ప్రార్థన

క్రీస్తు మంచి కాపరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మంచి కాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును’ - యోహాను 10:11.
ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో? ఎటు వెళ్లవచ్చో? ఎటు వెళ్లకూడదో? తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో ఎటు క్షేమమున్నదో అనే అయోమయ గందరగోళ పరిస్థితులలో ఉన్న మనకు ఒక శుభవార్త. మనలను మంచి మార్గములో నడిపించటానికి, అపాయము నుండి తప్పించటానికి, ఈ లోక ఆటుపోట్ల నుండి, దుష్టుల బారి నుండి దొంగల బారి నుండి గొఱ్ఱెల లాంటి మనలను తోడేళ్ల నుండి కాపాడుటకు దేవుడే మహిమను వదలి మహిలోనికి కాపరిలా వచ్చాడు. మనతోనే మనలోనే ఉంటూ శత్రువుల నుండి కాపాడటానికి, నెమ్మదిగల జీవితమివ్వటానికి వచ్చిన మంచికాపరి యేసు ప్రభువు. మంచి కాపరులు లేక గొఱ్ఱెలు దోపుడు సొమ్మయి, సకలమైన అడవి మృగములకు ఆహార మాయెను. గొఱ్ఱెలను గురించి విచారించే కాపరులు లేరు. మేపేవారు లేరు కాని తమ కడుపు మాత్రమే నింపుకొనేవారు ఎక్కువయ్యారు. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా - ఇదిగో నేను నేనే. నా గొఱ్ఱెలను వెదకి కనుగొందును. చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించే కాపరి యేసు. దారి తప్పిన వారిని మంచి మార్గములోనికి తెస్తాడు. జిగట గల దొంగ ఊబిలో ఉన్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉన్నా విడిపించగల కాపరి యేసు. ఆయన స్వరము వినినప్పుడు వెంబడించటం మన వంతు.
అనేక మంది కాపరులు గొఱ్ఱెలను కాయుచున్నారు గాని వారి ప్రయోజనమే ఎక్కువగా చూసుకుంటున్నారు. క్రొవ్విన గొఱ్ఱెలను వధించి, క్రొవ్వు తిని, బొచ్చు కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు. ఈ రోజుల్లోనే కాదు మూడు వేల సంవత్సరాల క్రితం కూడా పరిస్థితులు ఇంచుమించు ఇంతే ఉన్నాయి. మంచి కాపరి అవసరత ఎరిగిన దావీదు మహారాజు ‘యెహోవాయే నా కాపరి’ అని కీర్తన వ్రాసుకొన్నాడు. ఆయనే గొఱ్ఱెల కాపరి కనుక మంచి కాపరి లక్షణాలు ఆయనకు బాగా తెలుసు. ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహము వచ్చినప్పుడు ప్రాణానికి తెగించి వాటిని చంపి గొఱ్ఱెలను కాపాడిన కాపరి కనుక కాపాడటం ఎలాగో తెలుసు. అసలు ఆ సమయములో తనను కాపాడింది యెహోవాయేనని ఎరిగిన దావీదు ‘యెహోవాయే నా కాపరి’ అన్నాడు (కీర్తన 23)
ప్రాణానికి తెగించి గొఱ్ఱెలను కాపాడిన దావీదు కంటె, మనలను కాపాడటానికి, రక్షించడానికి, పరలోకానికి చేర్చటానికి తన ప్రాణానే్న అర్పించిన యేసు నిజమైన మంచి కాపరి. ప్రేమగల కాపరి. జ్ఞానవంతుడైన కాపరి. ఎటువంటి పరిస్థితుల నుండియైనా కాపాడగలిగిన ప్రభువు. దానికి ఒకటే షరతు. మనం ఆయన స్వరం వినాలి. ఆయననే వెంబడించాలి. ఆయనే మార్గము, ద్వారము. నా యొద్దకు వచ్చువారిని నేను ఎన్నడును త్రోసివేయను అని వాగ్దానము ఇచ్చిన ప్రభువు - ఇచ్చిన మాటను నెరవేర్చే కాపరి.
మన తప్పులు పాపాలు ఆయన మీద వేసుకొని మనము భరించవలసిన ఆ ఘోరమైన యాతన, శిక్ష ఆయన భరించి సిలువను మోసి, మన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ప్రాణానే్న బలి ఇచ్చి - మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని నశింపజేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు సిలువ మరణము పొంది - మరణపు ముల్లును విరిచాడు. మరణముపై విజయం సాధించాడు. మనలో ఉన్న మరణ భయాన్ని తీసివేసి నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని అని సెలవిచ్చాడు. గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేనే వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
నాకు మొఱ్ఱ పెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను అన్న దేవుడు - ఎటువంటి పరిస్థితిలో ఉండి మొఱ్ఱ పెట్టినా నీకు ఉత్తరము ఇచ్చి రక్షిస్తాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని పిలిచిన ప్రభువు పిలుపు విని ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఆయన కాపుదల నిత్యము ఉంటుంది.
దేవుని కాపరిగా గల జనులకు ఏ కొదువ ఉండదు. ఆయన వారి ప్రతి అవసరతను తీర్చును. ప్రతి కోరిక తీరకపోవచ్చు కాని ప్రతి అవసరత తీరుస్తాడు. మనకు ఏవి అవసరమో మన కంటె ముందుగా మన దేవునికి తెలుసు. కనుక ఏ కొదువ రానియ్యడు. దేవుని బిడ్డలు అంటే ఆయన మందలో ఉన్నవారు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతించకూడదు. ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు. అయినను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ‘దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. శారీరకముగా ఆధ్యాత్మికముగా ప్రతి అవసరము తీర్చును. నిన్ను విడువను. ఎడబాయను’ అని సెలవిచ్చిన ప్రభువు మనతోనే ఉండి పచ్చికగల చోట్ల పరుండజేయును. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించును. అలసిన ప్రాణమునకు సేదతీర్చును. ఈ లోకములో శోధనలలో అలసిసొలసి ప్రాణము విసిగి పడిపోయే పరిస్థితులు ఎదురైనప్పుడు కాపరి గమనించి దగ్గరకు చేర్చుకొని ప్రాణమునకు సేద తీర్చి నీతిమార్గములలో నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయయైన భయముండదు. మృత్యుంజయుడే మన కాపరి గనుక చివరకు మరణ భయము మనకు ఉండదు. ఆయన దుడ్డుకఱ్ఱ, ఆయన దండము మనలను ఆదరించును. అత్మాభిషేకముతో పొంగి పొర్లే తృప్తిగల జీవితాన్ని ఇస్తాడు. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట ఉండును. కాపరి ముందు నడుస్తూ కృపాక్షేమములను మన వెనుక ఉంచి చిరకాలము యెహోవా మందిరములో ఉండుటకు నడిపించే కాపరిని - మంచి కాపరిని వెంబడింపటానికి త్వరపడుదము.

-మద్దు పీటర్ 9490651256