అమృత వర్షిణి

సంస్కారం లేకపోతే సంగీతం ధ్వని మాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటకు పరవశించని వారుండరు. వీనుల విందైన పాటకు ఆకర్షణ సహజంగానే ఉంటుంది. పాటకు పరిమళాన్నిచ్చేది రాగమే. రాగం లేకుండా పాట తిన్నగా హృదయానికి చేరదు. సాహిత్య సరస్వతికి ‘నాదం’ చీర, పద సముదాయమంతా దేహం. అర్థం ప్రాణం. భావం ఆత్మ. వ్యవహారమంతా ‘నాదం మీదే ఆధారపడి ఉందంటా’రు ఆచార్య తిరుమల. గాయకుడు కవి కాకపోయినా ఫరవాలేదు. కానీ కవి హృదయంలో మాత్రం ఒక గాయకుడుండి తీరాలి. అజ్ఞాతుడైనా ఫరవాలేదు. లేకపోతే హృదయాకర్షక శక్తి లోపించి పోతుంది.
పాటకు సృష్టికర్త కంపోజర్ లేదా సంగీత దర్శకుడైతే, పాడేది గాయకుడు. పాటలోని మాటలకు ఎంత ఊతమివ్వాలో, ఎక్కడ నాదాన్ని బాగా పూరించాలో సంగీత దర్శకునికంటె గాయకునికే ఎక్కువ తెలుస్తుంది. ఈ పట్టూ విడుపులూ తెలిసి పాడే పాట పది కాలాలపాటు నిలుస్తుంది. గాయకులవల్లే బయట ప్రపంచానికి పాట పరిచయం అవుతుంది. గాయకుణ్ణి తల్లిలా భావించండి. స్వరకర్తను తండ్రిలా భావించండి. తల్లీ తండ్రీ, తానే అయి బాధ్యత వహించే తల్లి పెంపకంలో పెరిగిన సంతానం ఎలా పేరు సంపాదిస్తుందో, అలాగే స్వరకర్త అయిన గాయకుని పాటలు, ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాయి.
సంగీతం చేసేవారందరూ పాడలేకపోవచ్చు. గాయకులందరూ పాటలు కట్టలేకపోవచ్చు. అందుకే సంగీత హృదయమున్న కవులూ, కవి హృదయం వున్న గాయకుల్ని ఎప్పుడూ తలుచుకుంటాం. ‘సాహిత్యం’ అంటే సినిమా పాటల్లోనిదే సాహిత్యమనీ, సంగీతం అంటే సినిమా సంగీతమే సంగీతం అనుకునేవారు. కవిత్రయం వారిని, తలుచుకోకపోవచ్చు. సంగీతమూర్తి త్రయం వారి అవసరమూ లేకపోవచ్చు.
ఊటీలోనో, కొడైకెనాల్, కులూ మనాలి లోయల్లోనో ఏ/సి గదులున్న స్టార్ హోటల్స్‌లోనో కూర్చుంటే తప్ప కొందరు సినిమా కవులకు మూడ్ రాదు. సంగీత దర్శకులూ అంతే. (ఎంత ఖర్చైనా వెనుకాడని నిర్మాతలుంటారు) కొరడా దెబ్బలు తింటూ, జైలు గదుల్లో నాలుగు గోడల మధ్య కూర్చుని కాలం వెళ్లదీస్తూ, రామనామ ధ్యానం తప్ప మరేమీ ఎరగని భద్రాచల రామదాసుకు ‘మూడ్’ ఎలా వచ్చింది? ఆ పల్లవులెలా పుట్టాయి? వారికి ఆ బలం ఎక్కడిది? కూర్చున్న చోటు వదలకుండా, ఎవరినీ రూపాయి ఆశించకుండా, వారానికోసారి ఉంఛవృత్తి చేస్తూ, తనను నమ్ముకున్న శిష్యులకు అన్నం పెట్టి పోషిస్తూ, ప్రభాతవేళ లగాయితు పవ్వళింపు సేవ వరకూ ‘పాటే’ పరమావధిగా బ్రతికిన త్యాగయ్యకు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పల్లవులు? ఎవరిచ్చారా శక్తి?
-మరవకు మన్మథరూపుని మనసా!
‘తెర తియగరాదా నాలోని తెర తీయగరాదా!
-దొరకునా యిటువంటి సేవ?
-బంటు రీతి కొలువీయవయ్య రామ!
-శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా
-ద్వైతము సుఖమా! అద్వైతము సుఖమా?
-నన్ను విడచి కదలకురా! రామయ్య రామా!
-ఒకటే మాట ఒకటే బాణము, ఒక పత్నీవ్రతుడే వంటి రామబాణం లాంటి పల్లవులన్నీ త్యాగయ్యను ఎంతో ఎతె్తైన కీర్తి శిఖరం మీద కూర్చోబెట్టేశాయి. ఎవరూ దాటలేని సంగీత శిఖరం అది. రామభక్తి సామ్రాజ్యానికి మకుటంలేని రాజును చేశాయి.
ఏ కీర్తనైనా చూడండి. ఒక్కటే పాదం. నాలుగే మాటలు. త్యాగరాజు ఆత్మ విచారమంతా అందులో ఉంటుంది. సంగీతానికి భాష లేకపోవచ్చునేమో కానీ భాషకు సంగీతముంది. సప్తస్వరాలను బీజాక్షరాలుగా భావించి, రాగ సముద్రంలో నిలబడ్డ త్యాగయ్యకు మాటలు ‘మేం ఎక్కడ? మేం ఎక్కడ?’ అని పరాయి స్థలంలో చోటు వెతుక్కున్నట్లు కనిపించలేదు.
ఆయనలోనే వున్నాయి. ఆయనతోనే నడిచాయి. జాలరికి వలలో చేపలు చిక్కినట్లుగా, మధురమైన మాటలన్నీ త్యాగయ్యకు లొంగిపోయాయి.
ఏకాదశి రోజులలో సాయంసంధ్య వేళ, శిష్యులందరూ గుమిగూడగా, తాదాత్మ్య స్థితిలో మైమరచి పాడేవారట త్యాగయ్య.
విలంబ కాలంలో, విశ్రాంతిగా, కీర్తన ప్రారంభించిన మరుక్షణం శిష్యులందరూ వౌనంగా ఉండిపోయి, ఆయన పాటను తదేక దృష్టితో ఏకాగ్రంగా వినేవారట. పల్లవి ప్రారంభమైన చాలు - వారికి మహదానందమే. త్యాగయ్యగారి కీర్తనల అనుపల్లవులను గమనించండి. విమానం టేకాఫ్ చేసినట్లే ఉంటాయి. పాడగలిగి అందుకునే వారికీ, సంగీత సంస్కారం వున్నవారికే తెలుస్తుందీ రహస్యం. తారస్థాయి షడ్జంలో ఆయన స్థాయి నిలిపి పాడుతూంటే అశ్రుధారలతో శిష్యుల కళ్లు చెమ్మగిల్లేవని త్యాగయ్య గారిని దర్శించిన తూము నరసింహదాసు తన అనుభవాన్ని వివరించారు. మాటలను అనుభవిస్తూ, రాగంతో ముద్దగా అయిపోయినపుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేము. త్యాగయ్య ప్రాణమంతా కీర్తనలలోని అనుపల్లవిలో ఆవిష్కరించబడి, నాదమయ లోకంలో విహరింపజేస్తుందని సంగీతజ్ఞులు ముక్తకంఠంతో చెప్తారు. అనుభవించటం తెలియాలి. తేలియాడుతూ పాడే నాదలోలురు మనకు దొరకాలి. త్యాగయ్యగారి కీర్తనల శైలిని అనుకరించి కొందరు కీర్తనలు రాశారు. వారి పేర్లు పక్కన బెట్టారు. ఆ గౌరవం త్యాగయ్యకే దక్కాలని భావించారు. త్యాగయ్య నాదయోగి, కవి, గాయకుడు కాబట్టి ఆయన నోటి వెంట వచ్చిన ప్రతి మాటా రాగసుధా రసమై ఒప్పింది. కొన్ని కీర్తనలు ఆయనవి కాకపోయినా త్యాగరాజు ముద్రతో ప్రచారమయ్యాయి. ఈ వారసత్వాన్నీ సంగీత సాహిత్య సర్వస్వాన్నీ భావితరాలకు అందించవలసిన బాధ్యత విద్వాంసులందరికీ వున్నది.
అసలు ఈ సంపద తెలుగులో వుండడం తెలుగు జాతి పురాకృత పుణ్యం. పాటలను కంపోజ్ చేస్తున్నప్పుడు నాకు త్యాగరాజస్వామియే మార్గదర్శి. పల్లవి, అనుపల్లవి, చరణాలు రాగభావంతో చక్కగా అమర్చుకుంటూ పాడిన మహానుభావుడు. ఆయన చూపించిన మార్గానే్న నేను అనుసరించే ప్రయత్నం చేశాను’ అని సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి నాకింకా గుర్తే.
వెనకటి రోజుల్లో కవులు రాసిన గీతాలు చూడగానే సంగీత దర్శకులకు తటుక్కున ట్యూన్ మనసులో స్ఫురించేది. రాగం కనిపించేది. బీటు రూటు కాద. స్వరాలకు నెయ్యం వుండేది. సుస్వరంతో కూడిన వాద్యాలతో అందమైన షోకేసులా పాటలను కంపోజ్ చేసి, పాడించేవారు. మరోసారి వినాలనిపించేది. భూతద్దం పెట్టి వెదికినా అటువంటి పాటలు దొరకవు... ఇపుడు వినలేం. కూరలను ముక్కలుగా తరిగి, నూనెలో వేగించేస్తే ఏ కూర అయినా బాగుందని తినేస్తారు. శ్రద్ధగా మనసు పెట్టి అనుభవంతో వండిన ఘుమఘుమలాడే, పదార్థం తృప్తిగా, పరమానందంగా తిన్న తర్వాత అంత రుచిగా చేసిన వాణ్ని మెచ్చుకోకుండా ఉంటారా? పక్కవాడితోనైనా ఆ ఆనందాన్ని పంచుకుంటారు. శృతిలోనే ఉంటుంది. లయబద్ధంగా వినిపిస్తుంది. ఒక్కసారి కంటే వినబుద్ధి కాదు. ఇంకెందుకు ఆ పాట?
సంప్రదాయ సంగీతానికి పెద్ద పీట వేసే మదరాసు (చెన్నై) నగరంలో సంగీత విద్వాంసుల సంఖ్య, ఇక్కడ కంటే చాలా ఎక్కువ. సంగీత కచేరీ వినకుండా ఇళ్లకు వెళ్లరు, అక్కడ సంగీత రసికులు. ఎక్కడో ఒకచోట ఏదో కచేరీ ఉంటూనే ఉంటుంది పుష్కలంగా. అక్కడ ఎప్పుడూ సంగీత వాతావరణమే. ఎప్పుడూ గుళ్లూ గోపురాలూ కళకళలాడుతూ ఉంటాయి. ఎక్కడో ఓ చోట నాదస్వర వాద్యం హాయిగా వినిపిస్తూంటుంది.
తెలుగువారి దౌర్భాగ్యం ఏమిటో? సంప్రదాయ సంగీతాన్ని ప్రోత్సహించే తెలుగు ఛానెల్సు లేవు. కార్యక్రమాలూ వుండవు. అక్కడ బీభత్సంగా వరదలు సంభవించినా, సునామీ సంభవించినా, సంగీతాన్ని వాళ్లు వదలరు. సంగీతం వారిని వదలదు. కావేరీ తీరంలోని గొప్పతనమేమో? నారాయణతీర్థులు, సదాశివ బ్రహ్మేంద్రుల వంటి యోగులు, వాగ్గేయకారులు, విద్వాంసులు కావేరీ తీరానికే చేరి స్థిరపడ్డారు.
ఆహార విహారాలను బట్టే ఆలోచనలుంటాయనటానికి ఇది చిన్న ఉదాహరణ. గోష్టిగాన పద్ధతిలో భజన సంప్రదాయాన్ని నెలకొల్పిన పరమ భక్తులలో నారాయణ తీర్థులు ప్రముఖులు. పరవశింపజేసే పల్లవులను జనానికి అందించిన మహనీయుడు, త్యాగయ్యకు పరమేష్టి గురువు నారాయణ తీర్థులవారు.
శొంఠి వెంకట రమణయ్య తండ్రి వెంకటసుబ్బయ్య సాక్షాత్ తీర్థులవారి శిష్యుడు. తీర్థుల వారిది గుంటూరు జిల్లా కాజ గ్రామం. ఒకప్పుడు ఇళ్లల్లో మన బామ్మలు, అమ్మమ్మలూ, తాతమ్మలూ నారాయణ తీర్థుల వారి తరంగాలు పాడుకుంటూ వుండేవారు. ఈ మధ్య కాజలో తీర్థుల వారి ధ్యానమందిరం కట్టారు. ఆంధ్రదేశంలో తీర్థుల వారి శిష్యులు నాలుగు చెరగులా విస్తరించి, నేర్చుకుని, ఈ తరంగాలు పాడేవారు.
వారిలో ఘంటసాల మేనమామ ర్యాలి పిచ్చయ్యశాస్ర్తీ ఈ తరంగ గానంలో దిట్ట - ఘంటసాల గానానికి రుచిని కల్పించినవి ఈ తరంగాలే - ఏలూరులో, పిచ్చయ్య శాస్ర్తీ పాట విన్నాను. వెనుకటి రోజుల్లో హరికథా కాలక్షేపం చేసే భాగవతార్‌లు విరివిగా ఈ తరంగ గానం చేస్తూ నాట్యం చేసేవారు. ఇప్పుడు కథలూ లేవు. భాగవతార్‌లు లేరు. భాగవతంలోని దశమ స్కంధం ఆధారంగానే తీర్థుల వారి తరంగాలు పుట్టాయి. అరవ దేశంలో పుట్టి స్వచ్ఛమైన తెలుగు భాషలో కీర్తనలు రాసిన త్యాగరాజెంతటి కీర్తిని సంపాదించాడో, తమిళ దేశంలో తిరిగి, అక్కడే జీవసమాధి పొందిన నారాయణ తీర్థుల వారు సంస్కృతంలో రచించిన తరంగాలతో అంతటి కీర్తినీ సంపాదించుకున్నాడు.
తీర్థుల వారి అత్తవారి ఊరు ప్రసిద్ధ నృసింహ క్షేత్రమైన వేదాద్రి (ఇది జగ్గయ్యపేట దారిలో ఉంది). వే‘దాద్రి శిఖర నరసింహ మా కలయామి’ అనే పల్లవి ఇక్కడ పుట్టినదే. తీర్థుల వారు పరమ కృష్ణ భక్తుడు. ఆయన చరిత్ర ఎంతో గొప్పది.
సరళమైన సంస్కృతంలో నడిచే తీర్థుల వారి తరంగాలన్నీ ప్రముఖమైన రాగాలలో చేసినవే.
-బాల గోపాల మా ముద్దర కృష్ణ పరమ కల్యాణ గుణాకర
-కృష్ణం కలయ సఖి సుందరం
-నందనందన గోపాల జయ నవనీత చోరా, గోపాల కందర్ప శతకోటి సుందర సుఖకర మందహాసశ్రీ గోపాల
-శరణంభవ కరుణాలయ కురు దీన దయాళో లాంటి పల్లవులతో ఆబాల గోపాలాన్ని కొన్ని తరాలపాటు ఊపేశాయి ఈ అద్భుత రచనలు.
యోగులు రచించే కీర్తనలకూ, భోగులు రాసే పాటలకూ ఎంతో తేడా ఉంటుంది. మొదటిది శాశ్వతం - రెండవది అశాశ్వతం. పరమ యోగులలో శ్రేష్టుడైన తీర్థుల వారు, పరమ భక్తుడైన నీలాశుకుడంతటి వాడు - అన్నింటి కంటే ఈ తరంగాలు తీర్థుల వారు నృత్యం చేస్తూ, తన్మయత్వంతో పాడేవాడు. ఈ కారణంగా నృత్యాభినయాలలో తరంగాలకు ఒక విశిష్ట స్థానం ఏర్పడింది.
తీర్థుల వారి తరంగాలు, ఆ తర్వాత ప్రసిద్ధుడైన ‘కూచిపూడి’ సిద్ధేంద్రయోగి యక్ష గానాలు, లీలా శుకుని కృష్ణ కర్ణామృత శ్లోకాలు, క్షేత్రయ్య పదాలు కలిసి, కూచిపూడి ప్రదర్శనలకు ప్రధానమైన ప్రదర్శనాంశాలుగా చరిత్ర ప్రసిద్ధి చెందాయి. నృత్యం చేసేవారికి ఇవే వస్తువులు ఈ వేళ. ఈ వేళ సినిమా పాటలకు ఎంత క్రేజ్ ఉందో ఒకప్పుడు ఈ ‘తరంగాల’కు అంతటి మోజు వుండేదంటే ఆశ్చర్యంలేదు.
మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ మన చుట్టూ వుండే వాతావరణాన్ని బట్టి కూడా ఏర్పడతాయి. సినిమాలు, షికార్లూ లేని రోజులలో మనవాళ్లు అంటే పూర్వీకులంతా మంచి సంగీతమే ఇష్టంగా విన్నారు. వీధి దీపాల వెలుగులో, హరికథలు, బుర్రకథలు, జముకుల కథలు మొదలైన కళారూపాలన్నీ అలా ప్రదర్శించబడి జనరంజకమైనవే. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా కూర్చుని తెల్లవార్లూ వినేవారు. ఇప్పుడు ఆ వాతావరణం లేదు. పొరబాటున అటువంటి ప్రదర్శనలు బలవంతంగా వినిపిద్దామన్నా, వినే ఓపిక, గంటల తరబడి చూసే ఓర్పు ఎవరికుంది? నా చిన్నతనంలో ఏలూరులో మైనంపాటి శ్రీనివాసరావు అనే భక్తుడు ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి, గుడికట్టి, ప్రతి ఏటా సంగీతోత్సవాలు నిర్వహిస్తూ, వుండేవాడు. ఆ ఉత్సవాలలో ప్రముఖంగా, ప్రత్యేకంగా వినిపించే తరంగ గానానికి జనం పోటెత్తేవారు. అర్ధరాత్రి వరకూ తరంగ గానం సాగేది. ఒక్కో తరంగాన్ని అనేక తాళాలలో మారుస్తూ నృత్యం చేస్తూ, పాడుతూ, జనాన్ని కూర్చోబెట్టేసేవారు. మనుషుల మధ్య వాత్సల్యాన్ని, అభిమానాన్ని అప్పటి జానపద కళారూపాలు పెంచాయి. సంగీతం పట్ల మంచి అభిరుచిని, తరంగాలు రామదాసు కీర్తనలు పెంచి వృద్ధి చేశాయి.
నారాయణ తీర్థుల వారు దక్షిణ దేశం వెళ్లే ముందు ఎందరికో ఈ తరంగ గానంలో శిక్షణ ఇచ్చారు. ఒంగోలు తాలూకాలోని అద్దంకి సమీపంలోని శింగరకొండలో వెలసిన నృసింహ దేవాలయాన్ని దర్శించుకుంటూ, ఆ ప్రాంతంలో అభిరుచి కలిగిన 60 గ్రామాలలోని వారికి ఈ తరంగాలు నేర్పారు. నారాయణ తీర్థుల వారు గానం చేసే సమయంలో ఒక తెరను కట్టేవారట. ఆ తెర వెనుక, వారి గానానికి అనువుగా తగిన నృత్యం ఎవరో చేస్తున్న అనుభూతి కలిగేదట. అంతేనా? గజ్జల ధ్వని వినిపించేదట. కీర్తి కండూతి లేని కొందరు సంకల్ప సిద్ధుల అనుభవాలు ఆసక్తిగా ఉంటాయి. సరళమైన సంస్కృత భాషలో ఎంతో సుందరంగా, సంగీత రసం చిందించే ఈ తరంగాలు బాగా విని, చాలామంది నేర్చుకుని పాడి ప్రచారం చేశారు. నారాయణ తీర్థుల వారి గృహస్థ నామం గోవిందశాస్ర్తీ. ఇంటి పేరు ‘తల్లావఝల’.
నారాయణ తీర్థులవారు కాశీ క్షేత్రంలో ఏడు ఇళ్లకు వెళ్లి భిక్షను తెచ్చుకుని తింటూ కృష్ణ ధ్యానంలో తన్మయులౌతూ పాడుకుంటూ వుండేవారు, ఆ గానానికి సాక్షాత్ కృష్ణుడు బాలకృష్ణుడై నృత్యం చేసేవాడని ప్రతీతి.
ఈ కలియుగంలో మనుషులకు అనుమానపు జాఢ్యం ఎక్కువ కదా!
‘స్ర్తిలతో రాత్రిళ్లు కాలక్షేపం చేస్తున్నాడని నిందమోపి ప్రచారం చేశారు - దాంతో తీర్థుల వారు భిక్ష విరమించి భగవన్నామ చింతనతోనే గది తలుపులు మూసివేసుకొని ధ్యానమగ్నులై పోయేవారట.
అనుమానంతో గదికి రంధ్రం వేసి పరికించి చూస్తే ఓ మహాతల్లి తీర్థుల వారికి అన్నం కలిపి నోటిలో పెడుతూ ఉండటం కనిపించింది. తలుపు తెరిచి చూస్తే, ఆమే లేదు, అన్నమూ లేదు. తీవ్రమైన సమాధిలోవున్న తీర్థుల వారిని చూసి నిశే్చష్టులయ్యారు.
పోతన భాగవతంలోని దశమస్కంధ పూర్వ భాగంలోని సుమారు 1700 గద్య పద్యాలతో చెప్పబడ్డ కథాభాగం, తీర్థుల వారి 12 తరంగాలలో కనిపిస్తుంది.
భగవద్ భక్తులందరికీ కల్పతరువు లాంటిది ‘పోతన భాగవతం’. భాగవతానికి ప్రభావితం కాని ఎవ్వరూ లేరు. త్యాగరాజు భద్రాచల రామదాసు.
నారాయణ తీర్థులు వంటి పరమ భక్తులెందరో ఈ పోతన భాగవతంతో పునీతులైనవారే. నారాయణ తీర్థుల వారి తరంగాలను విస్తృతంగా పాడి ప్రచారం చేసిన వారిలో ప్రముఖ హరికథకులలో నేను విన్న వారిలో నౌడూరి విశ్వనాథం ఒకరు. వెనుకటి తరంలో అద్దంకి హరిదాసు వెంకటరాయుడు, పాలపర్తి నృసింహదాసు, బొమ్మరాజు సీతారామదాసు, పోరూరి సోదరులు, తాడిగడప పెద్దశేషయ్య, నీలంరాజు ఆదినారాయణ దాసు, మైనంపాటి నరసింగరావు వంటి వారు అనేక మంది ఉన్నారు.
చూడగానే పాడాలనిపించేవి, పాడితే వినాలనిపించేవి, తరంగాలు - వందలాది గాయకులు మన ప్రాంతంలో పనిగట్టుకుని ప్రచారం చేసి, సంప్రదాయ సంగీతం పట్ల అభిరుచినీ, ఆసక్తినీ కలిగించారు.
1950-60లలో విద్యుత్ సౌకర్యం లేని ఆ వెనుకటి రోజుల్లో నాలుగు రోడ్లు కలిసే కూడలిలో తరంగ బృందగాన కళాకారులు నూనె దీపపు సెమ్మెలు పెట్టుకుని చేతిలో తాళాలతో ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తూ పాడటం నాకింకా గుర్తే.
స్వచ్ఛ భారత్ నినాదంతో బాటు, సాంస్కృతిక చైతన్యంతో, ఉద్యమంలా స్వచ్ఛమైన సంగీతం వినే రోజులు రావాలని అందరం కోరుకుందాం.
*

-మల్లాది సూరిబాబు 9052765490