రంగారెడ్డి

ప్రశాంతంగా ‘పంచాయతీ’ పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవరి 21: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంచాయతీ పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు చాలావరకు పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నచిన్న ఘర్షణలు మినహా అంతా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేకంగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. దాంతో పంచాయతీ పోరు ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికల పోరు ఉదయం ఏడుగంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉండటంతో ఓటర్లు ఉదయం సమయంలోనే ఎక్కువగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. దాంతో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఎక్కువగా కనిపించారు. 10గంటలు దాటిన తరువాత చూస్తే ఓటర్లు అలా వచ్చి ఇలా వెళ్లారే తప్ప ఎక్కువ సమయం ఏమాత్రం పట్టలేదు. పోలింగ్ కేంద్రం వద్ద ఓట్లు వేసేందుకు వచ్చిన ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు, మద్దతుదారులు ఎక్కువగా పోటీ పడ్డారు. తమ గుర్తుకే ఓటు వేయండి..తమ మద్దతుదారుడి గుర్తుకే ఓటు వేయండి అంటూ ఓటర్లకు వివరించేందుకు నేతలు ఎవరికివారే పోటీ పట్టారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఓటర్లు ఇదేమి గోల అంటూ వాహనాల్లో నుండి దిగి నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిపోయారు. ఎవరెన్ని మాటలు చెప్పిన వినకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వచ్చిన తరువాత మీకే ఓటు వేశామంటూ ఇరు పార్టీల నేతలకు చెప్పుకుంటూ వెళ్లిపోయారు. పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేసేందుకు ఓటర్లు లేకపోవడంతో ఎన్నికల సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లు ముచ్చట్లతో కాలక్షేపం చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండలాల్లో పోలింగ్ సమయం ముగిసేసరికి సుమారు 85శాతం నమోదు అయినట్లు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. చౌదరిగూడ మండలం గాలిగూడలో ఆదివారం రాత్రి ఇరువర్గాలు ఘర్షణ పడటంతో ముగ్గురు గాయపడ్డారు. అలాగే నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో కూడా ఒక నేతపై చేయిచేసుకున్నట్లు సమాచారం. ఏది ఎమైనప్పటికి గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపీరి పీల్చుకున్నారు.
వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
షాద్‌నగర్ రూరల్: పంచాయతీ పోలింగ్‌లో భాగంగా వృద్ధులు, వికలాంగులకు ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రాలతోపాటు గ్రామ పంచాయతీల్లో జరిగిన పోలింగ్‌లో వికలాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా విల్‌చైర్ ఏర్పాటు చేయడంతోపాటు పంచాయతీ సిబ్బందిని నియమించారు. గ్రామాల్లో నుండి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులను పంచాయతీ సిబ్బంది విల్‌చైర్‌లో కుర్చోబెట్టుకొని పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లారు. ఎన్నికల సిబ్బంది అంధులను పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లగా అధికారులు వారితో ఓట్లు వేయించారు. పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యంతోపాటు ప్రథమ చికిత్స కేంద్రాన్ని సైతం ఏర్పాటుచేశారు. వృద్ధులను, వికలాంగులను పోలింగ్ కేంద్రంలోకి వారి బంధువులు తీసుకువస్తే వారిని బయటకు పంపించి ఎన్నికల అధికారులు వారితో ఓట్లు వేయించారు. పంచాయతీ పోలింగ్‌ను ఎన్నికల అధికారులు పకడ్బందీగా నిర్వహించారు.
స్వస్తిక్ గుర్తు ఊడిపోవడంతో ఆలస్యం
షాద్‌నగర్: తొలి విడత పంచాయతీ పోలింగ్‌లో కొందుర్గు మండల కేంద్రంలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటరు బ్యాలెట్ పేపరుపై వేసే ముద్రకు సంబంధించిన రబ్బరు ఊడిపోవడంతో 15నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. పంచాయతీ పోలింగ్‌లో భాగంగా స్వస్తిక్ గుర్తు ఊడిపోవడంతో 15నిమిషాల పాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సోమవారం కొందుర్గు గ్రామ పంచాయతీ 11వ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల అధికారులు స్వస్తిక్ గుర్తు కలిగిన ముద్రను ఓటర్లకు ఇవ్వగా ఓటు వేసే సమయంలో ముద్ర నుండి స్వస్తిక్ గుర్తు ఒక్కసారిగా ఊడి కిందపడిపోవడంతో అధికారులు తక్షణమే వాటిని తీసుకొని అతికించి మళ్లీ ఓటర్లకు ఇచ్చారు. దాంతో 15నిమిషాల పాటు పోలింగ్‌కు అంతరాయం నెలకొంది. స్వస్తిక్ గుర్తును ముద్రకు అతికించే విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోలేదు. దాంతో పోలింగ్ కేంద్రంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్‌డీఓ
కొందుర్గు: పోలింగ్ కేంద్రాలను షాద్‌నగర్ ఆర్‌డీఓ ఎం.కృష్ణ పరిశీలించారు. సోమవారం కొందుర్గులోని పోలింగ్ కేంద్రాలతోపాటు జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారనే విషయాలను స్థానిక ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కొందుర్గులో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
86 శాతం పోలింగ్ నమోదు
*పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
కీసర: సోమవారం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీసర మండలంలో 86 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. మండలంలోని పది గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో పది గ్రామాలకుగాను 37 మంది అభ్యర్ధులు సర్పంచ్ బరిలో ఉన్నారు. 97 వార్డు సభ్యుల స్ధానాలకు 328 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. కీసరలో 79 శాతం, అంకిరెడ్డిపల్లి 96 శాతం, భోగారం 93 శాతం, చీర్యాల 87 శాతం, గోధుమకుంట 90 శాతం, కరీంగూడ 89 శాతం, కేశ్వపూర్ 89 శాతం, రాంపల్లి దాయర 88 శాతం, తిమ్మాయిపల్లి 92 శాతం యాద్‌గార్‌పల్లి 87 శాతం ఓట్లు పోలైనట్లు ఎంపీడీవో శశిరేఖ తెలిపారు. నర్సంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. మండలంలో మొత్తం 23,338 ఓట్లు ఉండగా, 20,050 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఉదయం ఏడు గంటల నుండే ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట దాటాక పోలీసులు ఎవ్వరినీ లోనికి అనుమతించలేదు. పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలకు రవాణా సౌకర్యం, వీల్ చైర్స్ ఏర్పాటు చేయటంతో సులువుగా ఓటు హక్కును వినియోగించు కున్నారు. మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, జేసీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎన్నికల పరిశీలకులు చంపాలాల్ పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని పరిశీలించారు. డీసీపీ ఉమా మహేశ్వర శర్మ, ఏసీపీ శివకుమార్ మండలంలోని అన్ని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి శాంతి భద్రతలపై సమీక్షించారు.
వికారాబాద్‌లో పోలింగ్ శాతం 82.47
వికారాబాద్, జనవరి 21: వికారాబాద్ జిల్లాలోని ఏడు మండలాల్లో సోమవారం నిర్వహించిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 82.47 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ నిర్వహించిన పెద్దెముల్, దౌల్తాబాద్, యాలాల్, తాండూర్, బొంరాస్‌పేట, కులకచర్ల, బషీరాబాద్, కొడంగల్ మండలాల్లో మొత్తం ఓట్ల సంఖ్య రెండు లక్షల 34 వేల 611 ఓట్లకుగాను లక్షా 91 వేల 307 ఓట్లు పోలయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు 23.8 శాతం, 11 గంటల వరకు 53.9, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 82.47 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్, ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేయగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వసతులు, సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ పరిశీలించారు.