క్రీడాభూమి

‘సాన్‌టినా’ ఖాతాలో సిడ్నీ టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 16: వరుస విజయాలతో దూసుకుపోతున్న టెన్నిస్ డబుల్స్ జంట సానియా మీర్జా- మార్టినా హింగిస్‌ల ఖాతాలోకి మరో విజయం వచ్చి చేరింది. 29వ వరుస విజయంతో ఈ ఏడాది శుభారంభం చేసిన సాన్‌టినా శుక్రవారం సిడ్నీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో విజయభేరి మోగించింది. కరోలిన్ గార్షియా, క్రిస్టినా మ్లడెనోవిక్ జంటపై 1-6, 7-5, 10-5 స్కోరుతో గెలిచి తమ జంటకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది.
సమన్వయ లోపంతో మొదటి సెట్‌ను ప్రత్యర్థులకు సమర్పించుకున్న సానియా మీర్జా, మార్టినాల జంట చివరి రెండు సెట్లలో చెమటోడ్చాల్సి వచ్చింది. రెండోసెట్‌లోనూ 2-5 తేడాతో వెనుకబడింది. చివరకు పుంజుకుని 5-5తో సమం చేశారు. తర్వాత 7-5తో గెలిచారు. అయితే మూడోసెట్‌లో కూడా కరోలిన్, క్రిస్టినాల జంట తీవ్రంగా ప్రతిఘటించింది. ఫలితం మూడోసెట్‌లో ఫలితం తేలేందుకు 10-5 గేమ్‌ల వరకూ వెళ్లిందంటే మ్యాచ్ ఎంత పోటాపోటీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో తమ జైత్రయాత్రకు బ్రేక్ పడిందనే భావించామని మ్యాచ్ గెలిచిన అనంతరం సానియా చెప్పింది. కేవలం ఇదొక్క ఓటమేగా అని తన మనసుకు సర్దిచెప్పుకున్నానని అంది. ‘అలాంటి పరిస్థితుల్లో సానుకూలంగా ఆలోచించడం మినహా మరో గత్యంతరం లేదనిపించింది. మూడో సెట్‌లో 5-3 వద్ద సర్వీస్ నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడ్డాం. చివరికి ఫలితం మావైపే మొగ్గింది’ అని ఆమె వివరించింది. కాగా గార్షియా, క్రిస్టినాల జంట కలిసికట్టుగా బరిలోకి దిగడం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. ‘ప్రత్యర్థి జంట చాలా బాగా ఆడింది. భవిష్యత్తులో వారినుంచి మాకు గట్టి పోటీ ఎదురయ్యేట్టు ఉంది’ అని మార్టినా హింగిస్ వ్యాఖ్యానించింది. ఈ సీజన్‌లో సానియా మీర్జా, మార్టినా హింగిస్‌ల జంట గెలుచుకున్న డబ్ల్యుటిఎ డబుల్స్ టైటిల్స్‌లో ఇది పదకొండవది.
డబుల్స్‌లో నంబర్ వన్ స్థానానికి హింగిస్
మెల్‌బోర్న్: డబ్ల్యుటిఎ మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో స్విస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ తన క్రీడా భాగస్వామి సానియా మీర్జాను అందుకుంది. సిడ్నీ టైటిల్ గెలుపుతో హింగిస్ ఖాతాలో పాయింట్లు 11,395కు పెరిగాయి. దీంతో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న మీర్జాతో పాటు హింగిస్ కూడా టాప్ ర్యాంక్‌ను అందిపుచ్చుకుంది. యుఎస్, వింబుల్డన్ టైటిల్స్‌తోపాటు ఈ సీజన్‌లో 11 టైటిల్స్‌ను గెలుచుకున్న సాన్‌టినా...సిడ్నీ టైటిల్ గెలుపుతో 30 వరుస విజయాలతో తమ రికార్డును మెరుగుపరుచుకున్నారు. కాగా మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో గతంలో 35 వారాలపాటు అప్రతిహతంగా అగ్రస్థానంలో కొనసాగిన హింగిస్, చాలాకాలంగా రేసులో వెనుకబడింది. ఆమె సహ క్రీడా భాగస్వామి సానియా మీర్జా చాలాకాలంగా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందిపుచ్చుకోవడంపై హింగిస్ మాట్లాడుతూ ‘సానియా చార్ల్‌స్టన్ టైటిల్‌ను గెలుచుకుని అగ్రస్థానానికి చేరినప్పుడు నేను గతంలో టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నప్పుడు ఎంత సంతోషించానో అంతగానూ ఆనందించాన’ని చెప్పింది. సానియా మీర్జా స్పందిస్తూ పదహారేళ్ల తరవాత హింగిస్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. ‘మా ర్యాంకులు ఏవైనా కలసికట్టుగా మేం నంబర్ వన్ స్థానంలో ఉన్నామన్నది ముఖ్యం. జట్టుగానే కాకుండా ఇప్పుడు ఇద్దరమూ విడివిడిగా కూడా నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం మరీ సంతోషంగా ఉంది’ అని సానియా చెప్పింది.

బొపన్న- మెర్గియా జోడీకి రన్నరప్ టైటిల్
సిడ్నీ, జనవరి 16: ఇక్కడ జరుగుతున్న ఎటిపి అపియా ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంటులో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో మన దేశానికి చెందిన రోహన్ బొపన్న, రుమేనియాకు చెందిన ఫ్లోరిన్ మెర్గియా జోడి ఆన్‌సీడెడ్ జోడీ బ్రూనో సోరెస్ (బ్రెజిల్), జేమీ ముర్రే (బ్రిటన్) చేతిలో 3-6, 6-7(6) స్కోరుతో వరస సెట్లలో ఓటమి పాలయి రన్నర్స్ అఫ్ ట్రోఫీతో సంతృప్తి చెందింది. రెండో సెట్ ట్రైబ్రేకర్‌లో 4-0 ఆధిక్యత సాధించిన బొపన్న జోడీ ఆ సెట్‌ను దక్కించుకుని మ్యాచ్‌ని సూపర్ టై బ్రేకర్ దాకా తీసుకెళ్తుందనిపించింది. అయితే ఆ జంట అ అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. తొలిసెట్‌లో రెండు సార్లు సర్వీస్ కోల్పోయిన ఆ జంట ఆ తర్వాత ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకావాలు రెండు సార్లు ళినంచినా సద్వినియోగం చేసుకోలేక పోయింది. గత ఏడాది బోపన్న కెనడా ఆటగాడు డేనియల్ నెస్టర్‌తో కలిసి ఈ ఈవెంట్‌లో డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అయితే బొపన్న మెర్గియా జోడీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో చక్కటి ప్రతిభను కనబర్చవచ్చన్న ఆశలను మాత్రం అభిమానులకు కల్పించింది.

ఆస్ట్రేలియా ఓపెన్ క్వాలిఫయర్‌లో
సాకేత్ మైనేని ఓటమి
మెల్బోర్న్, జనవరి 16: భారత డేవిస్ కప్ క్రీడాకారుడు సాకేత్ మైనేని ఆస్ట్రేలియా ఓపెన్ మెయిన్‌డ్రాకు అర్హత పొందడానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ క్వాలిఫైయింగ్ పోటీల మూడో రవుండ్‌లో మీర్జా బాసిక్ చేతిలో ఓటమి పాలవడంతో ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే అతను మెయిన్‌డ్రాకు అర్హత పొందే అవకాశం ఉండేది. తొలి సెట్‌ను 6-3 స్కోరుతో గెలుచుకుని శుభారంభం చేసినప్పటికీ మైనేని మిగతా రెండు సెట్లను 4-6, 6-8 స్కోరుతో చేజార్చుకున్నాడు. రెండు గంటలకు పైగా పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలి రెండు సెట్లను చెరోటి గెలుచుకున్న తర్వాత నిర్ణాయక మూడో సెట్‌లో మైనేనికి మూడు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశాలు లభించాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. మైనేని ఓటమితో ఆస్ట్రేలియా ఓపెన్ సిగిల్స్ మెయిన్‌డ్రాలో భారత్ తరఫున ఒక్క యుకి భంబ్రిమాత్రమే ప్రాతినిధ్యం లభించినట్లయింది. అయితే తొలి రౌండ్‌లో అతను తనకన్నా ఎన్నో రెట్లు మెరుగయిన నంబర్ సిక్స్ ఆటగాడు తామస్ బెర్డిచ్‌ను ఢీకొనాల్సి ఉంది.

ఇక బ్యాట్స్‌మెన్‌పై మరింత భారం

కంగారూలతో నేడు టీమిండియా మూడో వనే్డ

మెల్బోర్న్, జనవరి 16: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్ ఆదివారం ఇక్కడి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా పరాజయాలను ఎదుర్కొన్న భారత జట్టు సిరీస్‌పై ఆశలు నిలుపుకోవాలంటే మూడో వనే్డలో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. అయితే బౌలర్ల వైఫల్యాల కారణంగా తొలి రెండు వనే్డలను చేజార్చుకున్న భారత జట్టు కంగారూల జోరుకు అడ్డుకట్ట వేయాలంటే బ్యాట్స్‌మన్లపై అధికంగా ఆధారపడటం మినహా మరో మార్గం కనిపించడంలేదు. తొలి రెండు వనే్డల్లో భారత జట్టు 300కు పైగా పరుగులు సాధించినప్పటికీ ఆ స్కోరును కాపాడుకోలేక వరుస ఓటముల పాలవడంతో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బౌలర్ల వైఫల్యం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని, కనుక ఇక బ్యాట్స్‌మన్లు మరింత భారాన్ని మోయక తప్పదని ధోనీ అంగీకరించాడు. గత ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన తర్వాత భారత జట్టు పెద్దగా సాధించింది ఏమీ లేదు. జింబాబ్వేపై ‘కంటి తుడుపు’ విజయాన్ని మినహాయిస్తే విదేశీగడ్డపై బంగ్లాదేశ్, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వనే్డ సిరీస్‌లను చేజర్చుకున్న టీమిండియా ఇప్పుడు వరుసగా మూడో సిరీస్‌లో ఓటమి అంచున నిలవడం ధోనీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.
గత ఏడాది నుంచి టీమిండియా ఓటమిపాలైన ప్రతిసారీ కెప్టెన్ ధోనీని తొలగించాలన్న వాదన మరింత ఊపందుకుంటుండంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) పరిస్థితిని సమీక్షించి కనీసం ఈ ఏడాది ట్వంటీ-20 ప్రపచకప్ ముగిసేవరకైనా అతడిని పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది వేసవిలో జింబాబ్వే పర్యటనకు ధోనీ గైర్హాజరైనప్పటికీ ఆ తర్వాత అతని సారథ్యంలో టీమిండియాకు వరుస ఓటములు తప్పలేదు. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా కెప్టెన్‌గా తాను ఏమి చేయగలనన్నదీ ధోనీ నిరూపించుకోవాల్సి ఉంది. ఇలా చెప్పడం చాలా సుళువే. చేయడమే కష్టం. ఎందుకంటే ప్రస్తుతం ధోనీకి అందుబాటులో ఉన్న వనరులు ఇందుకు అనుగుణంగా ఉన్నట్లు కనిపించడం లేదు. బ్రిస్బేన్‌లో శుక్రవారం మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో ధోనీని పాత్రికేయులు ప్రధానంగా ఈ విషయం గురించే ప్రశ్నించారు. కంగారూలపై వరుసగా రెండు మ్యాచ్‌లలో 300 పైగా పరుగులు సాధించిన టీమిండియా ఆ స్కోర్లను కాపాడుకోలేకపోవడంపై వారు నిలదీశారు. అయితే ఎంత భారీ స్కోరు సాధించినప్పటికీ దానిని బౌలర్లు కాపాడితే తప్ప ప్రయోజనం ఉండదని, బౌలర్ల వైఫల్యాల వల్లనే వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ తమ జట్టు ఓటమి పాలైందని ధోనీకి కూడా తెలుసు. అందుకే ఇక ముందు మ్యాచ్‌లలో టీమిండియా బ్యాట్స్‌మన్లు మరింత భారాన్ని భుజస్కందాలపై వేసుకుని 330 నుంచి 340 పరుగులు సాధించాల్సిందిగా కోరుతున్నానని, ఇదేమీ జోక్ కాదని ధోనీ స్పష్టం చేశాడు. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే చక్కగా రాణిస్తున్నప్పటికీ ఎడమచేతి వాటం ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడగా ఆడలేకపోవడం టీమిండియాను ఆందోళనకు గురిచేస్తోంది.

టి-20 సిరీస్‌లో పాక్ బోణీ

17 పరుగుల తేడాతో కివీస్‌పై గెలుపు

ఆక్లాండ్, జనవరి 16: న్యూజిలాండ్‌లో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో పాకిస్తాన్ శుభారంభం సాధించింది. ఆక్లాండ్‌లో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 16 పరుగుల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ 61 పరుగులతో సత్తా చాటుకున్నాడు. అతనికి తోడుగా అహ్మద్ షెహజాద్ (16), షోయబ్ మాలిక్ (20), ఉమర్ అక్మల్ (24), కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ (23), ఇమద్ వాసిమ్ (18) తమవంతు రాణించడంతో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే చక్కగా రాణించి 4 వికెట్లు కైవసం చేసుకోగా, ఎంజె.సాంట్నర్ రెండు వికెట్లు, ఎంజె.హెన్రీ, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ చొప్పున అందుకున్నారు.
అనంతరం 172 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు రెండో ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (2) వికెట్‌ను చేజార్చుకుంది. అయితే కెప్టెన్ కాన్ విలియమ్‌సన్, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ సి.మన్రో బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. పాక్ బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించి చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. అనంతరం మన్రో (56) వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కొరీ జె.ఆండర్సన్ (0), ఇలియట్ (3), రోంచీ (0), సాంట్నర్ (0), టిడి.ఆస్టిల్ (1), ఎంజె.హెన్రీ (10) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగు తీయగా, 70 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన విలియమ్‌సన్ చివరి ఓవర్లో వహాబ్ రియాజ్ వేసిన తొలి బంతిని ఎదుర్కోబోయి హఫీజ్‌కు దొరికిపోయాడు. ఆ ఓవర్ చివర్లో ట్రెంట్ బౌల్ట్ (0) షాహిద్‌కి క్యాచ్ ఇవ్వగా, ఆడమ్ మిల్నే 2 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 20 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్ జట్టు 16 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్ మూడు వికెట్లు సాధించగా, షహీద్ అఫ్రిదీ, ఉమర్ గుల్ రెండేసి వికెట్లు, ఇమద్ వాసిమ్, మొహమ్మద్ అమీర్ ఒక్కో వికెట్ చొప్పున అందుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరించిన పాక్ కెప్టెన్ అఫ్రిది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.

బౌలర్ల వైఫల్యం

పునరావృతం!

మళ్లీ కంగారూలదే విజయం
7 వికెట్ల తేడాతో భారత్ చిత్తు
రోహిత్ శతకం వృథా

బ్రిస్బేన్, జనవరి 16: ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఐదు వనే్డల అంతర్జాతీయ సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండో పరాజయాన్ని ఎదుర్కొంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో శుక్రవారం జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ (124) మరోసారి సెంచరీతో సత్తా చాటుకున్నాడు. అతనికి తోడు విరాట్ కోహ్లీ (59), యువ బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే (89) తమ వంతు రాణించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే బౌలర్ల వైఫల్యం మరోసారి పునరావృతమవడంతో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 309 పరుగులు సాధించి మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. అయతే ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. 6 పరుగులకే అతను పారిస్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక మాథ్యూ వేడ్‌కు దొరికిపోవడంతో భారత జట్టు 3వ ఓవర్‌లోనే తొలి వికెట్‌ను చేజార్చుకుంది. ఈ తరుణంలో ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లో నిలదొక్కుకుని స్కోరుబోర్డును ముందుకు నడిపారు. బాధ్యతాయుతంగా ఆడుతూ కంగారూలను సమర్ధవంతంగా ప్రతిఘటించి చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం కోహ్లీ (59) 24వ ఓవర్‌లో రనౌట్‌గా నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. అయితే అతని స్థానంలో వచ్చిన యువ బ్యాట్స్‌మన్ రహానే కూడా క్రీజ్‌లో నిలదొక్కుకుని ఆసీస్ బౌలర్లను చక్కగా ప్రతిఘటించాడు. రహానే అందించిన సహకారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని 112 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ మూడో వికెట్‌కు మరో 121 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (11) బోలాండ్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి స్వల్పస్కోరుకే నిష్క్రమించగా, 89 పరుగులతో రాణించిన రహానే 49వ ఓవర్‌లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో స్మిత్ చేతికి చిక్కాడు. అనంతరం మనీష్ పాండే (6), రవీంద్ర జడేజా (5), రవిచంద్రన్ అశ్విన్ (1) త్వరత్వరగా నిష్క్రమించడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జేమ్స్ ఫాల్క్‌నర్ 2 వికెట్లు, జెఎస్.పారిస్, జెడబ్ల్యు.హేస్టింగ్స్, ఎస్‌ఎం.బోలాండ్ ఒక్కో వికెట్ చొప్పున రాబట్టారు.
అనంతరం 309 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు ఆరోన్ ఫించ్, షాన్ మార్ష్ చక్కటి శుభారంభాన్ని అందించారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వీరు చెరో 71 పరుగుల చొప్పున సాధించి వెనుదిరిగారు. వీరి నిష్క్రమణ తర్వాత కెప్టెన్ స్టీవెన్ స్మిత్, జార్జి బెయిలీ కూడా బాధ్యతాయుతంగా ఆడారు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు మూడో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. అనంతరం స్మిత్ (46) ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా నిష్క్రమించినప్పటికీ జార్జి బెయిలీ (76), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (26) మిగిలిన పని పూర్తిచేశారు. మరో వికెట్ చేజారకుండా జాగ్రత్తగా ఆడిన వీరు అజేయంగా 65 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 309 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ ఒక్కో వికెట్‌తో సరిపుచ్చుకున్నారు.

దుమ్ము రేపిన ఆరోన్ ఫించ్ (71), షాన్ మార్ష్ (71)

సంక్షిప్తంగా స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 308/8 (రోహిత్ శర్మ 124, విరాట్ కోహ్లీ 59, అజింక్యా రహానే 89, మహేంద్ర సింగ్ ధోనీ 11).
వికెట్ల పతనం: 1-9, 2-134, 3-255, 4-276, 5-298, 6-302, 7-306, 8-308. బౌలింగ్: జేమ్స్ ఫాల్క్‌నర్ 2/64, జెఎస్.పారిస్ 1/40, జెడబ్ల్యు.హేస్టింగ్స్ 1/46, ఎస్‌ఎం.బోలాండ్ 1/64
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 49 ఓవర్లలో 309/3 (ఆరోన్ ఫించ్ 71, షాన్ మార్ష్ 71, స్టీవెన్ స్మిత్ 46, జార్జి బెయిలీ 76-నాటౌట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 26-నాటౌట్). వికెట్ల పతనం: 1-145, 2-166, 3-244.
బౌలింగ్: రవీంద్ర జడేజా 1/50, ఇశాంత్ శర్మ 1/60, ఉమేష్ యాదవ్ 1/74.