క్రీడాభూమి

కోహ్లీకి కెరీర్ బెస్టు ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 13: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మంగళవారం తాజాగా విడుదల చేసిన అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అడుగు ముందుకేసి కెరీర్ బెస్టు స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా సోమవారం ముంబయిలో ముగిసిన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీ సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లీ ఈ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని రెండో ర్యాంకుకు ఎగబాకగా, అత్యుత్తమ బౌలర్ల జాబితాలో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ర్యాంకును మరింత బలోపేతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ముంబయిలో భారత్ ఆడిన ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో 235 పరుగులు సాధించి టెస్టుల్లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరును నమోదు చేసుకోవడం ద్వారా 53 పాయింట్లను రాబట్టుకున్న కోహ్లీ ఖాతాలో మొత్తం 886 రేటింగ్ పాయింట్లు ఉండటంతో తాజా ర్యాంకింగ్స్‌లో అతను రెండో స్థానానికి ఎగబాకాడు. దీంతో అతను ఇప్పుడు ఏ సమయంలోనైనా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని ఆక్రమించేందుకు వరుసలో ఉన్నాడు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలోనూ, ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనూ కొనసాగుతున్న కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కంటే కేవలం 11 పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అయితే ఆస్ట్రేలియా జట్టు స్వదేశంలో గురువారం నుంచి పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుండటంతో ఉత్తమ టెస్టు బ్యాట్స్‌మన్ల జాబితాలో స్మిత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు అవకాశం లభించనుంది.
ఇక ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ ముంబయి టెస్టులో మరోసారి ఇంగ్లాండ్ భరతం పట్టి 167 పరుగులకే 12 వికెట్లు కైవసం చేసుకోవడంతో తాజా ర్యాంకింగ్స్‌లో అతని స్థానం మరింత బలోపేతమైంది. అక్టోబర్‌లో తొలిసారి 900 పాయింట్ల మార్కుకు చేరుకుని అప్పటి నుంచి మళ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 904 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఉత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న శ్రీలంక ఆటగాడు రంగన హెరత్ కంటే అశ్విన్ 37 పాయింట్ల ఆధిక్యతలో నిలవడంతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్ల జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ (920 పాయింట్లు) తర్వాత రెండో స్థానంలోనూ, ఉత్తమ స్పిన్నర్ల జాబితాలో టోనీ లాక్ (912), డెరెక్ అండర్‌వుడ్ (907), షేన్ వార్న్ (905) తర్వాత ఐదో స్థానంలోనూ నిలిచాడు.
అత్యుత్తమ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతున్న అశ్విన్ (483 పాయింట్లు) ఈ జాబితాలో తనకు దిగువన ఉన్న బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్‌హసన్ (405), ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ (341) కంటే ఎంతో ముందంజలో ఉన్నాడు.
నెంబర్ వన్ జట్టు మనదే
అత్యుత్తమ టెస్టు జట్ల జాబితాలో టీమిండియా 115 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లాండ్ (105), ఆస్ట్రేలియా (105), పాకిస్తాన్ (102), దక్షిణాఫ్రికా (102), న్యూజిలాండ్ (96), శ్రీలంక (96), వెస్టిండీస్ (69), బంగ్లాదేశ్ (65), జింబాబ్వే (5) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.