రంగారెడ్డి

జిల్లాలో 10కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, ఆగస్టు 3: అడవులు ఉంటే వర్షాలు కురుస్తాయి.. వర్షాలు కురిస్తేనే అన్నదాత ఆనందంగా ఉంటాడు.. అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం పూడూరు మండలంలోని కేశవరెడ్డి రెసిడెన్సియల్ పాఠశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్, చేవేళ్ల డిఎస్పీ శృతికీర్తి పాల్గొని మొక్కలు నాటారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో పది కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం అని, ఇప్పటికే నాలుగు కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. ఒక్కో గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం వాటర్ ట్యాంక్‌ల ద్వార ప్రజలకు తాగు నీటిని అందిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు చెట్లు నాటక పోతే రానున్న రోజులలో వర్షాలు పడటం కష్టంగా ఉంటుందని అన్నారు. అన్నదాత రెండు పంటలు పండించాలంటే ప్రతి ఒక్కరు ఓ చెట్టును నాటాలని అన్నారు. ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి మాట్లాడుతు గతంలో బావుల కిందట కిందట వరి పంటను వేసేవారని, నేడు బోరులలోని నీటి ద్వారా వరి పంటలు వేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామంలో చెట్లు చాల ఉండేవని నేడు ఆ చెట్లు కనిపించడం లేదని అన్నారు. ఎస్పీ నవీన్ కుమార్ మాట్లాడుతూ లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, లక్ష్యాన్ని చేరుకున్నామని పేర్కొన్నారు. పరిగి సిఐ ప్రసాద్, చేవెళ్ల సిఐ ఉపేంధర్, చన్‌గోమూల్ ఎస్‌ఐ శేఖర్, కుల్కచర్ల ఎస్‌ఐ వెంకటేశ్వర్ గౌడ్, పరిగి ఎస్‌ఐ నాగేష్ పాల్గొన్నారు.

చలాన్ వివాదం
ఎస్‌ఐ-యువకుడి మధ్య వాగ్వాదం
నేరేడ్‌మెట్, ఆగస్టు 3: హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడికి ఎస్‌ఐ చలానా రాయడంతో యువకుడికి ట్రాఫిక్ ఎస్‌ఐకి జరిగిన వాగ్వివాదం ఆందోళనకు దారి తీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ తన విధులలో భాగంగా బుధవారం సాయంత్రం వౌలాలి జెడ్‌టిసి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నాడు. అదే సమయంలో మల్కాజిగిరి ఎస్‌పినగర్‌లో నివసించే భరత్ అనే యువకుడు వౌలాలి నుండి జెడ్‌టిసి వైపు తన బైక్‌పై వెళ్తున్నాడు. యువకుడు హెల్మెట్ ధరించకపోవడంతో ఎస్‌ఐ బైక్ ఆపి యువకుడికి చలానా రాస్తానని చెప్పగా యువకుడు తన వెంట హెల్మెట్ ఉందని ఎస్‌ఐతో వాగ్వివాదానికి దిగాడు. హెల్మెట్ ఉన్నా ధరించలేదని ఎస్‌ఐ చెప్పడంతో యువకుడు ఎస్‌ఐ పట్ల దురుసుగా ప్రవర్తించాడని స్థానికులు పేర్కోన్నారు. దీంతో కోపానికి గురైన ఎస్‌ఐ యువకుడిని తిట్టడంతో ఇద్దరి మధ్య మాటలు పెరగడంతో దారి వెంబడి వెళ్లేవారు కలుగజేసుకుని ఇరువురికీ సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. చివరకు విషయం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో యువకుడు ఎస్‌ఐకి క్షమాపణ చెప్పినట్టు తెలిసింది. కాగా, విధి నిర్వహణలో భాగంగా యువకుడిని అపి తనిఖీ చేసిన ఎస్‌ఐ పట్ల యువకుడు దురుసుగా ప్రవర్తించాడని సిఐ తెలిపారు. తమ సిబ్బంది వద్ద వీడియో రికార్డింగ్ కూడా ఉందన్నారు.

మానవ మనుగడకు చెట్లే ప్రాణాధారం
రాజేంద్రనగర్, ఆగస్టు 3: మానవ మనుగడకు చెట్లే ప్రాణాధారమని నగర డిప్యూటి మేయర్ ఫసియుద్దీన్ స్పష్టం చేశారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో గ్రీన్‌విచ్ అకాడమీ స్కూల్లో నిర్వహించిన మొక్కల అవగాహన, మొక్కల పంపిణీ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పాల్గొని మొక్కలను పంపిణీ చేశారు. రాష్ట్రం పచ్చగా ఉండటమే కాకుండా పంటలు సుభిక్షంగా పండేందుకు చెట్ల అవసరాన్ని గుర్తించి హరిహహారం కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను తీసుకొని హరితహారం కార్యక్రమంలో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యార్థి లోకం, పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ముకీద్ చందా, స్కూల్ యాజమాన్యం టి.సుధాకర్‌రెడ్డి, సి.బుచ్చిరెడ్డి, ఎస్.మహిపాల్, జి.మల్లేష్ యాదవ్, బండ రాజేష్ యాదవ్, రామకృష్ణారెడ్డి, శరణమ్మ, వెంకట్, ఎ.మహేశ్వర్, మహేష్ పాల్గొన్నారు.
పచ్చదనమే ప్రకృతికి అందం
గచ్చిబౌలి: మానవాళి మనుగడకు పచ్చని చెట్లు ఆధారమవడమే కాక పచ్చదనమే ప్రకృతికి అందమని సైబరాబాద్ వెస్ట్ పోలీస్ కమిషనర్ నవీన్‌చంద్ అన్నారు. గచ్చిబౌలి పోలీసులు ఏర్పాటుచేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం బొటానికల్ గార్డెన్స్‌లో ఆయన మెక్కలు నాటారు. నాటిన మొక్కలు చెట్లుగా మారేవరకు సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.
భవిష్యత్తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించేందుకు అందరం కృషి చేయాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాలకు కారణం సరైనన్ని చెట్లు లేకపోవడమేనని, అందుకు ప్రభుత్వంతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలే కాక ఇంటింటికి ఒక మొక్కను నాటాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. కార్యక్రమంలో మాదాపూర్ డిసిపి కార్తికేయ, ఎసిపి రమణకుమార్, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్‌తో పాటు గౌతమి రెసిడెన్షియల్ కాలనీవాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

రేడియల్ రోడ్డు పనులను పరిశీలించిన బృందం
జీడిమెట్ల, ఆగస్టు 3: నగర శివారు ప్రాంతంలోని దొమ్మరపోచంపల్లి గ్రామం సారెగూడెం నర్సాపూర్ ప్రధాన రహదారిని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చెర్మన్ దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, అధికారులతో కలిసి పరిశీలించారు. దుందిగల్ ఔటర్ రింగ్ రోడ్డు, నర్సాపూర్ రేడియల్ రోడ్లను పర్యవేక్షించారు. పివిసి చైర్మన్ ఎన్.దయాకర్‌రావు మాట్లాడుతూ పివిసి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ అనేకసార్లు రేడియల్, రింగ్‌రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని, అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారని అన్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి పరిశీలించామని చెప్పారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి, కెసిఆర్ ఆశయాలకు అనుగుణందా ఈ కమిటీ ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు, గండిమైసమ్మ రేడియల్ రోడ్ల పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తిచేసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయడం వలన ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు పనులను సదరు కాంట్రాక్టర్ సరిగ్గా, త్వరగా చేయని పక్షంలో నూతన కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరావు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు, ఓఆర్‌ఆర్ డైరెక్టర్ శే్వతా మహంతి, రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బి.ప్రభాకర్‌రెడ్డి, డిపి పల్లి సర్పంచ్ ముడిమ్యాల రాముగౌడ్, బౌరంపేట్ పిఎసిఎస్ చైర్మన్ రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.

పోలీసులు కక్ష సాధింపు మానుకోకపోతే సహించం
వికారాబాద్, ఆగస్టు 3: కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని మాజీ మంత్రి, పిసిసి ఉపాధ్యక్షుడు, నిజామాబాద్ పార్టీ ఇన్‌చార్జి గడ్డం ప్రసాద్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం దాదాపు 100 మంది నాయకులతో ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై నమోదైన అక్రమ కేసులపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్పీ నవీన్‌కుమార్‌కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ మూడుసార్లు సర్పంచ్‌గా ఎన్నికై ప్రస్తుతం జడ్పీటిసిగా ఉన్న రాములుపై తప్పుడు కేసులు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీలోకి లాక్కొనేందుకే కేసుల పేరుతో భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను సైతం వేధించడం విచిత్రకరమని చెప్పారు. ఎస్పీకి అన్ని వివరాలు ఇచ్చామని, 15 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే ధర్నా చేపడతామని హెచ్చరించారు. అవినీతికి మారుపేరుగా రాష్ట్రంలో సిఎం కేసిఆర్ కుటుంబంలోని నలుగురు మారారని ఆరోపించారు. దోపిడీ తగ్గాలంటే మరలా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. పోలీసు అవినీతి నిర్మూలనకు రాష్ట్ర స్థాయిలో ధర్నా చేపడతామని ప్రకటించారు. ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ శాఖలు ప్రజలను దోచుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఆపదలో ఉన్న రాష్ట్రంలోని ఏ కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ చేసినా ఆదుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ గుప్త, డిసిసిబి డైరక్టర్ ఎన్.కిషన్‌నాయక్, డిసిసి అధికార ప్రతినిధులు జె.రత్నారెడ్డి, ఎ.రాజశేఖర్, జడ్పీటిసి రాములు, పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.అనంత్‌రెడ్డి, ఎ.సుధాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పటేల్ సంగమేశ్వర్, మాజీ ఎంపిపి నర్సింలు, మున్సిపల్ కౌన్సిలర్ మధుకర్, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహరెడ్డి, మధుకర్‌రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బి.రాజశేఖర్‌రెడ్డి, సుభాన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, మతిన్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.