క్రీడాభూమి

సెమీస్‌కు శ్రీజేష్ డౌటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 28: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ చాంపియన్‌షిప్ సెమీ ఫైనల్‌లో భారత కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ ఆడడం అనుమానంగానే ఉంది. శనివారం దక్షిణ కొరియాతో జరిగే ఈ మ్యాచ్‌లో అతను ఆడేదీ లేనిదీ ఇంకా ఖరారు కాలేదు. కాలి మడమ గాయంతో బాధపడుతున్న శ్రీజేష్ పూర్తిగా కోలుకున్నాడా లేదా అన్న విషయంపై జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టత ఇవ్వలేదు. దీనికితోడు డిఫెండర్ సురేందర్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడడం భారత్ దూకుడుకు కళ్లెం వేస్తున్నది. 2011లో మొదటిసారి ఈ టోర్నమెంట్ జరిగినప్పుడు విజేతగా నిలిచిన భారత్ మరోసారి టైటిల్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నది. కొరియాతో లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌ని 1-1గా డ్రా చేసుకున్న ఈ జట్టు సెమీస్‌లో అదే జట్టును ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డక తప్పదు. పటిష్టమైన జట్లలో కొరియా ఒకటని, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని భారత చీఫ్ కోచ్ రోలాంట్ ఆల్ట్‌మన్స్ స్పష్టం చేశాడు. శుక్రవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ రక్షణ విభాగమే కొరియా బలమని చెప్పాడు. ఈ రక్షణ వలయాన్ని ఎంత బాగా ఛేదిస్తామన్న విషయంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అన్నాడు. శ్రీజేష్ గాయం గురించి విలేఖరులు ప్రస్తావించగా, తన అంచనా ప్రకారం అతను సెమీ ఫైనల్‌లో ఆడతాడని ఆల్ట్‌మన్స్ ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ శ్రీజేష్ బరిలోకి దిగలేకపోతే, రిజర్వ్‌డ్ గోల్‌కీపర్ ఆకాష్ చిక్తేను ఆడిస్తామని అన్నాడు. ఆకాష్‌ను సమర్థుడైన గోల్‌కీపర్‌గా అతను అభివర్ణించాడు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి మానసికంగా తాము సిద్ధమయ్యామన్నాడు. అయితే, మలేసియాతో చివరి లీగ్ మ్యాచ్‌ని కొరియా డ్రా చేసుకోవడంతో, పాక్‌తో సెమీస్ ఆడాల్సిన అవసరం రాలేదన్నాడు. ఫైనల్ చేరడమే లక్ష్యమని చెప్పాడు.