కథ

ప్రేమ ఎంత మధురం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడియారంలో పెండ్యులం ఎంతసేపు చూసినా ఆ కాస్తమేరకు అటూ ఇటూ అలాగే తిరుగుతూ ఉంటుంది. దాంట్లో మార్పేమీ కనిపించదు. పురోగతి కనపడదు. కానీ దానిపైన ఉన్న గడియారం ముఖంలో మాత్రం కాలం ముందుకు సాగుతూనే ఉంటుంది. తిరిగి తిరిగి సంభవించే అనేక విషయాలు దూరం నించి గమనిస్తే పురోగమనాన్ని సూచిస్తూ ఉంటాయి. నది కదలకుండా ఉన్నా జలం ముందుకు సాగినట్లు జీవకోటి ఎప్పుడూ పురోగమిస్తూనే ఉంటుంది. లలిత ఆమెకు ప్రత్యక్ష ఉదాహరణ.
లలితను వింతగా చూసింది రమ. లలిత ఆ చూపులకు ఆశ్చర్యపోయింది. ‘రమా! ఏమిటలా తేరిపార చూస్తున్నావ్. నేను వెనకటి లలితనే. నాలో నీకేం వింత కనిపించింది?’ అడిగింది లలిత.
‘చెప్పనా? వివేక్‌ను పెళ్లి చేసుకొని అత్తవారింటికి నేను వచ్చిన రోజులవి. అద్దె ఇల్లు వెతుకుతూ నువ్వు ఇక్కడికి వచ్చావు. ఈ మేడ మీద పోర్షన్ ఇవ్వాలనే మా మామగారు ‘రెంటల్’ బోర్డు పెట్టారు. నీకు పెళ్లి కాలేదు. ఒంటరిగా ఉండి ఉద్యోగం చేస్తున్నావని నువ్వు చెప్పావ్. ‘ఒక చిన్న పరివారానికైతే ఇల్లు అద్దెకిస్తాం. ఒంటరి ఆడదానికి ఇల్లు అద్దెకివ్వం. నీ మంచీ చెడ్డా మేం ఎక్కడ చూడగలం?’ అన్నారు మా మామగారు. అతనా మాట అంటే నాకు బాధేసింది. ఒంటరి ఆడపిల్లలకు ఎవరూ ఇల్లు అద్దెకివ్వకపోతే వారు చెట్టు కింద ఉంటారా? కానీ నేను కొత్తగా వచ్చినదాన్ని. వారికి నా మనసులో మాట చెప్పే ధైర్యం లేదు. నా అదృష్టం బాగుంది. మా అత్తగారు నీ కుటుంబ వివరాలు, చేస్తున్న ఉద్యోగం గురించి అడిగారు. నీ సమాధానాలు ఆమెకు సంతృప్తి నిచ్చాయి. ‘ఇది ఒక చిన్న కుటుంబానికి సరిపోయే పోర్షన్. నీకింత ఇల్లు అవసరం ఉండదు. ఒంటరిదానివని అద్దె తగ్గించం. నీవు అద్దె భరించగలిగితే మంచి రోజు చూసి దిగు’ అన్నారు...’ రమ చెప్తూ ఆగింది.
‘రమా! ఐదారేళ్ల క్రిందటి మాట. నాకు గుర్తుంది. నువ్వు నా ప్రశ్నకు జవాబు దాటవేశావు’ అంది లలిత.
‘అదే నేను చెప్తున్నా. అప్పుడు నీ వయసు ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది. నీ అన్నకు పెళ్లైంది. నీ అక్కా ఒక ఇంటిదైంది. నువ్వు పెళ్లి చేసుకొని ఇల్లు ఖాళీ చేస్తావు అనుకున్నాను..’
‘పెళ్లి..’ ఆశ్చర్యంగా అంది లలిత.
‘ఎంత చదువు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా స్ర్తి పెళ్లి చేసుకోకుండా ఉండదు. దానికేం ఆనాటికీ ఈనాటికీ నీలో ఎంత మార్పు! నీ జుత్తు అక్కడక్కడా నెరిసింది. రెండు కళ్లు నాలుగయ్యాయి. జీవకోటి పురోగమిస్తుంది అంటారు. ఆ మార్పు నేను నీలో చూడలేక పోతున్నాను. అయినా నీవు ఆనందంగా రోజులు గడుపుతున్నావు. నాకు దుఃఖంలోనూ సంతోషంగా ఉంది’ అంది రమ.
‘నీ కొడుకు ఏడుస్తున్నాడు’ అంది లలిత నవ్వుతూ.
‘వస్తాను. లలితక్కా నువ్వూ రా. నీతో కలిసి టీ తాగి చాలా రోజులైంది’ అంది రమ.
‘ఇప్పుడా? స్వాతి స్కూలు నించి వచ్చేవేళ అయింది’ అంది లలిత. అద్దంలో ముఖం చూసుకుంది. వయసు పెరుగుతూ ఉంటే శరీరంలో మార్పులు సహజమే! ఆమె ఆలోచనలు గతంలోకి పరుగులు పెట్టాయి.
* * *
తాళం తీయగానే భయంకరమైన శూన్యం కబళించడానికి వచ్చినట్లు అనిపించింది. ధైర్యం కూడగట్టుకొని లోనికి వెళ్లింది. ఇంకా చీకటి పడలేదు. గదిలో చిన్నగా వెలుతురుంది. గది నిండా దుమ్మూ ధూళి పేరుకుపోయి ఉంది. తను ఎక్కడ వదిలిన వస్తువు లక్కడ అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. చేతిలోని హేండ్ బ్యాగ్‌ను ఎటాచీని కింద పడేసింది. ముందుగా ఇంటిని శుభ్రం చేయాలి. ఆమెకు నీరసం వచ్చింది. ఉహు! ముందుగా టీ తాగితేనే కాని తనే పనీ చేయలేదు. టీ? పాలెక్కడ ఉన్నాయి? బిందెలో నీళ్లు పదిహేను రోజుల క్రితం నింపినవి. అదేమైనా గంగాజలమా చెడిపోకుండా ఉండడానికి. బాల్కనీ మీదకు వచ్చి రమను కేకేసింది.
రమ క్రింద నుంచే ‘అక్కా! ఎప్పుడు వచ్చావ్?’ అని అడిగింది.
‘ఇదిగో ఇప్పుడే. రమా! సీతాలుంటే ఒక జగ్గు మంచినీళ్లు పంపించు’ అంది లలిత.
‘తప్పకుండా’ అని రమ బదులు చెప్పి రెండు నిమిషాల్లో తనే నీళ్లు తీసుకొని వచ్చింది.
‘నువ్వు తెచ్చావా? సీతాలు లేదా? అది ఉంటే ఇల్లు శుభ్రం చేయించాలనుకున్నాను. నాకు ఓపిక లేదు’ అంది లలిత నిస్సహాయంగా.
‘గాబరా పడకు. అంతా సర్దుకుంటుంది. టీకి నీళ్లు పడేశాను. నువ్వు నాతో కిందకు రా’ అంది రమ. మారుమాటాడకుండా ఆమె వెంట వెళ్లింది లలిత. ఆమె లేవబోతూ ఉంటే ‘పది నిమిషాలు కూర్చో. సీతాలు ఇంకా చెత్తాచెదారం తుడుస్తూ ఉంటుంది’ అంది లలితతో రమ. నిజమే. సీతాలు తన ఇంటిలో పేరుకుపోయిన దుమ్మును తుడుస్తుంది. కానీ తన మనసులో పేరుకుపోయిన బాధను ఎవరు తుడుస్తారు? అనుకుంది లలిత. లలిత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా కళకళలాడుతోంది. స్నానం చేయడానికి బాత్‌రూంలోకి వెళ్లింది. స్నానం చేసి బట్టలు మార్చుకొని మంచం ఎక్కింది. రమ మళ్లీ వచ్చింది. ‘లలితక్కా! బాగా అలసిపోయావ్. ఈ పూట మాతోపాటు భోజనం చెయ్యి’ అంది రమ.
వివేక్, రమ ఇద్దరే ఉంటున్నారు. ఆమె అత్తమామలు ఈ మధ్యనే చిన్న కొడుకు దగ్గరకు వెళ్లారు. వంట పూర్తి కాగానే లలితను పిలిచింది రమ.
రమ ముగ్గురికీ వడ్డించింది. లలిత కోసమని ఏవేవో చేసింది. అయినా లలితకేమీ తినబుద్ధి కాలేదు. బాధలో ఉంటే పంచభక్ష్య పరమాన్నాలు ముట్టుకోబుద్ధి కాదు. ‘అయ్యో! నీవేం తినలేదు’ నొచ్చుకుంటూ అంది రమ.
‘ఇప్పుడే వెళ్లి ఏం చేస్తావ్. పది నిమిషాలు కూర్చో’ అంది రమ. ఔను. అన్ని విషయాలూ చెప్పి మనసు తేలిక చేసుకోవాలి అనుకుంది లలిత. అయితే ఎక్కడ మొదలుపెట్టాలి? ఎక్కడ అంతం చెయ్యాలి? ఎవరూ పెదవి విప్పలేదు. లలిత అక్క రుక్మిణి చనిపోయిందన్న కబురు వస్తే ఆదరా బాదరా వెళ్లింది. రమ ఆ విషయాలు తెలుసుకోవాలనుకుంది. కాని ప్రశ్నించడం ఇష్టం లేదు. లలితక్క చెప్పకుండా ఉంటుందా? ఆమె మానసిక గాయాన్ని కెలకడం ఎందుకు అనుకున్నాడు వివేక్. లలితే వౌనాన్ని భరించలేకపోయింది. అక్కడ నలుగురు మనుషుల మధ్య ఇంత దిగులు లేదు. ఒంటరిగా ఆ దిగులును ఎలా భరించగలదు? ఆమెకు దుఃఖం పెల్లుబికి వచ్చింది. చిన్నగా ఏడ్వసాగింది.
‘అయిపోయిన దానికి ఎవరేం చేయగలరు? నువ్వు ఇప్పుడు ఏడ్చి మొత్తుకున్నా మీ అక్క తిరిగి రాదు. ఇలాంటప్పుడే గుండెను రాయి చేసుకోవాలి’ అంది రమ.
‘నేను బాధ పడుతున్నది అక్క చనిపోయిందని కాదు. ఆమె ఆయుష్షు తీరిపోయింది. తన దారి తను చూసుకుంది. ఎవరైనా అంతే’ అంది ఏడుస్తూనే లలిత.
‘మరి?’
‘స్వాతిని తలచుకుంటే నా దుఃఖం ఆగడం లేదు. అదింకా చిన్నపిల్ల’ అంది లలిత. రమకు ఏమీ పాలుపోలేదు. దుఃఖాన్ని దిగమింగుకోమని ఎన్నిసార్లు చెప్పగలదు?
‘మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అసలే ముసలితనం. పైగా చెట్టంత కూతురు మరణించింది’ అంది రమ.
‘ఆమె బాగానే ఉంది. అన్నిటినీ తట్టుకునే శక్తి ఆమెకు భగవంతుడిచ్చాడు. లేకపోతే ఈ వయసులో ఎక్కడెక్కడి జబ్బులో గూడు కట్టుకుంటాయి. అక్క చనిపోయిందన్న బాధ ఉందో లేదో నా పెళ్లికి తొందర పడుతోంది’
‘ఔను. చనిపోయిన వారితో అందరూ పోలేరుగా. లలితగారూ! ఆమె వయసు మళ్లిపోయింది. మీ పెళ్లి కళ్లారా చూడాలన్న ఆరాటం ఉండటం సహజమే’ అన్నాడు వివేక్.
‘అదేం మాట. కూతురు చనిపోయిందన్న బాధ ఆమెకెందుకుండదు? మీ అన్నయ్యా వదినలు..’ అంది రమ.
‘ఎవరి ప్రపంచం వారిది. వాళ్లకేం, మూడు పువ్వులూ ఆరుకాయల్లా ఉన్నారు. ఒక మగపిల్లాడు, ఒక ఆడపిల్ల. మొగుడు పెళ్లాలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు’ అంది లలిత.
అది అసూయా? అందరి ఆడవాళ్లలాగే ఈమె వదిన ఉద్యోగం చేస్తోంది. తనూ ఉద్యోగం చేస్తున్నదే. లలితకు తన వదిన ఉద్యోగం చేయడం ఇష్టం లేదా? వివేక్‌కు ఏమీ అర్థం కాలేదు.
‘రమా! ఈ ప్రపంచం దయలేనిది. అక్క దినవారాలు పూర్తి కానేలేదు. అందరికీ నా పెళ్లి మాట కావలసి వచ్చింది. స్వాతి కోసమైనా నువ్వు బావను పెళ్లి చేసుకోవాలి అంటున్నారు’ అంది ఏడుస్తూ.
‘ఎవరా మాట అన్నారు?’ అడిగింది రమ.

‘ముందుగా రుక్మిణి అత్తగారంది. మా వాడికేం పెద్ద వయసు కాదు. ఎలాగూ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ భార్యవు నీవే ఎందుకు కారాదు? స్వాతి నీ అక్క కూతురు. నీ పెంపకంలో దానికే చీకూ చింతా ఉండదు’ అందామె. ఆవిడ భర్త తందాన తాన అన్నాడు’
వివేక్ బయటకు వెళ్లడానికి తొందర పడుతున్నాడు. అది గమనించి లలిత తన పోర్షన్‌లోకి వెళ్లిపోయింది. ఇంటి నిండా వెలుతురు. ఇల్లు చూడబోతే భూతంలాగుంది. ఇన్నాళ్లూ నలుగురి మధ్య గడిపింది. రోజల్లా ఏదో సందడి. పైగా స్వాతి ఆమె చంక దిగేది కాదు. రాత్రులు ఆమె పక్కనే పడుకునేది. ఇప్పుడు ఒంటరితనం. మంచం మీద వాలిందే కాని నిద్ర రానంది. స్వాతి మాటిమాటికీ గుర్తుకు వస్తోంది. రమ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయి. వివేక్ ఇంకా ఇంటికి వచ్చి ఉండడు. టైం చూసింది. తొమ్మిది కావస్తోంది. కొంతసేపు ఆమెతో కాలక్షేపం చేస్తే ఈ దిగులు తగ్గుతుందేమో? రమకు మించిన ఆప్తురాలు ఇక్కడ వేరెవరూ లేరు. కొన్ని విషయాలు ఆమెకు చెప్పాలి. అప్పుడే తన మనసు తేలిక పడుతుంది.
వెంటనే లేచి మేడ దిగి తలుపు తట్టింది.
రమ తలుపు తీసి ఎదురుగా ఉన్న లలితను చూసి ఆశ్చర్యపోయింది.
‘నువ్వా లలితక్కా! మా ఆయనే తొందరగా వచ్చి ఉంటారనుకొంటున్నా. నిద్రపోలేదా? ఏమైనా కావాలా?’ అంది రమ.
‘రమా! ఏమీ అక్కర్లేదు. నిద్ర రావడం లేదు’ అంది లలిత.
‘మీ అక్క చచ్చిపోయిందన్న దిగులుతో నీకు నిద్ర రావడం లేదు. ఎంత గాయమైనా కాలం మాన్పుతుంది. నాలుగైదు రోజుల్లో నువ్వు రొటీన్‌లో పడతావు’ అంది రమ.
‘అక్క చచ్చిపోయిందన్న దిగులు ఉందనుకో. అంతకు మించి వేరొక దిగులు పట్టుకుంది. ఏం చెయ్యాలో తోచడంలేదు’ అంది లలిత.
‘సరిగ్గా చెప్పు. నేనేం ఊహించలేను’ అంది రమ.
‘నా బాధ ఇతరులతో పంచుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. కాని అక్కడ ఆ వాతావరణం బొత్తిగా లేదు’ లలిత మళ్లీ ఏడ్చింది. రమ లేచి వెళ్లి ఆమె కళ్లు తుడిచింది.
‘మరీ చిన్నపిల్లలా ఏడుపు ఏమిటి? రోజుకి ఎన్ని చావుల గురించి వినడం లేదు. మృత్యువుకి ఎవరి వయసుతో పనిలేదు. ఎవరి కష్టసుఖాలు ఆ కాలుడికి పట్టవు. నీ బాధ ఏమిటో చెప్పు. నేను నీకేమైనా సహాయం చేయగలనేమో!’ అంది రమ.
‘... ....’
‘లలితక్కా! నాదొక సలహా. మరో వారం పది రోజులు సెలవు పొడిగించి ఇంటికి వెళ్లు. అక్కడ నలుగురూ ఉంటారు. ఒంటరితనం ఉండదు’
‘చంపేవ్. ఈ వారం పది రోజుల బాధే నన్ను తినేస్తోంది. ఇంకా వారి మధ్యకు వెళ్తే నన్ను కాల్చుకు తింటారు’
‘అందరూ కులాసాగా ఉన్నారంటున్నావ్. మరి నీ ఒక్కదానికే ఆ బాధ ఎందుకు?’
‘అసలు విషయం అది కాదు. నేను మా బావను పెళ్లి చేసుకోవాలిట’
‘మీ రుక్మిణి అక్క అత్తగారా మాట అన్నారన్నావు. మీ అమ్మా వాళ్లూ అంటున్నారా?’
‘ఔను. మీ బావ వయస్సనగా ఎంత? అతను పెళ్లాం పోయిందని మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? మగాడు ముక్కు మూసుకొని తపస్సు చేస్తాడా? పట్టుబట్టలు కట్టుకొని పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. ఆ సవతి తల్లి స్వాతిని కన్నకూతురిలా చూస్తుందా? నువ్వు అయితే దాన్ని ప్రాణంలా కాపాడుతావు. నువ్వు మాత్రం ఎంతకాలం పెళ్లీ పెడాకులు లేకుండా ఉంటావు?’ అంటుంది మా అమ్మ. అన్నయ్య వదినలు ఆమె పక్షమే’
‘మీ బావ ఏమంటాడు?’
‘నేను మళ్లీ పెళ్లి చేసుకోను అని అతను తన నోటితో అనలేదు. నన్ను పెళ్లాడటం అతనికి ఇష్టమే అనుకుంటున్నాను’ అంది లలిత.
‘లలితక్కా! ఒక్క మాట చెప్పు. స్వాతిని నువ్వు గాఢంగా ప్రేమిస్తున్నావు. మీ బావను చేసుకుంటే స్వాతి చింత నీకుండదు కదా?’
‘రమా! నీదీ అదే మాటా? నేను మా బావను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు. అతనంటే నాకు వల్లమాలిన ప్రేమ. ప్రేమ అంటే అభిమానం. మా అక్క భర్తగా నేనతడ్ని అభిమానిస్తున్నాను. కానీ అక్క నడయాడిన ఇంటిలో ఆమె స్థానంలో నేను గడపలేను’ అంది లలిత.
‘లలితక్కా! నువ్వు మానసికంగా గాయపడ్డావు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కొంతకాలం ఆగు. తొందర లేదు’ అంది రమ.
ఇదొక చిక్కు సమస్య. దీనికి సమాధానం లేదని కాదు. మన సమాజ వ్యవస్థలో ఇది ఒక పెద్ద లోపం కాకపోయినా మగాడు భార్య చనిపోయిన ఏడాదికల్లా మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. అది తప్పు అని ఎవరూ హెచ్చరించరు. పైగా ప్రోత్సహిస్తారు. కాని ఆడది అలాంటి సాహసం చేయలేదు. ఒకవేళ వనంలో భర్త చనిపోతే వరో పెళ్లి చేసుకున్న స్ర్తిని చులకనగా చూస్తుంది లోకం. స్ర్తి తమ కామనా కోరికలను అణచుకుని పిల్లల పెంపకంలోనే ఒంటరి జీవితం గడుపుతుంది. లలితక్కకు వారిచ్చిన సలహాలో తప్పేముంది. వివాహం చేసుకోని స్ర్తి జీవితం మోడువారిన జీవితం. రెండో పెళ్లివాడు అని తప్పితే అతనిలో ఏ లోపాలున్నాయి. లలితక్క మనసు మార్చుకోవాలి అనుకుంది రమ.
‘అక్కా! ఈనాడీ సమస్య తలెత్తకుండా ఉంటే ఆరేడు నెలల తరువాత బహుశా నేను ఇదే సలహా ఇచ్చేదానే్నమో! అయినా ఎంతకాలం నువ్వు ఒంటరిగా ఉంటావు? స్వాతి కోసమైనా నువ్వు నీ బావను చేసుకోవడం మంచిదేమో?’ అంది రమ.
రమవైపు విస్మయంగా చూసింది లలిత. ‘రమా! నీకూ అలాంటి ఆలోచనే ఉందంటే నాకు విస్మయంగా ఉంది. నా కథ నీకెప్పుడూ చెప్పలేదా?’ అంది లలిత.
‘ఔను! నీ మధురమైన ప్రేమ గురించి చెప్పావు. లలితక్కా! భావనా ప్రపంచంలో జీవించకు. ఇది జీవితం. కాల్పనిక కథ కాదు. ఎలా కావాలంటే అలా మలిచివేయడానికి. మనం ఉప్పు పులుసు తినే మనుషులం. ఏ వయసుకా వయసు కోరికలుండటం ప్రకృతి ధర్మం. వాటిని బలవంతంగా అణచివేయాలనుకోవడం పొరపాటు’ అంది లలిత.
‘నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు’
‘అక్కా! నువ్వు నాకంటే పెద్దదానివి. నీకు చెప్పేటంతటి దాన్ని కాను. అయితే ఒకటి చెప్పాలి. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం లేదు. కొన్ని సంఘటనలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. కొన్నింటికి సంతోషిస్తాం. కొన్నింటికి దుఃఖిస్తాం. ఆ సుఖమైనా దుఃఖమైనా తాత్కాలికమైనవే. ఆ తరువాత పరిస్థితులతో రాజీ పడాలి’
‘... ...’
‘అక్కా! నువ్వు ఉద్యోగంలో చేరిన కొంతకాలానికి నీకొక మన్మథుడు తారసపడ్డాడు. మొదటి చూపులోనే మీరిద్దరూ మనసిచ్చుకున్నారు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను అని అతనంటే నువ్వూ డిటో అంటూ ప్రేమ ఉద్యానవనాల్లో యుగళ గీతాలు ఆలపించారు. ఇదే సినిమా కథ అయితే ఒక విలను, అతను ఆ మన్మథుడి తండ్రి కావచ్చు లేదా మీ అన్న కావచ్చు. ఈ వివాహం జరిగేది కాదు అని అడ్డుపడి ఉండేవారు. మీ అదృష్టం బాగుండి కథ సుఖాంతం వైపు మరలింది. ఇరుపక్షాలు అంగీకరించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. మీ కలలు పండే రోజు ఆసన్నమైంది. అయితే ఇక్కడొక విలన్ ప్రత్యక్షమయ్యాడు. అతడు సాక్షాత్తూ మృత్యుదేవత. నీ కాబోయే భర్త ప్రాణాలను రోడ్డు ప్రమాదం అనే నెపంతో అపహరించాడు. నిజమే! నువ్వు బాధపడ్డావు. విలపించావు. అయితే నేను అతడినే మనసారా ప్రేమించాను. పెళ్లి చేసుకోను అని భీష్మించుకోవడం శుద్ధ అవివేకం. అక్కా! ఒకవేళ ఆ చావు నీకే సంభవిస్తే నీ మన్మథుడు వేరొకరిని చేసుకోడా? ఆలోచించు. నీకు మీ బావను చేసుకోవడం ఇష్టం లేకపోతే వేరొకరిని చేసుకో. పెళ్లి చేసుకోక పోవడం ఆడపిల్లకు శోభనివ్వదు’ అంది రమ.
‘అయితే నేను ఉచ్చులో ఇరుక్కోవాలా?’
‘మంచి ప్రశ్న వేశావు. ఆ మన్మథుడిని పెళ్లి చేసుకుని ఉంటే అది ఉచ్చు కాదా? అక్కా! మేమూ నీసాటి ఆడవాళ్లమే. మేం ఉచ్చులో పడ్డామా? మీ అమ్మ పెళ్లి చేసుకోలేదా, మీ అక్క చేసుకోలేదా, మీ అన్న ఒక ఆడపిల్లనే చేసుకున్నాడే’
లలిత ఆ మాటలంటూ ఉంటే వివేక్ వచ్చాడు.
‘లలితగారూ! ఆడవాళ్లు ఎప్పుడూ ఉచ్చులో పడరు. మగాళ్లే పెళ్లి చేసుకుని ఉచ్చులో పడుతున్నారు. రమా! నీకు బుద్ధి లేదు. ఆమెకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ప్రేమ ఎంతో మధురమైంది అంటూ చెవిలో జోరీగలా ఎందుకు అరుస్తావు?’ అన్నాడు భార్యతో.
‘మీ ఆయన వచ్చాడు. నేను వస్తాను’ అంటూ లేచింది లలిత.
లలిత వెళ్లిపోయిన తరువాత రమ తన భర్తతో అంది ‘ఏమండీ! స్వాతి కోసమైనా ఆమె బావను పెళ్లాడుతుంది. నాకా నమ్మకం ఉంది’ అని.
* * *
కొంతసేపు తీక్షణంగా ఆలోచించిన తరువాత లలిత ఒక నిర్ణయానికి వచ్చింది. వెంటనే పెన్నూ పేపరు తీసుకుని బావకు ఉత్తరం రాసింది.
‘బావగారూ!
నమస్కారములు. మీ అమ్మానాన్నలతో సహా అందరూ నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. స్వాతి కోసమైనా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అంటున్నారు. నాకు పెళ్లి మీద విరక్తి. నేను పెళ్లి చేసుకోరాదని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. కాబట్టి మీరు నా మీద ఆశ పెట్టుకోక వేరెవరినైనా పెళ్లి చేసుకోండి. అయితే నాదొక ప్రార్థన. స్వాతిని నేను పెంచుకుంటాను. దాని తల్లిగా బాధ్యత స్వీకరిస్తాను. కాబట్టి స్వాతిని నాకు అప్పగించండి.
- లలిత
అదే విషయం వేరొక ఉత్తరంలో తల్లికి రాసింది లలిత. ఆమెకు చెప్పలేనంత ఆనందం కలిగింది. వెంటనే నిద్రలోకి జారుకుంది.
* * *
వారం రోజుల తరువాత లలిత పుట్టింటికి వెళ్లి నాలుగవనాడు తన తల్లిని, స్వాతిని తీసుకువచ్చింది.
‘రమా! ఇక మీదట స్వాతి నాతోనే ఉంటుంది. అది నా కూతురు’ అంది ఆనందంగా.
రమ చకితురాలైంది. ఆహా! ప్రేమ ఎంత మధురమైనది. ప్రేమయే దైవ స్వరూపం. ఆ దృష్టితో ప్రేమను గ్రహించినట్లయితే అంతా ఆనందమే, ప్రశాంతమే. భగవంతుడు జగతిపై కురిపించే ప్రేమకు కరుణ అని పేరు. మనం దైవంపై చూపే ప్రేమకు భక్తి అని పేరు. తల్లి బిడ్డపై కనబరిచే ప్రేమకు వాత్సల్యం అని పేరు. ఏ ప్రేమ అయినా మధురమైనదే!
‘దీని పట్టుదల ముందు మేం అందరం ఓడిపోయాం’ అంది లలిత తల్లి.
‘శభాష్ అక్కా! నవ మాసాలు మోయకుండానే తల్లివయ్యావు’ అభినందింది రమ.

గుమ్మా నిత్య కళ్యాణమ్మ
ఎల్‌ఐజి 269, హడ్కో
ఆదీనగర్,
భిలాయ్ వెస్ట్ -490 009
09755110398
*

- గుమ్మా నిత్య కళ్యాణమ్మ