అమృత వర్షిణి

నాదస్వర చక్రవర్తి (అమృతవర్షిణి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ కారణం లేకుండా ఈ భూమీద ఎవరి పేరూ శాశ్వతంగా నిలిచిపోదు.
సహజంగా వాసన కల్గిన పుష్పం పుట్టగానే పరిమళాన్ని వెదజల్లుతుంది. పుష్పాలన్నీ కాదు. నిర్దిష్టమైన ఒక ప్రయోజనం కోసం పుట్టి, అది నెరవేరిన మరుక్షణం, వెళ్లిపోతారు - వారి స్వప్రయోజనం కోసం కాదు. అలా వారు పొందిన ఆనందాన్ని నల్గురికీ పంచటమే వారి ధ్యేయం. దాని కోసమే జీవిస్తారు. అందుకే వారు కారణజన్ములు.
సంగీత రంగంలో... నాదలోలురై బ్రహ్మానందాన్ని అనుభవించేసి, లోకానికి, ఆ ఆనందాన్ని పంచిన విద్వాంసులు ఎప్పుడూ ప్రాతఃస్మరణీయులే. ఆదర్శమూర్తులు వారే.
రోజులో కాస్సేపు ఏదో కొంత సమయాన్ని సాధన కోసం కేటాయించి, మిగిలిన సమయాన్ని వ్యర్థ ప్రసంగాలతో వృథాగా కాలక్షేపం చేస్తూ ఫలితం దక్కలేదని వాపోయే వారు ఈ విద్వాంసులను ఆదర్శంగా తీసుకోవాలి.
వీరే నిజమైన నాద యోగులు. వారి సాధనా బలం ఎంత గొప్పదంటే ‘సంసారంలోనే ఉంటారు కానీ సంసార విషయాలేవీ వాళ్లని అంటవు. ఎప్పుడూ వారు ఎంచుకున్న నాదమయ లోకంలోనే విహరిస్తూ రమిస్తూంటారు. ప్రతిక్షణం ఏమరకుండా లక్ష్యం వైపు దృష్టి ఉంటే, లక్ష్యశుద్ధి, తద్వారా లక్ష్యసిద్ధీ లభిస్తుందనటానికి వీరే తార్కాణం.
ఒక్కో వాద్యానికి ఒక్కో కారణజన్ముణ్ణి, దేవుడు సృష్టించి భూమికి పంపేస్తాడేమో! ఆ వాద్యం చెప్పగానే, వాళ్లు మనసుకు స్ఫురిస్తారు.
వీణ అంటే సిద్ధ విద్యాధరి వీణధనమ్మాళ్, వయొలిన్ అనగానే ద్వారం వెంకటస్వామి నాయుడు, మృదంగం పేరు వినగానే పాల్ఘాట్ మణిఅయ్యర్. అలాగే వేణుగానం అంటే ‘మాలి’గా ప్రసిద్ధుడైన టి.ఆర్.మహాలింగం, ఆ తర్వాత ఇటీవలి కాలంలో ప్రసిద్ధుడైన మాండలిన్ శ్రీనివాస్, నాదస్వరం పేరు చెబితే మనసులో స్ఫురించే ప్రసిద్ధ విద్వాంసుడు టి.ఎన్. రామిరత్నం పిళ్లై. వీరు సంగీతం కోసమే పుట్టారు. సంగీతమే ఊపిరిగా జీవించారు. అందరికీ ‘గంధర్వాంశ’ సిద్ధించదు. సంగీతాన్ని ఆధారం చేసుకుని ఆస్తులు కూడగట్టుకోవాలనే ఆశ కంటే సంగీతానందమే పరమావధిగా జీవితాన్ని గడిపిన మహానుభావులు కొందరుంటారు. వేలాది పాటలు పాడేస్తే గాన గంధర్వులైపోరు. నాదయోగులవ్వరు. ‘ఈ మాట చాలా పొదుపుగా మితంగా వాడాలి, కొందరికే వర్తిస్తుందని తెలియాలి.
నాదం రెండురకాలు. ఒకటి ఆహత నాదం, రెండవది అనాహత నాదం- ఒకటి తెలిసేది. మరొకటి తెలియనిది. చెవికి ప్రత్యక్షంగా వినిపించేది ఆహతనాదం. దృగ్గోచరం కానిది ‘అనాహతం’.
మహాయోగులూ, సిద్ధులూ, ఆశ్రయించినది దీనే్న. గలగలా మాట్లాడే పదిమందిలో, నిశ్శబ్దంగా, వౌనంగా కూర్చునే వ్యక్తే, ప్రత్యేకంగా కనిపించి, ఆకర్షణగా నిలుస్తాడు చూడండి - నాద యోగులకు ఈ ప్రపంచంలో లౌకిక విషయాల పట్ల ఆసక్తి వుండదు. నిత్యం బ్రహ్మానందభూతులై ఉంటారు.
అటువంటి వారితో తృప్తిగా సంగీతానందాన్ని అనుభవిస్తూ వింటున్న శ్రోతలను కూడా, ఆ స్థితికి తీసుకెళ్లగలిగిన ప్రజ్ఞాపాటవాలు కలిగిన వేణుగాన విద్వాంసుడు ‘మాలి’. శృతి శుద్ధంగా వాయిస్తూ, తాదాత్మ్య స్థితిలో నాద సముద్రంలో ఈదులాడుతూ, బాహ్య ప్రపంచానుభూతి లేకుండా, శ్రోతలను నాదమయ లోకాల్లో విహరింప చేసిన మహా విద్వాంసుడు.
ప్రత్యక్షంగా కంటే, పరోక్షంగా ఆయనకు ఏకలవ్య శిష్యులు ఎందరో ఉన్నారు. లోకాతీతమైన ప్రజ్ఞా విశేషాలుండటం వల్ల ఆయనలోని వ్యక్తిగత దోషాలు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అతి చిన్న వయసులోనే సంగీతంలో పరిపక్వతను సాధించిన బాలమేధావి. 16వ ఏట నుండియే వయొలిన్, మృదంగాలలో టాప్ విద్వాంసులందరూ ఆయనకు సహకారం అందించటం ప్రారంభించారు. ‘మాలి’ అపారమైన శృతి లయ జ్ఞానం సంగీత శిఖరం మీద కూర్చుండబెట్టిందంటే ఆశ్చర్యంలేదు.
‘కద్దను వారికి (తోడి రాగంలో కీర్తన)
‘కాంభోజి రాగంలో ‘ఎవరి మాట విన్నావో’ వంటి కీర్తనలు ‘మాలి’ వేణుగానంలో భావరస స్ఫోరకమే. ఆ రాగ దేవతలు ప్రత్యక్షంగా కళ్ల ముందు కదులుతున్న భావన కలిగేదట. నిర్దిష్టమైన స్వరానికంటే అతీంగా భావ ప్రధానమైన వినూత్న సంచారాలతో సాగిన ఆయన సంగీతానికి సాటి, మరొకటి లేదని సంగీతజ్ఞులు భావిస్తారు.
‘గమకశుద్ధి - ఆయన వేణుగానంలో కనిపించే ప్రధానమైన లక్షణం.
మాలికి ముందున్న శరభశాస్ర్తీ, పల్లడం సంజీవరావు లాంటి విద్వాంసులందరికంటె మాలిలో ఈ అనుస్వర సహిత గమకాలతో నిండిన వేణుగానం, ఆ మహా విద్వాంసుణ్ణి హిమాలయ పర్వతమంత ఎత్తులో నిలబెట్టాయి. ఆయన వేణుగానం గాత్రధర్మంతో వుండేది - అనుస్వర సహితంగా.
కీర్తన లేదా రాగం వాయించటంలో వీణ ధనమ్మాళ్ సిద్ధిహస్తురాలని పేరు. ధనమ్మాళ్ వద్ద ‘మాలి’ ఎన్నో అపురూపమైన పదాలను, జావళీలను నేర్చుకుని, అనుస్వర సహితంగానూ గమకశుద్ధిగా వాయించటంలో ప్రావీణ్యతను సంతరించుకున్నాడు.
మహాలింగం కచేరీలన్నీ చరిత్రాత్మకమైనవే. రసికులకు ఒక్కో కచేరీ ఒక్కో అనుభవాన్ని మిగిల్చేది. వీటిలో కొన్ని చేదు జ్ఞాపకాలే ఎక్కువ. చాలా కచేరీలు ఆయన కోసమే, అంటే కేవలం తన ఆత్మానందం కోసమే వాయించిన సందర్భాలు అనేకం. (ఎదురుగా వుండే శ్రోతల కంటే) శ్రోతల స్థాయికి దిగిపోయి చప్పట్ల కోసం చేసిన ప్రయత్నం ఏమీ ఉండేది కాదు. ఆయనలో కనిపించేది కాదు.
స్థిమితంగా వేదికపై కూర్చున్నా నిలకడగా కచేరీ చివరి దాకా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి కూడా వుండేది. అనుకున్న సమయానికి కచేరీకి రాకపోవటం, ఆఖరి నిమిషంలో ఆయనకు బదులుగా మరొకరి కచేరీ ఏర్పాటు చేయటం పరిపాటిగా జరుగుతూండేవి.
ఒకవేళ పొరపాటున బుద్ధి కుదిరి మనసు పెట్టి వాయిస్తే మాత్రం ఆ కచేరీ అమృతమయంగా ఉండేది. కొన్ని ఏళ్లపాటు మనసులో నిలిచేది. మహాలింగం కచేరీలు నేను కేవలం మూడు పర్యాయాలు విన్నాను.
ఒకటి నా 15వ ఏట ఏలూరు వైఎంహెచ్ హాలులో త్యాగరాజ గానసభలో జరిగింది. ఆ కచేరీకి తంబురా నేనే వేశాను. వయొలిన్ ద్వారం మంగతాయారు, మృదంగం ఎవరో గుర్తులేదు. కానీ ఆవేళ ఆయన వినిపించిన ‘కల్యాణి’ రాగం గుర్తుంది. ప్రశాంతచిత్తంతో, మందహాస వదనంతో కూర్చుని గౌళరాగంలో, ప్రణమామ్యహం కీర్తనతో ఆ వేళ కచేరీ ప్రారంభమైంది.
అందరి కళ్లూ ఆయనవైపే కేంద్రీకరించి వున్నాయి. ఒక్క ఫ్యాన్ మోత తప్ప, ఇతర శబ్దాలేవీ వినిపించటంలేదు. ఎక్కడా గుసగుసలు లేవు.
నిశ్చలంగా కచేరీ జరుగుతోంది. ఆలోచించి ఆలోచించి వినిపించే సంగతులూ, మధ్యమధ్యలో ఎక్కువసేపు విరామాన్ని పాటిస్తూ, వినేవారికి ఉత్కంఠను కలిగిస్తూ కచేరీ సాగుతోంది. శుద్ధమైన సంగీతం అంటే అదే. దేవతలు మాత్రమే వినే సంగీతం అదే అనిపించేది. ఆ తర్వాత చాలాకాలం తర్వాత 1975 డిసెంబర్ 13వ తేదీన మద్రాసు మ్యూజిక్ ఎకాడెమీలో విన్నాను.
సంగీత సభల వారికి మాట ఇచ్చి, జనం ఎదురుచూడటం, ఆఖరి నిమిషంలో కచేరీలకు రాకపోవటమే ఆయన సంగీత జీవితంలో పెద్ద మచ్చగా మిగిలిందని అందరికీ తెలుసు. దీనికి రకరకాల కారణాలు చెబుతారు. ఆయన బలహీనత ‘ఆల్కహాల్’ ఒక కారణం. ఆ రోజుల్లో వేణుగాన విద్వాంసులలో పల్లడం సంజీవరావు చాలా ప్రసిద్ధుడు. చిన్నతనంలోని చాలా స్వల్పకాలంలో వేణువుపై పట్టుసాధించిన ‘మాలి’ని, తండ్రి రామస్వామి అయ్యర్ ఈ ‘సంజీవరావు’కు తన కుమారుడి, వేణుగానాన్ని వినిపింపచేసే ప్రయత్నం చేశాడు.
ఆ మహావిద్వాంసుని ఎదురుగా కూర్చున్న ‘మాలి’ విరిబోణి వర్ణాన్ని మూడు కాలాల్లో అవలీలగా వినిపించేశాడు. ఆ తర్వాత ‘తోడి’ రాగంలో కీర్తన ప్రారంభించాడో లేదో, సంజీవరావు ఒక్కసారి చిర్రున లేచి ‘వేణువు వాయించే పద్ధతి ఇదా?’ అని రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్లిపోయాడు. అంతే తండ్రీ కొడుకులిద్దరూ నిశే్చష్టులై అవాక్కయిపోయారు.
పిన్న వయస్సులో జరిగిన ఈ సంఘటన మాలి హృదయాన్ని గాయపరచటంలో ఆశ్చర్యమేముంది?
ఆ తర్వాత కొనే్నళ్లు కఠోర దీక్షతో సాధన చేసి, వేణువాద్యంపై పట్టు సాధించారు.
మాలి వేణుగానంలో విలక్షణంగా కనిపించేది గాత్ర ధర్మమే. సాధారణంగా గాత్ర ధర్మం వేరు, వాద్య ధర్మం వేరుగా ఉంటాయి. ఒకవైపు నాదాన్ని పోషిస్తూ గమకాలు అందంగా వినిపించటంలో నాదస్వరానికి ప్రత్యేకత ఉంది.
అలాగే అనుస్వర సహిత గమకాలకు అనువైన వాద్యం ‘వీణ’.
గమక యుక్తంగా పాడగలిగే గాత్రధర్మం కల్గిన విద్వాంసులలో అరియక్కుడి రామానుజయ్యంగార్ ప్రసిద్ధుడు. వీణధనమ్మాళ్ వీణావాద్యంలో ఈ అనుస్వరం, గమకం కనిపిస్తాయని విజ్ఞులు చెప్పే మాట.
అసాధ్యమైన ఈ గాత్ర ధర్మాన్ని తన వేణుగానంలో అద్వితీయంగా పలికించగల దిట్ట ‘మహాలింగం’. కొన్ని గాత్రంలో పలికించే సంగతులు బాగుంటాయి. వాద్యంలో మాత్రమే పలికించగల సంగతులు మరికొన్ని ఉంటాయి. అవి వాద్యానికే పరిమితం. ఇందులో సవ్యసాచి మహాలింగం.
కర్ణాటక సంగీత రంగంలో చిరయశస్సును, అఖండమైన కీర్తిని సంపాదించుకున్న మరో విద్వాంసుడు నాదస్వర చక్రవర్తిగా ప్రసిద్ధుడైన టి.ఎన్.రాజరత్నం పిళ్లై. ఈయన వాద్యాన్ని వినని సంగీత విద్వాంసుడు లేరంటే ఆశ్చర్యం లేదు. నాదస్వరం నేర్చుకునేవారే కాదు గాత్ర సంగీతం పాడే వారు సైతం రాజరత్నం పిళ్లై వాద్యాన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ‘ఆయన రాగాలాపనా శైలి అనితర సాధ్యం. ఒక రాగ స్వరూపం తెలియాలంటే ఆ రాగానికో మూర్ఛన ఉంటుంది కదా! ఆరోపణ, అవరోహణ మాత్రమే తెలిస్తే సరిపోదు. ఆ స్వరాలను ఆ రాగానికి ఎలా అన్వయించాలో తెలియాలి. అదే కర్ణాటక సంగీతానికి గల ప్రత్యేకత.
ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ రాజరత్నం పిళ్లై నాదస్వరంలో రాగం, అందరూ పాడే దానికంటే ఎంతో వైవిధ్యంతో వుండేది. ఊహకందని అనేక స్వర సంచారాలు వివిధ గతులలో నడుస్తూ, సంగీత విద్వాంసులనూ రసికులనూ ఆనందాశ్చర్యాలకు గురిచేస్తూండేవి.
ఆయన మనోధర్మమే వేరు. నాదస్వర వాద్యం కోసమే పుట్టిన మహా విద్వాంసుడు- అనేక మంది నాదస్వర వాద్య విద్వాంసులు ఆయనను అనుసరించే ప్రయత్నం మాత్రం చేశారు. కానీ అనుకరించేందుకు శక్యం కాని విచిత్రమైన బాణీ రాజరత్నం పిళ్లైది.
కేవలం ఆరున్నర నిమిషాలలో ఆయన వాయించిన తోడి రాగం ఆలాపన ఒక్కటే కర్ణాటక సంగీత చరిత్రలో చిరస్థాయిగా, శాశ్వతంగా నిల్చిపోయింది. విద్వాంసులకూ, విద్యార్థులకూ, సంగీత రసికులకూ ఒక పరిశోధనాంశంగా మిగిలిపోయిందంటే, ఆశ్చర్యంకాదు.
ఆ రోజుల్లోనూ ఇప్పుడూ కూడా, నాదస్వర వాద్యం పెళ్లిళ్లలోనో శుభకార్యాల్లోనో మాత్రమే వినిపిస్తుంది. టి.ఎన్.రాజరత్నం పిళ్లై నాదస్వరానికి కచేరీ గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి. విపరీతమైన కీర్తి లభించినా చిక్కే. విషయలోలురై పోతారేమో. రాజరత్నానికీ ఆల్కహాల్ దౌర్బల్యం ఉండటంతో ఎక్కువకాలం జీవించకపోవటం మన దురదృష్టం.
ఆ రోజుల్లోనే ఆయన కీర్తిప్రతిష్టలు మిన్నంటాయి. గ్రామఫోన్ రికార్డింగ్ కంపెనీ వారు, ‘రాజరత్నం పిళ్లై’ రాగాలను మాత్రమే రికార్డులుగా విడుదల చేశారంటే, ఆనాటి సంగీత రసికుల అభిరుచి ఎటువంటిదో ఊహించవచ్చు.
ఒక అర్ధశతాబ్దం పాటు కర్ణాటక సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తి - టిఎన్‌ఆర్.
మన తెలుగు గడ్డ, అవనిగడ్డకు సమీపంలోని ఒక కుగ్రామానికి చెందిన ‘దాలిపర్తి పిచ్చహరి’ నాదస్వర వాద్యంలో రాజరత్నం పిళ్లై శైలి, ప్రస్ఫుటంగా కనిపిస్తుందంటారు. పిచ్చహరి ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శిష్యులు.
టిఎన్‌ఆర్‌కు గురువు ప్రముఖ వయొలిన్, గాత్ర విద్వాంసుడు తిరుక్కోడిక్కావల్ కృష్ణయ్యర్. అంటే సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌కు అత్యంత సమీప బంధువు (మేనమామ).
కృష్ణయ్యర్ బేగడ వర్ణం గమకంగా పాడి వినిపిస్తోంటే, రాజరత్నం పిళ్లై మాత్రం ఆ స్వరాలను పొడిపొడిగా వినిపించటం ప్రారంభించాడుట ఓసారి. అంతే! కోపంతో ఊగిపోతూ కృష్ణయ్యర్ తన వయొలిన్ కమాన్‌తో కొట్టి మందలించడం.. రాజరత్నం పిళ్లై జీవితంలో మరచిపోలేని సంఘటన. ఆ సంఘటన తర్వాత నా జీవితంలో గమక శుద్ధిగా లేకుండా ఏనాడూ నాదస్వరం వాయించి ఎరగను అన్నారు ఒక ఇంటర్వ్యూలో.
నాదస్వరానికి సహకారంగా ‘ఒత్తు’ అని శృతి వాద్యం ఉంటుంది - దాని స్థానంలో తంబురా శృతిలో నాదస్వరం వినిపించిన ఏకైక విద్వాంసుడు పిళ్లై. గ్రామఫోన్ రికార్డుల్లో ‘తంబురా’ వినిపించటం విశేషం. సంగీత లోకంలో సృజనాత్మకమైన, అపూర్వమైన మనోధర్మ సంగీతానికి రాజరత్నం పిళ్లై అగ్రగణ్యుడు.
అపూర్వంగా, అనన్య సామాన్యంగా సాగిన కచేరీల రికార్డింగులు అదృష్టం కొద్దీ లభ్యవౌతూ సంగీత రసికులకు ఆనందాన్నిస్తూనే ఉన్నాయి.
ఇంటినీ, కన్నతల్లిదండ్రులను వదిలేసి, భక్తితో సంగీతానే్న నమ్ముకుంటూ గురువుల్ని ఆశ్రయించి, అదే పరమార్థంగా భావించిన అలనాటి విద్వాంసుల అనుభవాలు నేటి తరానికి పాఠాలే.

-మల్లాది సూరిబాబు 9052765490