రంగారెడ్డి

భాజపా రాష్ట్ర కోశాధికారి మనోహర్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 2: ప్రతి మండలాన్ని కరువుప్రాంతంగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి జి.మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోరెడ్డి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. కరువు నివారణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, కరువు నివారణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవడంలో నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. పశుగ్రాసం, తాగునీటి కొరతతో పశువులు కబేళాలకు తరళుతున్నాయని చెప్పారు. దీంతో రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణను మానుకొని కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ప్రతి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతీపత్రం అందజేశారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డి, కోశాధికారి భోజిరెడ్డి, పార్టీ నాయకులు బి.రాంరెడ్డి, డి.రమణారెడ్డి, అశోక్‌గౌడ్, మొగిలి గణేష్, నాయిని సత్యనారాయణ, నర్సింహారెడ్డి, లక్ష్మిపతిగౌడ్, శివకుమార్, ఎం.జంగారెడ్డి, నర్సింహారెడ్డి, భాస్కర్‌గౌడ్, జగన్‌రెడ్డి పాల్గొన్నారు.

కరవు ప్రాంతంగా తెలంగాణను ప్రకటించాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంగా కరవు పీడిత ప్రాంతంగా ప్రకటించి యుద్ధప్రాతిపదికన కరవు సహాయ చర్యలు చేపట్టాలని సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముఖ్దూంభవన్‌లో జరిగిన సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంలో కరవు దుర్బిక్ష నివారణ చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సిపిఐ ఈ నెల 6న నిర్వహించే సామూహిక ధర్నా పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.డి.సుధాకర్‌తో కలసి విడుదల చేశారు. సకల జనులందరూ శ్రమించి, ఉద్యమించి సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్రం నేడు కనివినీ ఎరుగని తీవ్ర దుర్బిక్షం కోరల్లో చిక్కుకుందని, రైతన్నల ఆక్రమందన, ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉందని, రంగారెడ్డి జిల్లా పరిస్థితి దయనీయంగా వుందని ఆయన విమర్శించారు. రైతులతోపాటు వ్యవసాయ కార్మికులు కరవు వలస నిస్సహాయ పరిస్థితుల్లో బ్రతుకుదెరువు కోసం వలసలు పోతున్నారని ఆయన అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదని, రైతుల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రంగారెడ్డి జిల్లాకు తక్షణమే రూ.250 కోట్లు నిధులు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన కరవు సహాయక చర్యలు చేపట్టాలని, ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ కార్మికులకు కనీసం 200 రోజుల పని కల్పించాలని, రైతుల పైనున్న రుణాలన్నీ మాఫీ చేసి తిరిగి రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 6న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సిపిఐ సామూహిక ధర్నాకు జిల్లా నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా నేతలు పుస్తకాల నర్సింగ్‌రావు, పాలమాకుల జంగయ్య, జె.లక్ష్మి, బాతరాజు నరసింహ, మహిళా సమైఖ్య నేత రేఖ పాల్గొన్నారు.

కరవుపై స్పందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
వికారాబాద్, మే 2: కరవుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టేలా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఒత్తిడి తేవాలని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, తమిళనాడు మహిళామోర్చా ఇన్‌చార్జి అరుణజ్యోతి పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే కరవు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి సబ్‌కలెక్టర్‌కు మెమోరండం సమర్పించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా నెలకొన్న కరవుతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పశుగ్రాసం, నీరు దొరకక పశువులను కబేళాలకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కరవు సహాయక చర్యలు యుద్దప్రాతిపదికన చేపట్టాలని, కరవు పరిస్థితుల అధ్యయనానికి ఒక ఉన్నత స్థాయికమిటి ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రతి మండలానికి తక్షణమే ఐదు కోట్ల రూపాయలు కరవు సహాయ నిధులను విడుదల చేయాలని, రైతులకు ఉచితంగా పశుగ్రాసం సరిపోయేంత వెంటనే అందజేయాలని, పశువులకు నీటికొరకు వెంటనే నీటి తొట్లను ఏర్పాటు చేయాలని, రాబోయే ఖరీఫ్ సీజన్‌కు రైతులకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, చేస్తామన్న రుణమాఫీని వెంటనే పూర్తి చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని, దినసరి వేతనాలపై ఆధారపడి జీవిస్తున్న కూలీలకు పనులు కల్పించి వలసలను అరికట్టాలని, ఉపాధి హామీ కూలీల బకాయలను వెంటనే చెల్లించాలని, కరవు సహాయక చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికోట్లు విడుదల చేయాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, పండ్ల తోటల రైతును ఆదుకోవాలని, కరవు నెలకొన్న ప్రాంతాల్లోని విద్యార్థుల ఫీజులను మాఫీ చేయాలని, రాష్ట్రంలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని, వడదెబ్బతో చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గ్రామాల సర్వతోముఖ అభివృద్దికి కృషి చేస్తోందని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, కరవు దృష్ట్యా ఉపాధి హామీ పనులను 100 నుండి 150 రోజులకు పెంచారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అమలు చేసే పథకాలను అందిపుచ్చుకోవడం లేదని విమర్శించారు. పట్టణ బిజెపి అధ్యక్షుడు పోకల సతీష్, బిజెపి జిల్లా ప్రధానకార్యదర్శి కె.శివరాజ్, కార్యదర్శి జి.విజయభాస్కర్‌రెడ్డి, లీగల్‌సెల్ రాష్ట్ర కోకన్వీనర్ కె.మాధవరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ పాండుగౌడ్, బిజెవైఎం రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ కెపి రాజు, బిజెవైఎం నాయకుడు అనిల్ యాదవ్, కౌన్సిలర్ సుచరితా నరోత్తంరెడ్డి, నాయకులు బస్వలింగం, గిరిష్ కోఠారి, ప్రవీణ్, రవీందర్‌రెడ్డి, రాములు, అమరేందర్‌రెడ్డి, ప్యాట శంకర్, యాదగిరి, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

ముగ్గురు దొంగలకు రిమాండ్
నార్సింగి, మే 2: ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగలించుకుని పారిపోయిన దొంగలను హుమాయూన్‌నగర్ పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఆసిఫ్‌నగర్ ఏసిపి కార్యాలయంలో విలేఖరులకు వివరాలను పశ్చిమ మండల డిసిపి ఎ.వెంకటేశ్వరరావు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి ప్రశాంతినగర్‌కు చెందిన మీర్ మక్సాద్ అలీ కుమారుడు మీర్ హసన్ అలీ అలియాస్ అలీ అలియాస్ అబ్బు (35) ఆటో డ్రైవర్. బోరబండ స్ట్రీట్ నెంబర్ 3కి చెందిన అబ్దుల్ రావూఫ్ కుమారుడు మహ్మద్ జాకీర్ (29) ఆటోడ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన హుసేన్ కుమారుడు మీర్ హుసేన్ అలీ (రియల్ ఎస్టేట్ వ్యాపారం). హైమద్ నలుగురు యువకులు మిత్రులు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ ఇంటి యాజమాని ఇంటికి తాళం వేసి బయటికి వెళ్తుండగా మహ్మద్ జాకీర్ చూశాడు. మీర్ హసన్‌అలీకి ఫోన్ చేశాడు. మీర్ హసన్ అక్కడికి వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి ఇంట్లో ఉన్న 30 తులాల బంగారు నగలను దొంగిలించుకుని ఇరువురు పారిపోయారు. కాగా ఈ క్రమంలో దొంగలించిన బంగారు నగలను మీర్ హుసేన్, హైమద్ తీసుకున్నారు. వీరు జనవరి 10వ తేదిన విజయనగర్ కాలనీకి చెందిన నుస్రరత్ ఫాతిమా ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లివచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న నగదును దొచుకుని పారిపోయారు. అనుమానాస్పద స్థితిలో మీర్ హసన్, మహ్మద్ జాకీర్, మీర్ హుసేన్ తిరుగుతుండగా హుమాయూన్‌నగర్ పోలీసులు పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దొంగతనం చేసిన నేరాన్ని నిందితులు ఒప్పుకున్నట్లు డిసిపి పేర్కొన్నారు. ముగ్గురిని సోమవారం మధ్యాహ్నం రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు హైమద్ పరారీలో ఉన్నట్లు, హైమద్‌ను పట్టుకుంటే మరింత బంగారం లభిస్తుందని డిసిపి పేర్కొన్నారు. నిందితుల వద్ద 15తులాల బంగారు నగలతోపాటు రెండు సెల్‌ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డిసిపి, ఆసిఫ్‌నగర్ ఏసిపి గౌస్ మొహినుద్దీన్ హుమాయూన్‌నగర్ ఇన్స్‌పెక్టర్ రవీందర్‌ను, డిఐ రాజుతోపాటు పోలీస్ సిబ్బందిని అభినందించారు.

వాహనం ఢీకొని బాలిక మృతి
గచ్చిబౌలి, మే 2: సెల్లార్‌లో పడుకోబెట్టి వెళ్లిన బాలికను గుర్తుతెలియని వాహనం ఢీకొనగా మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీలో జరిగింది. సిఐ దుర్గాప్రసాద్ కథనం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని బిల్లాఘాడ్ జిల్లా సుసువా గ్రామానికి చెందిన సురేందర్ అతని భార్య అంచులలు జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు. రాయదుర్గంలోని చిత్రపురి లేబర్ కాలనీలో ఉంటూ కూలీపని చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. ఉదయం చిత్రపురి కాలనీలో భార్యభర్తలు పని చేసుకుంటూ వారి కుమార్తె పవిత్ర ఏడాది పాపను భవనం సెల్లార్‌లో పడుకోబెట్టి పక్కన పని చేసుకుంటున్నారు. గంట తరువాత వచ్చి చూస్తే పవిత్ర రక్తపు మడుగులో మృతి చెంది ఉంది. మృతదేహాన్ని తీసుకుని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. సెల్లార్‌లో పార్క్ చేసిన కారు ఢీకొట్టినట్లు తెలిసింది. మొదట బాధితులకు నష్టపరిహారం చెల్లించి కేసు లేకుండా చేయాలని ప్రయత్నించినట్లు తెలిసింది. విలేఖరులు వచ్చి వివరాలు అడగడంతో గత్యంతరం లేని స్థితిలో కేసు నమోదుచేసినట్లు ప్రచారం జరుగుతోంది.