విశాఖపట్నం

మిన్నంటుతున్న ‘జన ఘోష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ మంజూరు తదితర డిమాండ్లతో ఈనెల 11న ప్రారంభమైన ఉత్తరాంధ్ర జనఘోష కార్యక్రమం విద్యార్థులను మేల్కొలిపే విధంగా సాగుతోంది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యార్థులతో సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ప్రాధాన్యతలను విద్యార్థులకు వివరిస్తున్నారు. అయితే, కొన్ని చోట్ల విద్యార్థులే హోదా, జోన్ వస్తే, భవిష్యత్ తరాలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో సభలో చెప్పడం పలువురిని ఆశ్ఛర్యపరుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోడానికి కారణాలను కూడా విద్యార్థులు విశే్లషించి చెపుతున్నారంటే, హోదా, జోన్ అంశాలు ఏవిధంగా ప్రజల్లోకి వెళ్లిపోయాయో అర్థం చేసుకోవచ్చు. జీకే వీధిలో జరిగిన సభలో విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును దుయ్యబట్టారంటే, పాలకులపట్ల వారికి ఉన్న అభిప్రాయమేంటో అవగతమవుతోంది.
ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాపకింద నీరులా సాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, కార్మిక, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సభల్లో పాల్గొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా సాగుతున్న ఈ ఉద్యమానికి బీజేపీ, టీడీపీ తప్ప అన్ని పార్టీలూ దన్నుగా నిలుస్తున్నాయి. ఈనెల 11న ప్రారంభమైన ఉత్తరాంధ్ర జనఘోష పర్యటన నాలుగో తేదీతో ముగియనుంది.
నాలుగో తేదీ సాయంత్రం బీచ్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా కొణతాల రామకృష్ణ అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపించారు. అలాగే, జిల్లాలోని సుమారు 900 మంది సర్పంచ్‌లను ఆయన ఆహ్వానించారు. ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనలో పాల్గొనే అవకాశం ఉందని కొణతాల ప్రతినిధులు తెలియచేశారు. ఈ సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు సుమారు 10 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఐదవ తేదీన కొణతాల రామకృష్ణతోపాటు, మాజీ ఎంపీలు జ్ఞానేశ్వరరెడ్డి, కణితి విశ్వనాథం తదితరులు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఐదవ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరోసారి తెలుగు ఎంపీలపై వత్తిడి తేవాలని కొణతాల భావిస్తున్నారు.
కాగా, నాలుగో తేదీన జరిగే కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి ఇవ్వాల్సిందిగా కొణతాల రామకృష్ణ గురువారం సీపీ యోగానంద్‌ను కలిశారు. ర్యాలీకి అనుమతి లభించాల్సి ఉంది.

మళ్లీ మంటలు
* వన్య మృగాల ఉనికికి విఘాతం
* భయాందోళనలో నరసింహనగర్ వాసులు
* మంటలు ఆర్పలేమంటున్న అగ్నిమాపక అధికారులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 22: స్థానిక కైలాసపురం కొండల్లో మళ్లీ మంటలు చెలరేగాయి. ప్రతి ఏటా స్థానికులు బొగ్గుల కోసం ఈ కొండలపై వృక్షాలను తగలబెడుతున్నారు. గత సంవత్సరం ఇదే సీజన్‌లో కొండలపై మంటలు చెలరేగినప్పుడు మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం జోక్యం చేసుకుని, ఫైర్, అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ కొండలకు ఎవరు నిప్పుపెడుతున్నారో తెలుసుకోవాలని ఆదేశించారు. మరి ఆ ఆదేశాలను అధికారులు పట్టించుకోపోవడం వలన ఈ ఏడాది కూడా యథాతథంగా మంటలు చెలరేగాయి. ఈ కొండలపై అనేక రకాల వన్యప్రాణులు, పక్షలు ఉన్నాయి. అకస్మాత్తుగా చెలరేగిన ఈ మంటలకు అవి చెల్లాచెదురైపోవడం, లేదా నివాస ప్రాంతాల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ అవి తప్పించుకోలేకపోతే, మంటలకు ఆహుతయ్యే ప్రమాదమూ లేకపోలేదు. అయితే, అగ్నిమాపక అధికారులు మాత్రం ఈ మంటలు ఆర్పలేమని చేతులెత్తేశారు. మంటలు చెలరేగే ప్రదేశానికి ఫైర్ ఇంజన్‌లు వెళ్లవని, సిబ్బంది కూడావెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

సమర్థవంతమైన నాయకత్వంతోనే సమస్యలు పరిష్కారం
* మాజీ డీజీపీ సాంబశివరావు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 22: సమర్థవంతమైన నాయకత్వంతో అనేక సమస్యలను పరిష్కరించవచ్చని మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు అన్నారు. సమాజంలో విభిన్న ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ రకాలుగా స్పందిస్తుంటారని ఆయన అన్నారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) విశాఖపట్నం మేనేజ్‌మెంట్ అసోసియేషన్ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్శిటీలో ఏఐఎంఏ 62వ వ్యవస్థాపక దినోత్సవం, 12వ నేషనల్ మేనేజ్‌మెంట్ డే గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఎటువంటి సవాళ్లు, సమస్యలపట్ల పాజిటివ్‌గా ఆలోచిస్తే, వాటంతట అవే పరిష్కారమవుతాయని అన్నారు. తన సర్వీస్‌లో సాధించిన విజయాలకు మానవత్వమే కారణమని అన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరం అని అన్నారు. సమర్థవంతమైన నాయకులు గతంలో పరిష్కరించిన సమస్యల గురించి ఆయన వివరించారు.