అమృత వర్షిణి

జీవ వైవిధ్యం అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని అటవీ ప్రాంతాలు విభిన్న రకాలకు చెందిన వేలాది వన్యప్రాణులకు నిలయమై జీవ వైవిధ్యానికి పేరుగాంచాయి. అయితే ఇటీవలి కాలంలో పారిశ్రామికీకరణ, అభివృద్ధి పేరుతో - అటవీ ప్రాంతాలలో కూడా ప్రాజెక్టులు, ఆనకట్టలు నిర్మించడం, గనుల త్రవ్వకాలు, అలానే రోడ్లు వేయడం వంటి పనులను చేపట్టడం వలన వన్యప్రాణుల మనుగడకు పెనుముప్పు ఏర్పడి, చాలా జాతుల వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోవడం.. మరికొన్ని జాతులు కనుమరుగై పోవడం జరుగుతోంది.
‘చేపల్ని పట్టే పిల్లులు’ (Fishing Cat) నివసింఛే సహజ నివాస ప్రాంతాలైన నీరున్న ప్రాంతాల్ని, చిత్తడి నేలల ప్రాంతాల్ని మానవుడు తన స్వార్థం కోసం నాశనం చేయడం వలన, ఆవాస క్షీణత (Degradation) వలన ఈ జాతి ఫిల్లులు తీవ్ర సమస్యని ఎదుర్కొంటున్నాయి. ఈ పిల్లులు సంచరించే చిత్తడి నేల ప్రాంతాల్ని వ్యవసాయం కోసం మార్చివేయడం వలన, కాలుష్యం వల్ల, చెట్లని నరికి వేయడం వల్ల, పరిమితిని మించి చేపల్ని వేటాడటం వలన, చాలా సంవత్సరాలుగా ఈ జాతి పిల్లుల్ని వాటి చర్మాల కోసం వేటాడి చంపడం వలన వీటి సంఖ్య ఇటీవలి కాలంలో దారుణంగా పడిపోయింది.
‘మెత్తని ఉన్ని చర్మం గల ఓటర్స్’ (Smooth Coated Otters) అనే నీటి కుక్కలు నివసించే వాటి సహజ ప్రాంతాలలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మించడం వలన, వ్యవసాయం కోసం నీరున్న ప్రాంతాలను మార్చివేయడం వలన, ఈ నీటి కుక్కలు సంచరిస్తూ వేటాడే నీటి కాలువలలోకి పంటలకు వేసే పురుగుల మందులు చేరి కలుషితం కావడం వలన, వీటిని చర్మాల కోసం వేటాడి చంపడం వలన, ఈ జాతి నీటి కుక్కల మనుగడకు ముప్పు ఏర్పడింది. ఇవి సంఖ్యాపరంగా బాగా తగ్గిపోవడం వలన 1972 వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం ఈ జాతి ఓటర్స్‌ని పరిరక్షిస్తున్నారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య కృష్ణానది సముద్రంలో కలిసే ప్రాంతాలలోని మడ అడవులలో ఏర్పరచిన కృష్ణా వన్య ప్రాణుల అభయారణ్యాలలో ఈ చేపల్ని పట్టే పిల్లులు, మెత్తని ఉన్నిబొచ్చుగల ఇండియన్ ఓటర్ అనే అరుదైన నీటి కుక్కలు, సంఖ్యాపరంగా బాగా తగ్గిపోయిన ‘ఆలివ్ రిడ్లీ’ తాబేళ్లు నివసిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన కృష్ణా పుష్కరాల పుణ్యమా అని ఈ అభయారణ్య ప్రాంతాలలో గోతులు తీసి రోడ్లు వేయడం వలన ఈ మడ అడవులలో నివసించే - ముఖ్యంగా చేపల్ని పట్టే పిల్లులకు ముప్పు కలుగుతోందని, పర్యావరణానికి విఘాతం కలిగించేలా, ఇలా అభయారణ్య ప్రాంతాలలో రోడ్లు వేయడం సరికాదని పర్యావరణవేత్తలు, వన్యప్రాణుల పరిశోధకులు భావించినప్పటికీ ఫలితం శూన్యం.
తూర్పు కనుమలలోని అటవీ ప్రాంతాలకు కూడా ఆనకట్టల వలన, మైనింగ్ గనుల తవ్వకాలకు గురి కావడంవలన అక్కడి అరుదైన వన్య జీవుల మనుగడకు ముప్పు తప్పడం లేదు. ఈ అటవీ ప్రాంతాలలో చాలాకాలంగా కనుమరుగై పోయిన బంగారు వనె్నలో ఉండే ఒకలాంటి బల్లిని (గోల్డెన్ గెకో) ఇటీవల కనుగొన్నారు.
విశాఖపట్నం జిల్లాలోని సీలేరు నది ఒడ్డున ఉన్న అటవీ ప్రాంతాలు కూడా చాలావరకు మారిపోతున్నాయి. సీలేరు నది మీద నాలుగు పెద్ద ఆనకట్టలు ఉన్నాయి. ఈ కొండల అటవీ ప్రాంతాలలో ‘పైప్‌లైన్’ నిర్మాణం చేపట్టడం వలన, ఆనకట్టల వలన, బాక్సైట్ గనుల తవ్వకాల వలన, రోడ్డును విశాలపరచడం వంటి పనులు చేయడం వలన ఇక్కడి వన్యప్రాణుల జీవనానికి అవరోధం ఏర్పడి అక్కడి జంతుజాలం వేరే ప్రాంతాలకు తరలి వెళ్లిపోవలసి వచ్చింది. చింతపల్లి పట్టణ ప్రాంతాలలో ఉన్న అటవీ ప్రాంతాల్ని నరికివేశారు. ముఖ్యంగా మైనింగ్ వలన ఈ అటవీ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తూర్పు కనుమల అటవీ ప్రాంతంలో ఉన్న పాపికొండల అభయారణ్యాలలో చిరుతపులులు, అడవి పిల్లులు, మచ్చల పిల్లి, స్లోత్ ఎలుగులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి దున్నలు, సాంబార్ అనే దుప్పులు, ఛీటల్ అనే మచ్చల జింకలతోపాటు చాలా అరుదైన ‘పామ్ సిలెట్’ అనే పునుగు పిల్లులు కూడా నివసిస్తున్నాయి. అత్యంత అరుదైన ‘బంగారు వనె్న బల్లి’ (Golden Gecko) ఇక్కడే కనిపిస్తుంది.
పాపికొండలు అభయారణ్యాలకు కూడా ముప్పు వాటిల్లింది. గోదావరి నదికి ఇరుపక్కల ఉన్న అటవీ ప్రాంతాలలో ‘ఇందిరా సాగర్’ ఆనకట్ట నిర్మాణం వలన, వేలాది హెక్టార్ల అటవీ ప్రాంతం నాశనమై పోయింది.
‘హూలాక్ గిబ్బన్’ అనే వానరం మన దేశంలోని అస్సాంలో ఉన్న సతత హరితారణ్యాలలో నివసించే అత్యంత అరుదైన వానరం. ఈ జాతి వానరాల్ని అక్కడి అరణ్య ప్రాంతాలలో నివసించే కొన్ని తెగల ప్రజలు వాటి మాంసం కోసం వేటాడి చంపడం వలన, అక్కడి అడవుల్ని నరికి వేయడం వలన ఈ వానరాలు వాటి సహజ అటవీ ప్రాంతాల్ని కోల్పోవడం వలన, వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ వర్షారణ్యాలు పరిశ్రమల వలన, వ్యవసాయం కోసం చెట్లను నరికి వేయడం వలన గడచిన 3,4 దశాబ్దాల కాలంలో ఈ వానరాల సంఖ్య దాదాపు 90 శాతం పడిపోయింది. ఈ అడవుల్ని ముక్కలుగా విడగొట్టడం కూడా దీనికి మరో కారణం. కేవలం ఇక్కడి అటవీ ప్రాంతాలకే పరిమితమైన ఈ జాతి వానరాల్ని పరిరక్షించుకోకపోతే ఇవి పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇలానే పశ్చిమ కనుమల అడవులలో నివసించే ‘సింహం తోక కోతులు’ పరిస్థితి ఇలానే ఉంది.
అస్సాంలోని ‘కజిరంగా నేషనల్ పార్క్’లో రక్షణ పొందుతున్న ఒంటి ఖడ్గ మృగాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇప్పటివరకు దాదాపు 200 ఖడ్గమృగాలు ఈ అభయారణ్యాలలో వేటగాళ్లకు బలైపోవడం అత్యంత శోచనీయం.
అంతర్జాతీయ వన్య ప్రాణుల పరిరక్షణకు సంబంధించిన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్లు, టిబెటన్ గేజెల్ అనే జాతి దుప్పుల్ని దాదాపు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న దుప్పుల జాబితాలో చేర్చారు. ఈ దుప్పులు లడక్‌లోని ఒక ప్రాంతానికే పరిమితమైపోయి కేవలం 50 దుప్పులు మాత్రమే బతికి ఉన్నట్లు కనుగొన్నారు. ఇంత అత్యల్ప సంఖ్యలో ఉన్న ఈ జాతి దుప్పులు శీతాకాలంలో తీవ్రమైన చలికి గానీ, లేదా ఏదైనా వ్యాధులు వస్తే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని జంతు సంరక్షణ శాస్తవ్రేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగే మధ్యప్రదేశ్‌లోని చిత్తడి నేలల అటవీ ప్రాంతాలకే పరిమితమై పోయిన అత్యంత అరుదైన ‘స్వాంప్ డీర్’ అనే జింకల పరిస్థితి కూడా ప్రమాదకరంగానే ఉంది. హిమాలయ పర్వత ప్రాంతాలలో సంచరిస్తూండే ‘మంచు చిరుత’ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది.
ఇక సరీసృపాల విషయానికి వస్తే మన దేశానికి చెందిన ‘ఘారియల్’ అనే మంచినీటి మొసళ్లు (దీనికి చాలా పొడవైన మూతి ఉంటుంది) అనేక దశాబ్దాలుగా వాటి చర్మాల కోసం వేటకు గురైపోవడం వలన, ఇవి నివసించే నదీ జలాల్లో విస్తారమైన చేపల వేట వలన, రసాయనాలతో, ఇతర చెత్తా చెదారాలతో నదీ జలాలు కాలుష్యం అయిపోవడం వలన, ఈ జాతి మొసళ్లు మనుగడకు తీవ్ర అవరోధం ఏర్పడి జీవన పోరాటంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే రసాయనాల వలన నదీ జలాల కాలుష్యం వలన ఈ మొసళ్లు చనిపోతున్నాయి. వీటి సహజ ప్రాంతాలలో ఈ జాతి మొసళ్లు కేవలం 235 మాత్రమే బతికి ఉన్నాయని ఇటీవలి కాలంలో అంచనా వేశారు. ఇంత తక్కువ సంఖ్యలో ఉన్న ఈ జాతి మొసళ్లు కేవలం ‘చంబల్’ ‘గంగా’ నదులకే పరిమితమై జీవన పోరాటంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ మొసళ్లు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకొనే ఈ నదీ తీరాలలోని ఇసుక అక్రమ తవ్వకాల వలన వీటి సంతానోత్పత్తికి తీవ్ర అవరోధం కలుగుతోంది.
నక్షత్ర తాబేళ్లు కూడా అక్రమ వ్యాపారానికి గురై కనుమరుగై పోతున్నాయి. ఆంధ్ర, ఒరిస్సా, మహరాష్టల్రలో బాక్సైట్ తవ్వకాల వలన కొన్ని జాతుల వన్య ప్రాణులు పూర్తిగా కనుమరుగై పోతున్నాయి. కొన్ని జాతులు చెదురుమదురుగా అక్కడక్కడ కనపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇవి కూడా పూర్తిగా కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది.
వాస్తవానికి మొత్తం అటవీ ప్రాంతంలో ఐదు శాతానికి మించి తవ్వకాలు అంటే మైనింగ్ నిర్వహించడానికి లేదు. కానీ దీనికి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ అటవీ ప్రాంతాలలో యధేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
నాగార్జున సాగర్, భాక్రానంగల్ మొదలుకొని ఇటీవల వరకు కట్టిన ఏ ప్రాజెక్టుల నిర్మాణాల వలన దెబ్బతిన్నా లేదా పాడైపోయిన అటవీ ప్రాంతాలను పరిశీలించినా, అలాగే ఏదైనా ఖనిజాల తవ్వకాల వలన గానీ, నరికి వేసిన అటవీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా కేటాయించిన భూముల్ని పరిశీలించినా, అనేక దశాబ్దాలుగా మన దేశంలో ఎక్కడా అడవుల విస్తీర్ణం పెరిగిన దాఖలాలు లేవు. ప్రాజెక్టులు గానీ, మైనింగ్‌కి గానీ అటవీ భూముల్ని తీసుకుంటే, అందుకు ప్రత్యామ్నాయంగా భూముల్ని కేటాయించి సామాజిక అడవుల్ని పెంచడానికి నిధులు మంజూరు చేయాలి. రికార్డులలో అవి జరుగుతున్నట్లు ఉన్నా, వాస్తవానికి అలాంటి అడవుల పెంపకం ఎక్కడా జరగడంలేదు. ఒకవేళ అలా కేటాయించిన భూముల్లో అడవుల్ని పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మొదటి అడవిలో ఉన్న జీవ జాతుల్ని అంటే వన్యప్రాణుల్ని అక్కడకు తరలించడం సాధ్యపడుతుందా? అన్న అంశాలపై ప్రభుత్వాలు స్పందించడంలేదు.
ఖనిజాల కోసం అటవీ ప్రాంతాలలో నిర్దేశించిన ఐదు శాతానికి మించి తవ్వకుండా నిబంధనల్ని కట్టుదిట్టం చేసి చర్యలు తీసుకోవాలి. ‘ఓపెన్ కాస్టింగ్’ పద్ధతి వలన పర్యావరణానికి తీవ్రమైన ముప్పు ఏర్పడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఓపెన్ కాస్టింగ్’ పద్ధతిలో చేసినా ఐదేళ్లలో తవ్వకాలు ముగుస్తాయన్న సమయానికి అక్కడ పచ్చదనాన్ని పెంపొందించే ఏర్పాట్లు మొదలుపెట్టాలి. ఒక అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నపుడు అందులో కొంత భూభాగంలో తవ్వకాలు ప్రారంభించి అక్కడ ఖనిజాన్ని వెలికితీసిన తర్వాత మరో భూభాగంలోకి వెళ్లాలి. దీనివలన పర్యావరణానికి పెద్దగా ముప్పు గానీ, విఘాతం కానీ కలుగదు. అలాగే అడవిపైనే ఆధారపడి జీవించే గిరిజనుల జీవన శైలికి ఆటంకం కలుగదు. వారికి పునరావాసం కల్పించవలసిన ఆవశ్యకత కూడా ఉండదు.
ఇక పక్షుల విషయానికి వస్తే మన దేశంలో ఉన్న 1300లకు పైగా పక్షి జాతులలో 188 పక్షి జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయని ఐయుసిఎన్ వారు వాటిని రెడ్ లిస్ట్‌లో చేర్చారు.
మన దేశానికి చెందిన బట్టమేక పక్షులు (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్స్) గుజరాత్, రాజస్థాన్, మహరాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలోని గడ్డి మైదాన ప్రాంతాలలో చిన్న పొదలతో నిండిన మైదాన ప్రాంతాలలో నివసిస్తూ కనిపిస్తాయి.
మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం రోళ్లపాడు గ్రామ సమీపంలోని రోళ్లపాడు అభయారణ్యాలలో ఈ జాతి పక్షుల్ని, అలాగే బ్లాక్ బక్ అనే నల్ల దుప్పుల్ని కూడా పరిరక్షిస్తున్నారు.
గత 5-6 సంవత్సరాల క్రితం వరకు ఈ బట్టమేక పక్షులు ఈ అభయారణ్యాల ప్రాంతాలకు కాలానుగుణంగా బాగా చిన్న గుంపుగా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేవి. కానీ 2014లో, 2015లో ఈ అభయారణ్యాలలో ఈ పక్షుల జాడ లేదు. ఈ బట్టమేక పక్షులు ఇటీవల కొన్ని సంవత్సరాలుగా కనపడటం లేదని స్థానికులు అంటున్నారు. మన దేశంలో ఇటీవలి లెక్కల ప్రకారం కేవలం 200 నుండి 250 బట్టమేక పక్షులు మాత్రమే బతికి ఉన్నాయని అంచనా వేశారు. రాబోయే రెండు దశాబ్దాలలో లేదా ఇంకా ముందుగానే ఈ జాతి పక్షులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదమున్నదని పక్షి శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు బతికి ఉన్న కొన్ని పక్షులలో కూడా జన్యుపరమైన వైవిధ్యం లోపించిందని కనుగొన్నారు.
ఇదే కుటుంబానికి చెందిన ‘లెస్సర్ ఫ్లోరికాన్’, బెంగాల్ ఫ్లోరికాన్ అనే అందమైన పక్షులు కూడా కనుమరుగైపోయే ప్రమాదంలో ఉన్నాయి.
ఓ శతాబ్ద కాలం కనుమరుగైపోయి 1986లో మన రాష్ట్రంలోని తూర్పు కనుమల ప్రాంతంలో మళ్లీ కనపడిన ‘జెర్డోన్స్ కార్సెర్’ అనే అత్యంత అరుదైన ఈ జాతి పక్షిని (చిన్న కోడిపెట్టకన్నా బాగా చిన్నగా ఉంటుంది.) కడప జిల్లాలోని రెడ్డిపాలెం సమీపాన ఉన్న పొదలతో నిండిన అటవీ ప్రాంతంలో పరిరక్షిస్తున్నారు. దశాబ్దం క్రితం ఈ పక్షుల జాడ ఉన్నా, గత మూడు లేదా నాలుగు సంవత్సరాల నుండి ఈ అటవీ ప్రాంతాల్లో ఈ పక్షుల జాడ లేకుండా పోయింది. స్థానికంగా ‘కలివికోడి’ అని పిలువబడే ఈ పక్షుల గురించి విస్తృతమైన పరిశోధన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
2010లో మన దేశంలో 3200 పెద్ద పులులు ఉన్నట్లు అంచనా వేశారు. ఇటీవల తాజా లెక్కల ప్రకారం పెద్ద పులుల సంఖ్య 3,890కి పెరిగినట్లు సమాచారం. పెద్ద పులుల సంఖ్య పెరిగినట్లుగానే వాటి శరీర భాగాల కోసం వాటిని వేటాడి చంపడం కూడా బాగానే పెరిగినట్లు తేలింది. 2000 నుండి 2014 మధ్యకాలంలో 1,590 పెద్ద పులులకు చెందిన శరీర భాగాల్ని (అక్రమ వ్యాపారం కోసం తరలించేవారు) వన్య ప్రాణుల అక్రమ వ్యాపారాల్ని నిరోధించే అధికారులు పట్టుకున్నారు.
ఇప్పుడు బతికి ఉన్న అత్యంత అరుదైన వన్య ప్రాణుల్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోకపోతే అవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రాకముందే జాగ్రత్త పడాలి.

-జి.రత్నకుమార్