రంగారెడ్డి

వరద నీటిలో కొట్టుకుపోయి ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, సెప్టెంబర్ 21: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీటి ధాటికి కొట్టుకుపోయిన ఓ వ్యక్తి బావిలో పడిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం, పెరిక గ్రామానికి చెందిన నాగలింగం (55) కొంపల్లి సర్వీస్ రోడ్డులోని లక్ష్మినర్సింహ సాయి మెస్‌లో పనిచేస్తూ మెస్‌పక్కనే గల ఓ రూమ్‌లో ఉంటాడు. రూమ్ పక్కన బావి ఉంది. మెస్ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లి నాగలింగం నిద్రపోతున్నాడు. మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వరద నీటి ధాటికి ఇల్లు కూలిపోవడంతో పాటు నాగలింగం కొట్టుకుపోయి పక్కనే ఉన్న బావిలో పడి మృతి చెందాడు. మెస్ నిర్వాహకుడు బుధవారం వెళ్లిచూడగా నాగలింగం కనిపించకపోవడంతో పక్కనే గల బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజాంపేట్‌లో విద్యుత్ షాక్‌తో
ఎలక్ట్రీషియన్ మృతి
జీడిమెట్ల, సెప్టెంబర్ 21: నిజాంపేట్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన కెపిహెచ్‌బి కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. నిజాంపేట్ గ్రామం కరూర్ వైశ్యా బ్యాంక్ సమీపంలోని వజ్ర నిర్మాణ్ పుష్పక్ అపార్ట్‌మెంట్‌లో వరద నీటిని బయటకు పంపించేందుకు ఎలక్ట్రీషియన్ బి.శ్రీనివాస్ (35) మోటార్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అల్వాల్ కొత్తచెరువులో ఒకరి గల్లంతు
అల్వాల్, సెప్టెంబర్ 21: ఇంట్లోకి పాము చొరబడటంతో దానిని కొట్టడానికి కట్టెను తీసుకురావటానికి వెళ్లి వర్షం నీటిలో జారిపడి గల్లంతైన సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిథిలో రాజీవ్ వీకర్ సెక్షన్‌లో నివాసం ఉండే రత్లావత్ శంకర్ డ్రైవర్‌గా పనిచేస్తూ రాజీవ్ వీకర్‌సెక్షన్ లో చిన్నపాటి గుడిసె వేసుకుని కుటుంబసభ్యులతో కల్సి నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం తాను నివాసం ఉంటున్న గుడిసెలోకి పాము చొరబడింది. దీంతో అందోళన చెందిన శంకర్ పామును కొట్టడానికి కట్టె తీసుకురావటానికి వెళ్లి ప్రమాదవశాత్తు కొత్తచెరువులో జారిపడి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే అతడు నీటిలో మునిగిపోయాడు. అతనికి ఈత రాకపోవటంతో చెరువులో కొట్టుకుపోయాడు. విషయం తెల్సిన అల్వాల్ సిఐ అనంద రెడ్డి బృందం చెరువులో గాలింపు చర్యలు ప్రారంభించారు. అర్ధరాత్రి వరకు డ్రైవర్ శంకర్ ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మీర్‌పేట్ హెచ్‌బికాలనీలో డెంగీతో బాలుడి మృతి
కుషాయిగూడ, సెప్టెంబర్ 21: మీర్‌పేట్ హెచ్‌బికాలనీ డివిజన్ తిరుమలనగర్‌కు చెందిన అనిరుథ్ (12) అనే బాలుడు డెంగ్యూ జ్వరంతో మృతి చెందిన సంఘటన కలకలం సృష్టించింది. మృతుడి తండ్రి ప్రార్ధుమాన్ తెలిపిన వివరాల ప్రకారం మీర్‌పేట్ హెచ్‌బికాలనీ తిరుమలనగర్‌కు చెందిన అనిరుధ్ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో స్థానిక అసుపత్రిలో చేరగా డెంగ్యూ జ్వరంగా డాక్టర్లు తెలిపారు. చికత్స పొందుతున్న బాలుడు బుధవారం రాత్రి మృతి చెందాడు. మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ తిరుమలనగర్‌లో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నిండుకుండలా హైటెక్ చెరువులు

గచ్చిబౌలి, సెప్టెంబరు 21: రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హైటెక్ సిటీ ప్రాంతంలోని చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలను ముందుగానే గ్రహించిన ఇరిగేషన్ అధికారులు తూములను ముందే తెరిచివుంచడంతో వచ్చిన వర్షపునీరంతా కిందకు వెళ్లిపోయింది. మాదాపూర్‌లోని దుర్గం చెరువు, మేడికుంట, తమ్మిడి కుంట, సున్నం చెరువులు ప్రమాద స్థాయికి చేరి నిండుగా ప్రవహిస్తున్నాయి. రాయదుర్గంలోని మల్కం చెరువు, ఖాజాగూడ చెరువు, గోపన్‌పల్లి పెద్ద చెరువులు వర్షపు నీటితో కళకళలాడుతున్నాయి. వికారాబాద్ నుంచి హుస్సేన్ సాగర్‌కు వెళ్లే బుల్కాపూర్ నాలా ఉద్ధృతంగా ప్రవహించడంతో రాయదుర్గం విలేజ్‌లోని కొన్ని ఇళ్లల్లోకి వాననీరు రావడంతో అధికారులు సకాలంలో స్పందించి, వాటిని లోతట్టు ప్రాంతాలకు మళ్లించారు. వర్షం ఉదయానికి తగ్గుముఖం పట్టడంతో పాటు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో కొంత ఉపశమనంగా ఏర్పడింది. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు గుంతలమయంగా మారడంతో కార్లలో విధులకు వెళ్లే వారు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తీవ్ర ట్రాఫిక్ జామ్‌ను ఎదుర్కొన్నారు.
భారీ వర్షానికి తెగిపోయిన రోడ్లు
కీసర: మంగళవారం రాత్రి కురిసిన భారీవర్షానికి కీసర మండలంలోని చెరువులు నీటితో నిండి నిండు కుండల్లా కళకళలాడుతున్నాయి. కీసరలోని పెద్దమ్మ చెరువు కీసరగుట్టలోని నూర్‌మహ్మద్ చెరువు నాగారంలోని అన్నరాయని చెరువు దమ్మాయిగూడలోని దమ్మాయిచెరువుతో పాటు కుంటలు నీటితో నిండి అలుగులు పారుతున్నాయి. నాగారం, దమ్మాయిగూడ గ్రామాల్లోని భవానీనగర్, అరవిందనగర్, బిఎంఆర్ ఎన్‌క్లేవ్, లక్ష్మీఎన్‌క్లేవ్ కాలనీల్లోకి నీరు చేరటంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాంపల్లి దాయర నుంచి జాఫర్‌గూడ వెళ్లే ప్రధాన రోడ్డు నీటి ప్రవాహానికి తెగిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కాగా నూర్‌మహ్మద్ చెరువు తూములు శిథిలావస్ధకు చేరటంతో చెరువులోని నీరంతా బయటికి వెళ్లి పోతున్నాయి.
పొంగిపొర్లుతున్న శంకర్‌పల్లి మూసీ నది
శంకర్‌పల్లి: మంగళవారం కురిసిన వర్షానికి బుధవారం శంకర్‌పల్లి మూసీనది వరదనీరుతో పొగిపొర్లింది. దీంతో రైతులు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. కుంటలు, చెరువులు, చెక్‌డ్యాంలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. పక్షులు, జంతువులకు నీటి కొరత తీరింది. ఎండిన బావులు, బోర్లలో నీటి మట్టాలు పెరిగి నీళ్లు రావడంతో ప్రజలు ఆనందపడుతున్నారు.
మరో నాలుగైదు సార్లు మూసీ పొంగిపొర్లితే గండిపేట చెరువులో నీళ్లు పుష్కలంగా చేరుతాయని మండల ప్రజలు పేర్కొంటున్నారు. కాగా ఇటు మూసీ నది బ్రిడ్జిపై నీరు పారడం, అలాగే పత్తెపురం రైల్వేగేటు వద్ద ట్రాక్ పనులు జరుగుతుండటంతో రాకపోకలు ఒకేసారి స్తంభించిపోయాయి. మండల ప్రజలు ప్రొద్దటూరు బ్రిడ్జిపై నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు.

కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం

జీడిమెట్ల, సెప్టెంబర్ 21: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సర్కిల్ పరిధిలోని గాజులరామారం చిత్తారమ్మ దేవాలయం వెనుక నాలాపై నుంచి వరద నీరు ఉవ్వెత్తున రోడ్డు ప్రవహించడంతో నాలాకు ఆనుకుని ఉన్న బస్తీలన్నీ జలమయమయ్యాయి. నాలాపై నుంచి వరద నీరు భారీగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రగిరినగర్, లెనిన్‌నగర్, జయశంకర్ నగర్, దేవెందర్ నగర్ బస్తీలు నీట మునిగాయి. దేవెందర్‌నగర్‌లో భారీ వర్షానికి ఓ ఇల్లు కుప్పకూలింది. అదేవిధంగా చింతల్‌లోని భగత్‌సింగ్‌నగర్ దోభీఘాట్ పూర్తిగా నీట మునిగింది. స్థానికంగా ఉన్న ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బస్తీ వాసులంతా రాత్రి నుండి జాగారం చేశారు. రంగారెడ్డినగర్‌లోని పలు పరిశ్రమలలోకి వరద నీరు చేరింది. చింతల్, గణేశ్‌నగర్, సుభాష్‌నగర్, వెనె్నలగడ్డ, కుత్బుల్లాపూర్, శ్రీనివాస్ నగర్ కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీరు ముంచెత్తింది. వెనె్నలగడ్డ చెరువు కట్ట కొంత తెగింది. కింది బస్తీలు, కాలనీల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటి కారణంగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్, స్థానిక ఎమ్మెల్యే కెపి వివేక్, జోనల్ కమిషనర్ శంకరయ్య, సర్కిల్ ఉపకమిషనర్ మమత, జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి వెనె్నలగడ్డ చెరువును, గాజులరామారం చిత్తారమ్మ ఆలయం వెనుక గల నాలా, సుభాష్‌నగర్‌లలో పర్యటించారు. జీడిమెట్ల డివిజన్‌లోని అంగడిపేట్, ఎన్‌సిఎల్ కాలనీ ప్రాంతాలలో ఎమ్మెల్యే కెపి వివేక్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. దేవెందర్‌నగర్, గాజులరామారంలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి పర్యటించారు. కూలిన ఇళ్లును పరిశీలించారు. డివిజన్‌లోని అయోధ్యనగర్, వెంకన్నహిల్స్, శ్రీనివాస్‌నగర్, సాయినగర్, మీనాక్షిఎస్టేట్స్, దుర్గావిహార్, ఎన్‌సిఎల్ కాలనీ, అంబేద్కర్ నగర్, ప్రసూన నగర్‌లలో తెరాస నేత కెఎం ప్రతాప్ పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. బాచుపల్లి గ్రామంలోని పత్తికుంట నిండిపోవడంతో గ్రామస్థులు చెరువుకట్టను తొలగించి నీటిని మల్లించారు. మేడి కుంట నిండి అలుగు నుండి నీరంతా రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గ్రామంలోని మా విల్లాస్, జయదీపిక, ఆదిత్య కాలనీలలోని అపార్ట్‌మెంట్‌ల సెల్లార్‌లలోకి వరద నీరు చేరింది. కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మల్లంపేట్ గ్రామం అతి పెద్ద చెరువైన కత్వ చెరువు కట్టకు గండిపడింది. వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది కట్ట తెగిపోకుండా ముందస్తు చర్యలను చేపట్టారు. దూలపల్లి గ్రామం నుంచి కొంపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో పైనుంచి వచ్చే వరద నీరు రోడ్డు పై నుండి ప్రవహించింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దొమ్మరపోచంపల్లి గ్రామంలోని కుడికుంట చెరువు అలుగు నుండి బారీగా వరద నీరు బయటికి వచ్చింది. కుండపోతగా కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గ ప్రజలు నానా అవస్థలను ఎదుర్కొంటున్నారు. నాలాలు, చెరువులు, కుంటలు నిండి లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు చేరింది. బస్తీలు, కాలనీలలోని ప్రజలు అతలాకుతలం అయ్యారు.
బండారి లేఅవుట్ కాలనీ
వాసుల అష్టకష్టాలు
నగర శివారు ప్రాంతంలోని నిజాంపేట్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. మంగళవారం రాత్రి 8గంటలకు ప్రారంభమైన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి వరద నీటితో కాలనీలు, అపార్ట్‌మెంట్‌లను ముంచెత్తాయి. నిజాంపేట్ గ్రామం బండారి లే అవుట్ కాలనీలో తుర్క చెరువు నిండి తూము, అలుగు నుంచి వరద నీరు భారీగా ప్రవహించింది. కాలనీలోని అపార్ట్‌మెంట్‌ల సెల్లార్‌లకు, రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీరు ప్రవహిస్తుంది. దీంతో అపార్ట్‌మెంట్‌లలో నివసించే ప్రజలు నానా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 4 గంటల వరకు కురిసిన కుండపోత వర్షానికి గ్రామంలోని కాలనీలన్నీ నీట మునిగాయి. అపార్ట్‌మెంట్‌ల నుండి జనాలు బయటికి వచ్చే పరిస్థితి లేదు. విషయం తెలుసుకున్న కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ అధికార బృందం కాలనీలో పర్యటించారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ, మండల ఇన్‌చార్జి తహశీల్దార్ నర్సింహారెడ్డి, ఎంపిడిఓ అరుణ, ఇవోపిఆర్‌డి జ్యోతి, ఆర్‌ఐ సుధాకర్‌లు ఎప్పటికప్పుడు పర్యటిస్తూ కాలనీ వాసులకు సహాయ చర్యలను చేపట్టారు. అపార్ట్‌మెంట్‌ల సెల్లార్‌ల నుండి ఫైరింజన్ సహాయంతో నీటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. తహశీల్దార్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 4 గంటల వరకు 230.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. నిజాంపేట్ గ్రామంలో ప్రమాదస్థాయికి చేరిన చెరువులకు ఇసుక నింపిన బ్యాగులతో మూసివేస్తున్నామని, అలుగులను 15 ఫీట్ల వరకు తొలగించి నీరు వెళ్లేవిధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా తాత్కాలిక చర్యలు చేపట్టామని అన్నారు. ఇరిగేషన్ అధికారులతో ప్రణాళికలు వేయించి తద్వారా చెరువులకు శాశ్వత పరిష్కారం చేస్తున్నామని తెలిపారు. బుధవారం, గురువారం మెడికల్ క్యాంప్‌ను నిర్వహిస్తామని చెప్పారు. ఇంటింటికి నర్సు తిరిగి చికిత్సలు చేస్తారని అన్నారు. కాలనీ వాసులకు తాగునీటిని సరఫరా చేస్తున్నామని, బండారి లేఅవుట్ కాలనీలోని ప్రతి రోడ్డులో గంటుకోసారి వాటర్ ట్యాంకర్ వస్తుందని చెప్పారు. ముందస్తుగా సెలవును ప్రకటించామని, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని సహాయక చర్యలను చేపడుతున్నామని అన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులను చేయిస్తున్నామని తెలిపారు. డిపిఓ ఎఓ రమణాచారి, శామీర్‌పేట్ మండల ఇవోపిఆర్‌డి మల్లిఖార్జున, నిజాంపేట్ గ్రామ కార్యదర్శి దుర్గాప్రసాద్ ఉన్నారు.
భారీ వర్షానికి నిజాంపేట్ గ్రామం వణికిపోతుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో అన్న ఆందోళన గ్రామస్థులు గడుపుతున్నారు. బండారి లేఅవుట్ కాలనీలో భారీ స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండడంతో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. భయం గుప్పిట్లో కాలనీలు, అపార్ట్‌మెంట్ వాసులు పూట గడుపుతున్నారు.
మేడ్చల్‌లో పొంగిపొర్లిన వాగులు, వంకలు
మేడ్చల్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం, దీనికి తోడుగా చురుగ్గా కదుతులున్న రుతుపవనాల కారణంగా మేడ్చల్‌లో మంగళవారం రాత్రి నుండి ఏకధాటిగా బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు, డ్రైనేజీల మురుగు వరదలై పారింది. మండలంలో అక్కడక్కడా పాత ఇళ్లు కొన్ని పాక్షికంగా దెబ్బతినగా మరికొన్ని పూర్తిగా కూలిపోయాయి.