రంగారెడ్డి

చందానగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఆగస్టు 6: చందానగర్‌లోని గంగారం వద్ద గల సెంట్రో షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఐదు అంతస్తుల భవనంలోని చెప్పులు, బట్టలు అగ్నికి ఆహుతయ్యాయి. ఉదయం పది గంటల నుంచి రాత్రి వరకు మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ఏడు అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలు చల్లారుస్తున్నప్పటికీ రాత్రి వరకు మంటలు చల్లారలేదు. దీంతో జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో కోట్లల్లో ఆస్తినష్టం జరిగి ఉంటుందని యాజమాన్యం చెబుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముంబయి జాతీయ రహదారిపై గంగారం వద్ద సెంట్రో షోరూం నిర్వహిస్తున్నారు. షోరూంలో గల ఐదు అంతస్తుల్లోనూ ఉన్న చెప్పులు, బట్టలు, ఇతర సామాగ్రితో పాటు ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. శుక్రవారం రాత్రి యధావిధిగా షాపును మూసివేసి అందరూ వెళ్లిపోయారు. శనివారం ఉదయం పది గంటలకు షోరూం ఇన్‌చార్జి దీపక్ శెట్టి షోరూం తెరవడానికి వచ్చి చూడగా లోపలినుంచి పొగలు రావడం గమనించాడు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు, చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. బిహెచ్‌ఇఎల్, మాదాపూర్, కూకటపల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్ల నుంచి ఏడు అగ్నిమాపక యంత్రాలు వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించాయి. ఉదయం పది గంటల నుంచి మంటలు ఆర్పుతున్నప్పటికీ రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మంటలు పూర్తి స్థాయిలో చల్లారలేదు. బ్రాండెడ్ షూస్, చెప్పులు, లెదర్ వస్తువులు ఉండడంతో మంటలు అదుపులోకి రావడానికి ఆలస్యం అయిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ రీజనల్ ఫైర్ ఆఫీసర్ లక్ష్మీ ప్రసాద్ పర్యవేక్షణలో రంగారెడ్డి జిల్లా అధికారులు, సిబ్బంది దాదాపు పది గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మూడవ అంతస్తులో ఏర్పాటు చేసిన అద్దాలు వేడికి పగిలి రోడ్డుపై పడడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. పక్కనే గల అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురై, ఇళ్లనుంచి బయటకు పరుగులు పెట్టారు. చందానగర్ ఇన్‌స్పెక్టర్ ఎన్.తిరుపతిరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ లు సైదులు, వేణుకుమార్, శ్రీనివాస్, సిబ్బంది తగిన బందోబస్తు చేసి స్థానికులను కట్టడి చేశారు. ఆస్తినష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. షోరూం ఇన్‌చార్జి దీపక్ శెట్టి ఫిర్యాదు మేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యాజమాన్యంకు నోటీసులు
చందానగర్‌లో అగ్నిప్రమాదం సంభవించిన సెంట్రో షోరూం భవన యజమానికి నోటీసులు జారీ చేసి పూర్తి వివరాలు సేకరిస్తామని శేరిలింగంపల్లి సర్కిల్12 అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె.మహిపాల్ రెడ్డి తెలిపారు. తమ వద్ద ఉన్న వివరాల ప్రకారం సెల్లార్ ప్లస్ ఐదు అంతస్తుల భవనానికి 2010లో క్రమబద్ధీకరణ చేసినట్లు చెప్పారు. భవనంలోని సెల్లార్‌లో పార్కింగ్, మొదటి అంతస్తులో ఆఫీస్, పై నాలుగు అంతస్తుల్లో నివాసం కోసం కట్టిన ఎనిమిది ఫ్లాట్లకు జిహెచ్‌ఎం సి అధికారులు క్రమబద్ధీకరించారు.
కాగా నిబంధనలకు విరుద్ధంగా ఐదు అంతస్తుల్లో షోరూంను నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ట్రేడ్ లైసెన్స్ కోసం జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారని, ఇంకా శాశ్వత లైసెన్స్ మంజూరు చేయలేదని వెస్ట్‌జోన్ లైసెన్సింగ్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదానికి గురైన భవనాన్ని జిహెచ్‌ఎంసి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ బివి గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి సర్కిల్ 12 ఉప కమిషనర్ వి.మమత, టౌన్ ప్లానింగ్ విభాగం ఎసిపి కె.మహిపాల్ రెడ్డి, టిపిఎస్ రాజలింగం భవన నిర్మాణ అనుమతులపై వివరాలు సేకరించారు.