క్రీడాభూమి

సిరీస్‌పై ధోనీ గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 25: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో భాగంగా జరుగనున్న నాలుగో మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్వస్థలమైన రాంచీ ఆతిథ్యమివ్వనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అద్భుతమైన కెరీర్‌లో ప్రస్తుతం మరోసారి తనను తాను ఆవిష్కరించుకుంటున్న ధోనీ ఈ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించి భారత్‌కు సిరీస్‌ను అందించడమే లక్ష్యంగా జట్టును ముందుకు నడపనున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని మేటి వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్లలో అగ్రగణ్యుడిగానే కాకుండా మైదానం లోపల, వెలుపల ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎంతో ప్రశాంతంగా వాటిని ఎదుర్కొంటూ అవకాశాలను అందిపుచ్చుకునే ‘కెప్టెన్ కూల్’గా కూడా పేరు పొందిన ధోనీ మొహాలీలో జరిగిన మూడో వనే్డలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీతో కలసి టీమిండియాకు 2-1 ఆధిక్యతను అందించిన విషయం విదితమే. ఈ మ్యాచ్‌లో 91 బంతులను ఎదుర్కొని 80 పరుగులు సాధించిన ధోనీ అంతర్జాతీయ వనే్డల్లో 9 వేల పరుగుల మైలురాయిని అధిగమించడంతో పాటు ప్రపంచంలో 50 కంటే ఎక్కువ పరుగుల సగటుతో 9 వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ‘జార్ఖండ్ ముద్దు బిడ్డ’గా పేరు పొంది ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే టీమిండియాకు సారథ్యం వహిస్తున్న ధోనీ తన సొంత మైదానమైన జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం కాంప్లెక్స్ మైదానంలోకి దిగనుండటం బుధవారమే చివరు కావచ్చు. ఇప్పటివరకూ మూడు అంతర్జాతీయ వనే్డలు, మరో ట్వంటీ-20 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన ఈ స్టేడియంలో వర్షం వలన రద్దయిన ఒక వనే్డ మ్యాచ్‌లో మినహా మిగిలిన అన్ని మ్యాచ్‌లలో భారత జట్టునే విజయాలు వరించాయి.
మరోవైపు ఇంతకుముందు రాంచీలో ఆడిన రెండు మ్యాచ్‌లలో ధోనీ సహచరుడు విరాట్ కోహ్లీ కూడా వరుసగా 77 (నాటౌట్), 139 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించి చక్కటి రికార్డును కలిగి ఉండటం భారత జట్టుకు ఎంతో కలిసొచ్చే విషయం. ఆధునిక క్రికెట్ యుగంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మన్లలో ఒకడిగా పరిగణిస్తున్న కోహ్లీ మొహాలీ వనే్డలో ఇచ్చిన క్యాచ్‌ని న్యూజిలాండ్ ఫీల్డర్ జారవిడవడంతో తాను ఎంతటి ప్రమాదకారుడో రుజువు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 134 బంతులను ఎదుర్కొని 154 పరుగుల అజేయ స్కోరు సాధించడంతో న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 10 బంతులు మిగిలి ఉండగానే అధిగమించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగలిగింది. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్‌కు మాదిరిగా 27 ఏళ్ల కోహ్లీకి వనే్డల్లో ఇది 26వ సెంచరీ కాగా, ఛేజింగ్‌లలో 14 శతకం.
దీంతో బుధవారం జరుగనున్న మ్యాచ్‌లో మరోసారి పరుగుల వరద పారించకుండా కోహ్లీని కట్టడి చేయడం పైనే న్యూజిలాండ్ ఆటగాళ్లు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. అయితే కెప్టెన్ ధోనీలో మళ్లీ ఆత్మవిశ్వాసం పెరిగిందన్న విషయంతో పాటు కోహ్లీలో పరుగుల దాహం ఏమాత్రం తీరలేదనడానికి మొహాలీ వనే్డలో మూడో వికెట్‌కు నమోదైన 151 పరుగుల నిర్ణయాత్మక భాగస్వామ్యమే నిదర్శనం. టీమిండియాతో వనే్డ సిరీస్‌కు ముందు మూడు టెస్టుల సిరీస్‌లో ‘వైట్‌వాష్’ వేయించుకున్న కివీస్‌కు ధోనీ మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోవడం నిస్సందేహంగా ప్రమాద సూచికమే. మరోవైపు ఎడతెరిపిలేని హోమ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని టెస్టు జట్టు ప్రీమియర్ బౌలర్లయిన రవిచంద్రన్ అశ్విన్, మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు వనే్డ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించినప్పటికీ ఇటు బౌలింగ్ విభాగంలోనూ భారత జట్టు చక్కగా రాణిస్తుండటం విశేషం. ముఖ్యంగా ఒవర్‌కు 8 కంటే తక్కువ పరుగులిచ్చి 6 వికెట్లు కైవసం చేసుకున్న పార్ట్‌టైమ్ ఆఫ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ వనే్డ సిరీస్‌లో అత్యధిక వికెట్లు రాబట్టిన బౌలర్ల జాబితాలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా తర్వాత రెండో స్థానంలో నిలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఫిట్నెస్ సమస్యల నుంచి సురేష్ రైనా బయటపడలేకపోవడంతో టీమిండియాలో చోటు దక్కించుకున్న కేదార్ జాదవ్ ఆ అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకుంటున్నాడు. న్యూఢిల్లీలోని కోట్లా మైదానంలో జరిగిగన వనే్డలో 37 బంతులను ఎదుర్కొని 41 పరుగులు సాధించిన కేదార్ జాదవ్ వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి ముందే కెప్టెన్ ధోనీని ఆకట్టుకోగలిగాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా తొలి అంతర్జాతీయ వనే్డ సిరీస్‌లోనే అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ రాణిస్తుండటం టీమిండియాకు సంతోషకరమైన విషయం. ధర్మశాలలో తొలిసారి వనే్డ బరిలోకి దిగన పాండ్యా కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో 31 పరుగులకే 3 వికెట్లు కైవసం చేసుకుని భారత జట్టు విజయంలో తనదైన పాత్ర పోషించగా, న్యూఢిల్లీలో జరిగిన వనే్డలో విషమ పరిస్థితుల నడుమ 32 బంతుల్లో 36 పరుగులు సాధించి అందరినీ అలరించాడు. అయితే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే ఇప్పటివరకూ తమ స్థాయికి తగ్గట్టు విజృంభించి సరైన భాగస్వామ్యాన్ని అందించలేకపోవడం భారత జట్టుకు ఆవేదన కలిగిస్తోంది.
ఇక ఈ సిరీస్‌పై అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే బుధవారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌కు విజయం తప్పనిసరి. ఇది జరగాలంటే ఆ జట్టు బ్యాట్స్‌మన్లంతా సమష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే టామ్ లాథమ్, కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ మినహా న్యూజిలాండ్ జట్టులో మిగిలిన బ్యాట్స్‌మన్లు ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మార్టిన్ గుప్టిల్, రాస్ టేలర్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శనతో సరిగా రాణించలేకపోతుండటం న్యూజిలాండ్ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది.