క్రీడాభూమి

వంద మీటర్ల పరుగులో.. ‘వందే’మాతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాంకోవర్ (బ్రిటిష్ కొలంబియా), ఆగస్టు 30: కెనడాలో జరిగిన అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన వందేళ్ల ‘చిన్నారి’ మన్ కౌర్ సత్తా చాటింది. 100 మీటర్ల పరుగును ఆమె దాదాపు ఒకటిన్నర నిమిషం వ్యవధిలో పూర్తిచేసి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. వృద్థ అథ్లెట్లకు నిర్వహించిన ఈ పోటీల్లో వందేళ్ల వయసు దాటిన వారి విభాగంలో మన్ కౌర్ ఒక్కరే బరిలోకి దిగారు. దీంతో ఆమె విజేతగా నిలిచి శారీరక ఉల్లాసానికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించింది. సోమవారం వాంకోవర్‌లో జరిగిన ఈ పరుగు పోటీలో మన్ కౌర్ లక్ష్యాన్ని అధిగమించగానే అక్కడున్న ఇతర పోటీదారులంతా కేరింతలతో ఆమెను అభినందించారు. వీరంతా 70 నుంచి 80 వసంతాలు పైబడినవారే. శత వసంతాలు నిండినప్పటికీ ఈ పోటీలో కౌర్ ఎంతో ఉత్సాహాన్ని, శక్తిని ప్రదర్శించడం ఆ ఈవెంట్‌లో పాల్గొన్న ఇతర అథ్లెట్లందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చింది. క్రీడా పోటీల్లో మన్ కౌర్ విజయం సాధించినప్పుడల్లా ఆమె భారత్‌కు తిరిగివెళ్లి తన విజయాల గురించి అందరికీ ఎంతో సగర్వంగా చెబుతుందని, కెనడాలో ఎన్నో పతకాలను కైవసం చేసుకున్నానని ఆమె మురిసిపోతూ ఉంటుందని, విజయాలే ఆమె సంతోషానికి కారణమని కౌర్ కుమారుడు గురుదేవ్ సింగ్ (78) వివరించారు. నిమిషం 21 సెకన్ల వ్యవధిలో ఈ పరుగును పూర్తి చేసిన మన్ కౌర్ ఆ తర్వాత చిరునవ్వుతో చేతులు గాలిలో ఊపుతూ తన విజయోత్సాహాన్ని ప్రదర్శించారు.
విశిష్టమైన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన్ కౌర్ విజయం సాధించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆమె జావెలిన్ త్రో, షాట్‌పుట్ పోటీల్లో పసిడి పతకాలను కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మాస్టర్స్ గేమ్స్‌లో 20కి పైగా పతకాలను సాధించారు. 93వ ఏట నుంచి పరుగును అలవర్చుకున్న మన్ కౌర్ ఎంత వయసు మీద పడినప్పటికీ క్రీడలకు ఎప్పుడూ దూరం కాలేదని, తన స్వస్థలమైన చండీగఢ్‌లో ప్రతి రోజూ సాయంత్రం కొద్దిసేపు పరిగెడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారని, అందుకే ఆమెను పోటీల్లో పాల్గొనాల్సిందిగా ప్రోత్సహించానని గురుదేవ్ సింగ్ తెలిపారు. చెడు తిండికి దూరంగా ఉండి రోజూ కొద్దిసేపైనా పరిగెత్తేలా అందరినీ, ప్రత్యేకించి వృద్ధ మహిళలను ప్రోత్సహించాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, అద్భుతమైన క్రీడా స్ఫూర్తితో మన్ కౌర్ యువతరం మొదలు కొని వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారని మాస్టర్స్ గేమ్స్ ప్రచారకర్త చర్మైన్ క్రూక్స్ కొనియాడారు. ఐదుసార్లు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న క్రూక్స్ 1984లో కెనడాకు మహిళల 400 మీటర్ల రిలే పరుగు పోటీలో పసిడి పతకాన్ని అందించారు. ‘శతాధిక వయసులో మన్ కౌర్ సాధించిన విజయం నాతో పాటు అందరికీ ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. ఈ ఉత్సాహంతో నేను కనీసం మరో 50 ఏళ్లైనా బతుకుతాననిపిస్తోంది’ అని క్రూక్స్ పేర్కొన్నారు. వరల్డ్ మాస్టర్స్ గేమ్స్ ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతాయి. ఈ నాలుగేళ్ల మధ్య ప్రాంతీయ స్థాయిలో ఈ క్రీడలను నిర్వహిస్తారు. ప్రస్తుతం వాంకోవర్‌లో జరుగుతున్నవి ఉత్తర అమెరికాలో మొదటి సమ్మర్ రీజినల్ గేమ్స్. ఈ క్రీడల్లో పాల్గొంటున్న అథ్లెట్ల సగటు వయసు 49 సంవత్సరాలు. అయితే మన్ కౌర్ కంటే ఎక్కువ వయసున్న బ్రిటిష్ కొలంబియా వాసి నిహాల్ గిల్ (101) కూడా ఈ పోటీల్లో అందరినీ ఎంతగానో ఆకర్షించారు.