క్రీడాభూమి

రూట్ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత్‌లో ఒక విదేశీ జట్టుకు చెందిన ఆటగాడు టెస్టు సెంచరీ చేసిన సంఘటన చివరిసారి 2013లో నమోదైంది. చెన్నైలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (130) శతకంతో రాణించాడు. ఆతర్వాత 12 టెస్టుల్లో ఏ ఒక్క విదేశీ క్రికెటర్ కూడా సెంచరీ చేయలేదు. పుష్కర కాలం అనంతరం జో రూట్ సెంచరీతో కదంతొక్కాడు. ఆసియాలో ఇంతకు ముందు అతని అత్యధిక స్కోరు 88 పరుగులు. 2015 అక్టోబర్‌లో దుబాయ్‌లో పాకిస్తాన్‌పై అతను ఈ స్కోరు చేశాడు. ఇప్పుడు అతను కెరీర్‌లో మొదటిసారి ఆసియాలో శతకం సాధించాడు.
* ఈ క్యాలెండర్ ఇయర్‌లో 1,000 టెస్టు పరుగుల మైలురాయిని అధిగమించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో జో రూట్ రెండోవాడు. జానీ బెయిర్‌స్టో ఇంతకు ముందు ఈ ఘనతను అందుకున్నాడు.

* కెరీర్‌లో 49వ టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ చిరస్మరణీయ శతకాన్ని నమోదు చేశాడు. నాలుగేళ్ల క్రితం అతను నాగపూర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తోనే టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో 11వ శతకాన్ని సాధించాడు. ఆసియా ఖండంలో అతనికి ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. భారత్‌పై అతనికి ఇది మూడో సెంచరీ. ఇంతకు ముందు, 2014లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటించినప్పుడు అతను ట్రెంట్ బ్రిడ్జి, ది ఓవల్ మైదానాల్లో శతకాలు సాధించాడు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియాపై అతను అత్యధికంగా మూడేసి సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లపై ఒక్కో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

తిరగబెట్టిన గాయం..
రాజ్‌కోట్: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కాలిగాయం తిరగబె ట్టింది. అతను తన 13వ ఓవర్‌లో మొదటి బంతిని వేయడానికి రనప్ తీసుకునేటప్పుడే తడబడ్డాడు. పరుగులో వేగం తగ్గించుకొని, అతి కష్టం మీద ఆ బంతిని వేసిన అతను కాలి కండరాలు బెణకడంతో మైదానంలోనే కూలబడ్డాడు. ఫిజియో థెరపిస్టు ప్రాథమిక చికిత్స అందించాల్సి వచ్చింది. అతను ఓ వర్‌ను కొనసాగించలేకపోవడంతో ఉమేష్ యాదవ్ ఆ ఓవర్‌ను పూర్తి చేశాడు.

రాజ్‌కోట్, నవంబర్ 9: జో రూట్ కెరీర్‌లో 11 శతకం నమోదు చేయగా, మోయిన్ అలీ 99 పరుగులతో అజేయంగా క్రీజ్‌లో నిలిచి ఆదుకోవడంతో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. భారత్‌తో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ నిర్ణయం పొరపాటేమోనన్న రీతిలో ఆ జట్టు బ్యాటింగ్ మొదలైంది. 47 బంతులు ఎదుర్కొని, 21 పరుగులు చేసిన కుక్ 47 పరుగుల స్కోరువద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. మరో 29 పరుగుల తర్వాత రెండో ఓపెనర్ హసీబ్ హమీద్ కూడా పెవిలియన్ చేరాడు. కెరీర్‌లో మొదటి టెస్టు ఆడుతున్న అతను ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. హమీద్ 82 బంతుల్లో 31 పరుగులు సాధించి, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. బెన్ డకెట్ (13) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, అశ్విన్ బౌలింగ్‌లోనే ఆజింక్య రహానే క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. 102 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను జో రూట్, మోయిన్ అలీ ఆదుకున్నారు. వీరిద్దరూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 48.2 ఓవర్లలో 179 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో ఇంగ్లాండ్ కోలుకుంది. 180 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 124 పరుగులు సాధించిన జో రూట్‌ను ఉమేష్ యాదవ్ రిటర్న్ క్యాచ్ పట్టుకొని అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బెన్ స్టోక్స్‌తో కలిసి మొయిన్ అలీ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ స్కోరును 300 పరుగుల మైలురాయిని దాటించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి అతను 192 బంతుల్లో 99, స్టోక్స్ 41 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. అశ్విన్ రెండు వికెట్లు కూల్చగా, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా చెరొక వికెట్ సాధించారు.
ఆ క్యాచ్‌లే పట్టివుంటే..
ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్, కెరీర్‌లో మొదటిసారి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ హసీబ్ హమీద్ ఇచ్చిన క్యాచ్‌లను పట్టివుంటే, బుధవారం మొదలైన తొలి టెస్టు మొదటిరోజు ఆటలో టీమిండియా పరిస్థితి మెరుగ్గా ఉండేది. కానీ, రెండు క్యాచ్‌లను చేజార్చుకున్నందుకు భారత్ తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. కుక్ పరుగుల ఖాతాను తెరవక ముందే, మహమ్మద్ షమీ వేసిన మొదటి ఓవర్ మూడో బంతి అతని బ్యాట్‌కు తగులుతూ గల్లీ దిశగా వెళ్లింది. అయితే, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఆజింక్య రహానే దానిని అందుకోలేకపోయాడు. హమీద్ మొదటి బంతి కూడా అతని బ్యాట్‌ను ముద్దాడుతూ స్లిప్స్‌లోకి వెళ్లింది. ఉమేష్ యాదవ్ వేసిన ఆ బంతిని స్లిప్స్‌లో ఒడిసి పట్టుకోవడంలో మురళీ విజయ్ విఫలమయ్యాడు. కుక్, హమీద్ భారీ స్కోర్లు చేయలేకపోయినా, వారిని ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపివుంటే, ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ దారుణంగా కుప్పకూలేది. కానీ, వారికి అవకాశాన్నిచ్చిన రహానే, మురళి ఒక రకంగా భారత్‌ను కష్టాల్లోకి నెట్టారు.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: అలిస్టర్ కుక్ ఎల్‌బి రవీంద్ర జడేజా 21, హసీబ్ హమీద్ ఎల్‌బి అశ్విన్ 31, జో రూట్ సి అండ్ బి ఉమేష్ యాదవ్ 124, బెన్ డకెట్ సి ఆజింక్య రహానే బి అశ్విన్ 13, మోయిన్ అలీ నాటౌట్ 99, బెన్ స్టోక్స్ నాటౌట్ 19, ఎక్‌స్ట్రాలు 4, మొత్తం (93 ఓవర్లలో 4 వికెట్లకు) 311.
వికెట్ల పతనం: 1-47, 2-76, 3-102, 4-281.
బౌలింగ్: మహమ్మద్ షమీ 12.1-0-31-0, ఉమేష్ యాదవ్ 18.5-1-68-1, అశ్విన్ 31-3-108-2, రవీంద్ర జడేజా 21-2- 59-1, అమిత్ మిశ్రా 10-1-42-0.

రికార్డు భాగస్వామ్యం
రాజ్‌కోట్: జో రూట్, మోయిన్ అలీ మొదటి రోజు ఆటలో సాధించిన 179 పరుగుల భాగస్వామ్యం భారత్‌లో ఇంగ్లాండ్‌కు ఐదో అతిపెద్ద పార్ట్‌నర్‌షిప్. ఇంతకు ముందు కాలింగ్‌వుడ్/ ఆండ్రూ స్ట్రాస్ 2008 డిసెంబర్ 11న చెన్నైలో 214, ఇయాన్ బెల్/ జొనథాన్ ట్రాక్ 2012 డిసెంబర్ 13న నాగపూర్‌లో 208, కెన్ బారింగ్‌టన్/ టెడ్ డెక్స్‌టర్ 1961 డిసెంబర్ 1న కాన్పూర్‌లో 206, బారీ నైట్/ పీటర్ పార్‌ఫిట్ 1964 ఫిబ్రవరి 15న కాన్పూర్‌లో 191 చొప్పున ఇంగ్లాండ్‌కు టెస్టుల్లో భారీ భాగస్వామ్యాలను అందించారు.
రాజ్‌కోట్‌లో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ భారత్‌లోని 22 కేంద్రాలు టెస్టులకు ఆతిథ్యమివ్వగా, రాజ్‌కోట్ 23వది. గత సిరీస్‌లో ఇండోర్ 22వ టెస్టు కేంద్రంగా అవతరించిన విషయం తెలిసిందే.
భారత్‌లో విదేశీ జట్లు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం వరుసగా ఇది 20వసారి. ఈ విధంగా మూడు వందలకుపైగా స్కోరు చివరిసారి మొహాలీలో ఆస్ట్రేలియా (408) నమోదు చేసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 311 పరుగులు చేసింది.
రాజ్‌కోట్ మ్యాచ్‌తో టెస్టు కెరీర్‌ను ప్రారంభించిన హసీబ్ హమీద్ కొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ తరఫున తన మొదటి టెస్టులోనే ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన బ్యాట్స్‌మన్‌లో తక్కువ వయసు అతనిదే. లెన్ హట్టన్ 21 సంవత్సరాల, మూడు రోజుల వయసులో తన తొలి టెస్టు ఆడుతూ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. 19 సంవత్సరాల, 297 రోజుల వయసుతో హమీద్ ఆ రికార్డును బద్దలు చేశాడు.
భారత్‌లో విదేశీ జట్లు గత ఎనిమిది టెస్టుల్లో టాస్‌ను ఓడిపోయాయి. టాస్ విషయంలో భారత్ వరుస విజయాలకు కుక్ బ్రేకు వేశాడు.