క్రీడాభూమి

ఇంగ్లాండ్‌తో సిరీస్ మా బాధ్యత కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 3: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను కొనసాగించాలా వద్దా అనే విషయంగానీ, ఆ బాధ్యతగానీ తమ పరిధిలోకి రాదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ స్పష్టం చేసింది. సిరీస్‌లతో తమకు ఎలాంటి సంబంధం లేదని, వివిధ సభ్య సంఘాలకు చేస్తున్న చెల్లింపుల వివరాలను మాత్రం తప్పనిసరిగా తెలపాల్సిందేనని ఆదేశించింది. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సన్నాహాలు చేస్తున్నామని, కాబట్టి, చెల్లింపులు ఏ ప్రాతిపదికన చేయాలో వివరించాలని కోరుతూ లోధా కమిటీకి బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే లేఖ రాశాడు. దీనిపై స్పందిస్తూ కమిటీ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లను తమ ఆదేశాలకు, సూచనలకు ముడిపెట్టడం సరికాదని వ్యాఖ్యానించింది. తాము చెల్లింపులు చేయలేని పరిస్థితిలో ఉన్నామని, కాబట్టి ఆటగాళ్ల ఖర్చులను సొంతంగా భరించుకోవాల్సిందిగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)ని కోరుతామని షిర్కే తన లేఖలో విపరీత వ్యాఖ్యలు చేశాడు. చెల్లింపులపై గతంలో లోధా కమిటీ ఇచ్చిన మార్గదర్శకాలు, సూచనలు, జారీ చేసిన ఆదేశాలను సాకుగా చూపి, సిఫార్సులను అమలు చేయకుండా వాయిదా వేయడానికి బోర్డు ప్రయత్నిస్తున్నట్టు షిర్కే లేఖ స్పష్టం చేస్తున్నది. బిసిసిఐ తరఫున ఎలాంటి చెల్లింపులు జరపరాదని ఆ సంస్థకు ఖాతాలున్న బ్యాంకులకు లోధా కమిటీ ఇది వరకే లేఖ రాసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30న పాలక మండలి సమావేశాన్ని నిర్వహించి, కొన్ని సభ్య సంఘాలకు భారీ మొత్తాలను చెల్లించేందుకు బిసిసిఐ చేసిన తీర్మానాన్ని లోధా కమిటీ తప్పుపట్టింది. ఈ చెల్లింపుల తీర్మానం సుప్రీం కోర్టు ఆదేశాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తుది తీర్పును వెల్లడించేలోగా, సాధారణ పాలనను మినహాయించి, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని బిసిసిఐకి ఈ ఏడాది ఆగస్టు 31న లోధా కమిటీ సూచించింది. బ్యాంకులకు రాసిన లేఖలో అదే విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. నాలుగైదు సభ్య సంఘాలకు భారీ మొత్తాలను చెల్లించడం ఏ విధంగానూ సాధారణ పాలనా వ్యవహారాల్లో భాగం కాదని తేల్చిచెప్పింది. అంత హడావుడిగా సమావేశాన్ని నిర్వహించి తీర్మానాలను ఆమోదించాల్సిన అవసరం కూడా లేదని, అది అత్యవసరం కూడా కాదని తెలిపింది. దేశంలో క్రికెట్ ప్రక్షాళనకు తాము చేసిన సిఫార్సులను అమలు చేయడంలో బోర్డు నిర్లిప్త వైఖరిని అనుసరించడంపై అంతకు ముందే సుప్రీం కోర్టుకు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించింది. ఈ రిపోర్ట్‌లో లోధా కమిటీ ప్రస్తావించిన పలు అంశాలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. సిఫార్సులు అమలు చేయాల్సిందేనని అంటూ, వాటి అమలుపై స్పష్టమైన హామీనిచ్చి, అఫిడవిట్‌ను దాఖలు చేసే వరకూ సభ్య సంఘాలకు ఎలాంటి చెల్లింపులు చేయడానికి వీల్లేదని బోర్డును ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులను లోధా కమిటీ గుర్తుచేస్తూ, ఇంగ్లాండ్‌తో జరగాల్సిన సిరీస్ కొనసాగుతుందా? లేదా? అన్నది తమ బాధ్యతల్లో భాగం కాదని తేల్చిచెప్పింది. ఇంతకు ముందు పేర్కొన్న విధంగానే, సభ్య సంఘాలకు చేసే చెల్లింపుల వివరాలను తమకు అందించాల్సిందేనని బోర్డును ఆదేశించింది.
ఆడిటర్ నియామకంపై డెడ్‌లైన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌ల ప్రసార హక్కులను ఇవ్వడానికి అనుసరించే బిడ్డింగ్ వ్యవహారంతోపాటు స్వతంత్ర ప్రతిపత్తిగల ఆడిటర్‌ను నియమించే అంశాలపై పూర్తి సమాచారాన్ని ఈనెల 8వ తేదీలోగా అందించాలని బోర్డును లోధా కమిటీ ఆదేశించింది. తమ సిఫార్సులపై సుప్రీం కోర్టు వివిధ దశల్లో చేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది.
ప్రతి వ్యక్తి లేదా సంస్థతో చేసుకున్న లేదా చేసుకోబోయే ఒప్పందాల వివరాలను తెలపాలని బిసిసిఐకి లోధా కమిటీ స్పష్టం చేసింది. ఐపిఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు, అండార్స్‌మెంట్లు, ఇతర కాంట్రాక్టులు ఎంతకాలం అమల్లో ఉంటాయనే విషయాన్ని కూడా వెల్లడించాలని సూచించింది. ఇప్పటి వరకూ అనుసరిస్తూ వస్తున్న విధివిధానాలను వివరించాలని కోరింది. టెండర్‌కు ఖరారు చేసిన నిబంధనలతోపాటు, గతంలో తీసుకున్న నిర్ణయాలకు, తాజాగా ఓపెన్ బిడ్‌కు ఆహ్వానించడానికి మధ్య ఉన్న తేడాలను సైతం స్పష్టం చేయాలని ఆదేశించింది. అన్ని కాంట్రాక్టుల మొత్తం విలువ ఎంత ఉంటుందో చెప్పాలని పేర్కొంది. ఐదు రోజుల్లోగా సమగ్ర సమాచారం ఇవ్వాలంటూ డెడ్‌లైన్ విధించింది. ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు, వనే్డ, టి-20 సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చే కేంద్రాలున్న సంఘాలకు చెల్లింపులు జరగకుండా అడ్డుకుంటున్నదంటూ తప్పును లోధా కమిటీపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్న బిసిసిఐ అధికారులు ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తిని రేపుతున్నది. ఎనిమిదో తేదీలోగా బిసిసిఐ ఇవ్వబోయే సమాచారం ఏ విధంగా ఉంటుందో చూడాలి.

చిత్రం.. లోధా