కృష్ణ

అమృత విశ్వవిద్యాపీఠానికి రేపు సీఎం శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఫిబ్రవరి 5: రాజధాని అమరావతి నగర పరిధిలోని కురగల్లు - ఎర్రబాలెం గ్రామాల మధ్య 150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన అమృత విశ్వవిద్యాపీఠానికి ఈనెల 7వ తేదీ ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. సోమవారం శంకుస్థాపన జరిగే స్థలాన్ని జిల్లా ఎస్పీ విజయారావుతో కలిసి కలెక్టర్ శశిధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాకను దృష్టిలో ఉంచుకుని ఎస్పీతో కలిసి ఏర్పాట్లు పరిశీలించామని, సుమారు 5 వేల మంది విద్యార్థులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నామని, 150 ఎకరాల విస్తీర్ణంలో విద్యాపీఠం ఏర్పాటవుతుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో సెక్యూరిటీ, భోజన వసతి మొదలైన అంశాలపై ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించామన్నారు. అమృత విశ్వవిద్యాపీఠం ఇన్‌చార్జ్ స్వామి సదాశివ చైతన్య మాట్లాడుతూ దేశంలో అమరావతిలో తాము ఏర్పాటు చేసే సంస్థ ఏడవదని, మొదటి దశలో 150 ఎకరాల్లో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులు 800 సీట్లతో వచ్చే ఆగస్టు నాటికి ప్రారంభ మవుతుందని, ఇందుకు 150 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని, రెండోదశలో మెడికల్ కాలేజీ, హాస్పిటల్, మూడోదశలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని సదాశివచైతన్య తెలిపారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని హెలీపాడ్‌ను ఏర్పాటు చేశారు. 5 వేల మంది కూర్చునేందుకు వీలుగా మందిరం, సిఎం ప్రసంగంచే వేదిక ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, భోజన వసతి, పార్కింగ్, సెక్యూరిటీ మొదలైన అంశాలపై కలెక్టర్ చర్చించి సూచనలు చేశారు. ఆర్‌డిఓ శ్రీనివాసరావు, విద్యుత్, ఆర్ అండ్ బి, రెవిన్యూ, సిఆర్‌డిఎ, పోలీసు మొదలైన ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్వల్ప వివాదం నేపథ్యంలో ఇరువర్గాల ఘర్షణ
ఒకరి మృతి
* ఇద్దరి పరిస్థితి విషమం
గురజాల, ఫిబ్రవరి 5: స్వల్ప వివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని జంగమహేశ్వరపురం గ్రామంలో ఇంటి వద్ద నెలకొన్న స్వల్ప వివాదం కారణంగా ఏసిరెడ్డి శ్రీనివాసరెడ్డి (42), ఏసిరెడ్డి పుల్లారెడ్డి, వారి బావ పోలు చెన్నారెడ్డిలపై అదే గ్రామానికి చెందిన వంగటి నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డి, పద్మలు కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తలపై తీవ్రగాయం కావడంతో ముగ్గురు క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ వైద్యశాలలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా శ్రీనివాసరెడ్డి మార్గ మధ్యంలోమృతి చెందాడు. మిగిలిన ఇద్దరు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు గురజాల సిఐ రామారావు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

మాచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై కేసు నమోదు
మాచర్ల, ఫిబ్రవరి 5: మాచర్ల పురపాలక సంఘ చైర్‌పర్సన్ నెల్లూరి మంగమ్మపై సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మున్సిపల్ కార్యాలయంలో జనన, మరణ ధృవీకరణ పత్రాల విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిన కంప్యూటర్ ఆపరేటర్‌గా షేక్ ముంజారీనా పనిచేస్తుంది. ఆమెపట్ల చైర్మన్ అనుచరుడైన అల్లావుద్దీన్ కార్యాలయంలో హల్‌చల్ చేస్తూ సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దురుసుగా మాట్లాడాడని, ఈ నేపథ్యంలో అతను జనన ధృవీకరణకు సంబంధించి కంప్యూటర్‌లో నమోదు చేయాలని చెప్పటంతో తాను అందుకు సంబంధించిన ఆధారాలు కావాలని చెప్పటంతో తాను చెప్పిన పనే మీరు చెయ్యరా అంటూ విధులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించాడని, ఆయనకు మద్దతుగా చైర్‌పర్సన్ మంగమ్మ అల్లావుద్దీన్ చెప్పిన పని చెయ్యాల్సిందేనని, అతను ఆమె మనిషని, అతను గతంలో ఏడు హత్యలు చేయించాడని, 8వ హత్య చేయించడానికి వెనుకాడడని చైర్‌పర్సన్ మంగమ్మ కూడా తనపట్ల దురుసుగా ప్రవర్తించి బెదిరించారని ఆపరేటర్ ముంజారీనా పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అర్బన్ సిఐ సాంబశివరావు చైర్‌పర్సన్ మంగమ్మ, అనుచరుడు అల్లావుద్దీన్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.