గానం ఓ మృష్టాన్న భోజనం. అనితర సాధ్యం కూడా.
మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతి.
ప్రముఖ వైణికులు వీణ ఎస్.బాలచందర్ 22 మేళకర్త రాగాలపై సోదాహరణ కార్యక్రమాలు తయారుచేసి మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారం చేశారు. అందులో ‘మేచ కల్యాణి’ (65వ మేళకర్త) రాగంపై ఒక కార్యక్రమాన్ని వోలేటి సమర్పించారు.
మద్రాసు కేంద్రానికి నేనూ కలిసి వెళ్లాను. యిద్దరం కలిసి మూడు కీర్తనలు పాడాం. ఆ కార్యక్రమం విన్న బాలచందర్, ‘వోలేటిగారూ! స్వరానికీ, స్వరస్థానానికీ వున్న అవినాభావ సంబంధాన్ని మీరు ఆవిష్కరించే విధానం ఎంతో బాగుంటుంది’ అని కాసేపు ఆగి, ‘ఇక్కడ చాలామంది విద్వాంసులకీ విషయంలో అవగాహన తక్కువే’ అన్నారు తమిళంలో.
కడుపు నిండా తృప్తిగా తినటం కమ్మని నిద్ర, మంద్ర స్థాయిలో తనకు మాత్రమే వినిపించేలా ఉదయం వేళలో నాదశుద్ధితో పాడుకోవడం ఆయన దినచర్య.
రసహీనమైన లౌకిక విషయాల జోలికి ఏనాడూ వెళ్లేవారు కాదు. తన పాటకు పొంగిపోవడం, పరనిందతో ఇతర విద్వాంసులను విమర్శించడం ఏ మాత్రం ఎరగని విద్వాంసుడు. రెండు సంప్రదాయాల్లో నిష్ణాతుడై, సుస్వరంతో సునాదంతో నిండిన వోలేటి వెంకటేశ్వర్లు వంటి విద్వాంసులు చాలా అరుదుగా జన్మిస్తారు.
తెలుగుదేశంలో కంటే ఆయన విద్వత్తుకు తగిన గుర్తింపు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోనే లభించింది. సత్కారాల కోసం, సన్మానాల కోసం, అవార్డుల కోసం, రివార్డుల కోసం ఎన్నడూ వెంపర్లాడేవారు కాదు.
*

చిత్రం..ఆకాశవాణిలో వోలేటి సంగీత కచేరీ. వాద్య సహకారం: ఎం.ఎస్.గోపాలకృష్ణన్ (వయొలిన్),
క్రొవ్విడి హనుమాన్‌థర (మృదంగం), దత్తాడ పాండురంగరాజు (తంబుర)

- మల్లాది సూరిబాబు 9052765490