క్రీడాభూమి

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 15: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకున్న భారత అత్యుత్తమ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నాలుగేళ్ల తర్వాత టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించమే లక్ష్యంగా శ్రమిస్తానని అన్నది. ఆదివారం జరిగిన మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో దీప కేవలం 0.15 పాయింట్ తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకొని, నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఫలితం తనను ఎంతమాత్రం బాధించలేదని, తాను నిరాశ చెందలేదని సోమవారం పిటిఐతో మాట్లాడుతూ దీప స్పష్టం చేసింది. భారత్ తరఫున ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన దీప రియోలో శక్తివంచన లేకుండా శ్రమించింది. క్వాలిఫయింగ్ రౌండ్స్‌లో అద్భుత ప్రతిభ కనబరచి ఫైనల్స్ చేరింది. అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ 15.966 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, రష్యాకు చెందిన మరియా పసెకా 15.253 పాయింట్లతో రజత పతకాన్ని అందుకుంది. గలియా స్టీన్‌గ్రబర్ (స్విట్జర్లాండ్) 15.216 పాయింట్లు సంపాదించి కాంస్య పతకాన్ని సాధించింది. దీప 15.066 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రెండో ప్రయత్నంలో ల్యాండింగ్ సక్రమంగా లేకపోవడం వల్లే ఆమె ఒలింపిక్ పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీప పతకాన్ని గెలవలేకపోయినా, లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకోగలిగింది. చివరి వరకూ జరిపిన పోరాటం ఆమెను భారతీయుల దృష్టిలో అత్యుత్తమ జిమ్నాస్ట్‌గా నిలబెట్టాయి. బాక్సింగ్, రెజ్లింగ్‌లో నాలుగో స్థానంలో ఉన్న వారికి కూడా కాంస్య పతకం దక్కుతుందని, కానీ, ఆ అవకాశం జిమ్నాస్టిక్స్‌లో లేదని పతకం కోసం విశేషంగా కృషి చేసిన ఆమె వ్యాఖ్యానించింది. నిజానికి ఒలింపిక్స్‌లో పతకాన్ని తాను ఎన్నడూ ఊహించలేదని, కాబట్టి, రియోలో ఫలితం తనను పెద్దగా బాధించలేదని చెప్పింది. తాను నేర్చుకున్న, ప్రాక్టీస్ చేసిన ప్రతి అంశాన్ని రెండు వాల్ట్స్‌లోనూ ప్రదర్శించడానికి కృషి చేశానని తెలిపింది. ఐదు లేదా ఆరో స్థానం కంటే నాలుగో స్థానం మెరుగైనదని అన్నది. కెరీర్‌లో తనకు ఇదే మొట్టమొదటి ఒలింపిక్స్ అని గుర్తు చేసింది. నాలుగేళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్ వస్తాయని, అప్పుడు స్వర్ణ పతకమే లక్ష్యంగా పోరాడతానని తెలిపింది. ఇలావుంటే, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 11 మంది పురుషులు మాత్రమే జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1952లో ఇద్దరు, 1956లో ముగ్గురు, 1964లో ఆరుగురు జిమ్నాస్ట్‌లు బరిలోకి దిగినప్పటికీ, ఎవరూ ఫైనల్స్ వరకూ చేరలేదు. దీప ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. మన దేశం నుంచి ఫైనల్ చేరిన తొలి జిమ్నాస్ట్‌గా కూడా ఆమె పేరు రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించింది. త్రిపుర నుంచి ఈ యువ జిమ్నాస్ట్ నాలుగేళ్లలో మరింత రాటుతేలి, టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశం లేకపోలేదు. రియో ఒలింపిక్స్‌లో ఆమె పతకం సాధించలేక ఓడింది. కానీ, చివరి వరకూ పోరాడి, కోట్లాది మంది అభిమానాన్ని గెల్చుకుంది.

chitram.. జిమ్నాస్టిక్స్ వాల్ట్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన దీప