రంగారెడ్డి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, మే 31: రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టిఆర్‌ఎస్ శ్రేణులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని ఓం శివసాయి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మేడ్చల్ మండల టిఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన వారికి తగిన సమయంలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అనునిత్యం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో ఉన్నత పదవులు లభిస్తాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాలు పలు పథకాలను ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎంతో మంది త్యాగధనుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా నిర్మించుకునేందుకు అందరి సహాయ సహకారాలు కావాలన్నారు. చరిత్రలో గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని రెండేళ్ల పాలనలోనే దిగ్విజయంగా అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మేడ్చల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతంగా తీరనుందని తెలిపారు. రాష్ట్ర సర్కార్ ఉన్నత ఆశయంతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో నియోజకవర్గంలోని చెరువులు కుంటలకు మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే అవి జలకళను సంతరించుకుని భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అన్ని గ్రామాలలో రోడ్లను అభివృద్ధి పరుస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అందరికీ సామాజిక భద్రత కింద అసరా పింఛన్‌లు, రేషన్ సరుకులను అందజేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో టిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకుసాగి పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని కోరారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలను అంబరాన్నంటే విధంగా నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రతి గ్రామంలో తప్పనిసరిగా జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. జాతీయ రహదారిపై స్వాగత తోరణాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పండుగవలే అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించాలన్నారు. మిఠాయిలను పంచిపెట్టి సంబరాలను జరుపుకోవాలని కోరారు. అందరు కలిసికట్టుగా ఐకమత్యంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ సంబరాలను విజయవంతం చేయాలని సూచించారు.
సమావేశంలో ఎంఎఎంసి చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ కృష్ణమూర్తి, జెఎసి చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు నందారెడ్డి, భాస్కర్, విష్ణుచారి, మల్లికార్జున్, మోహన్‌రెడ్డి, మోనార్క్, రఘు, రవీందర్‌రెడ్డి, సాటే నరేందర్, రమేశ్ ముదిరాజ్, శారద, ఇంద్రసేనారెడ్డి, ఇంద్రారెడ్డి, బుచ్చయ్యచారి, సత్యనారాయణరెడ్డి, రవీందర్‌గౌడ్, రామస్వామి, శివకుమార్, నాగేందర్, మల్లేశ్ సర్పంచ్‌లు బేరీ ఈశ్వర్, రాజమల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.