క్రీడాభూమి

షూటౌట్స్‌తో ఫైనల్‌కు భారత్, బెల్జియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 16: జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భారత్, బెల్జియం జట్లు ఫైనల్ చేరాయి. అత్యంత పటిష్టమైన జట్టుగా, హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, గతంలో ఆరు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న జర్మనీ జట్లు అనూహ్యంగా పరాజయాలను చవిచూశాయి. శుక్రవారం జరిగిన రెండు సెమీ ఫైనల్స్‌లోనూ పెనాల్టీ షూటౌట్ అనివార్యం కావడం గమనార్హం. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొంటున్నప్పటికీ, ఏమాత్రం తడబాటు లేకుండా ఆడిన భారత యువ జట్టు అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్ మొదలైన మరుక్షణం నుంచే ఇరు జట్ల మధ్య సంకుల సమరం ఆరంభమైంది. మైదానంలో అత్యంత వేగంగా కదులుతూ, ప్రత్యర్థి జట్లపై ముమ్మర దాడులు చేయడంలో పేరుపొందిన ఆస్ట్రేలియాకు 14వ నిమిషంలో టామ్ క్రెగ్ గోల్‌ను అందించాడు. దీనితో కంగుతిన్న భారత ఆటగాళ్లు ఒకవైపు రక్షణ విభాగాన్ని పటిష్టం చేసుకుంటూనే, మరోవైపు దాడులకు ఉపక్రమించారు. ఆస్ట్రేలియా నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైనప్పటికీ, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా జోరును కొనసాగించారు. 42వ నిమిషంలో గుజ్రంత్ సింగ్ ద్వారా భారత్‌కు ఊరట లభించింది. అతను చేసిన ఈక్వెలైజర్‌తో ఉత్సాహం రెట్టింపుకాగా, ఆసీస్‌పై భారత ఆటగాళ్లు విరుచుకుపడ్డారు. మరో ఆరు నిమిషాల్లోనే మన్దీప్ సింగ్ గోల్ సాధించి, భారత్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. రెండో గోల్ లభించిన తర్వాత, హర్జీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు మరోసారి వ్యూహాత్మక డిఫెన్స్‌కు దిగింది. కానీ, లాచ్లన్ షార్ప్ ఈ రక్షణ వలయాన్ని ఛేదించి, 57వ నిమిషంలో గోల్‌ను సాధించి, స్కోర్లు సమం చేశాడు. ఆతర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోవడంతో, పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. మొదట స్ట్రయిక్‌ను తీసుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు గోవర్స్ బ్లేక్ తన ప్రయత్నంలో సఫలమయ్యాడు. భారత గోల్‌కీపర్ వికాస్ దహియాను ఏమార్చిన బ్లేక్ గోల్ సాధించాడు. అనంతరం భారత్ తరఫున హర్జీత్ సింగ్ గోల్ చేశాడు. అతను చాకచక్యంగా కొట్టిన బంతిని ఆస్ట్రేలియా గోల్‌కీపర్ థామస్ ఆష్లే అడ్డుకోలేకపోయాడు. స్కోర్లు చెరొకటిగా సమంకాగా, ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ బర్డ్ గోల్ చేయలేకపోయాడు. ఆ వెంటనే హర్మన్‌ప్రీత్ సింగ్ తన చాన్స్‌ను సద్వినియోగం చేసుకొని, భారత్‌కు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. లాచ్లన్ షార్ప్ కొట్టిన బంతిని వికాస్ అద్భుతంగా ఆడ్డుకోవడంతో, ఆస్ట్రేలియా విజయావకాశాలకు దాదాపుగా తెరపడింది. ఆ వెంటనే సుమీత్ కొట్టిన బంతి ఆసీస్ గోల్ పోస్టులోకి దూసుకెళ్లింది. భారత్‌కు 3-1 ఆధిక్యం లభించింది. వెల్చ్ జాక్ చక్కటి స్ట్రయిక్‌తో గోల్ చేసి, ఆస్ట్రేలియాకు రెండో గోల్‌ను అందించాడు. భారత్‌కు మన్‌ప్రీత్ సింగ్ జూనియర్ గోల్ సాధించిపెట్టడంతో భారత్ 4-2 తేడాతో గెలిచి, ఫైనల్ చేరింది. భారత్ తరఫున పెనాల్టీ షూటౌట్‌ను తీసుకున్న నలుగురు ఆటగాళ్లు సఫలంకాగా, ఆసీస్ తరఫున నలుగురిలో ఇద్దరు మాత్రమే గోల్స్ చేయగలిగారు.
మితిమీరిన డిఫెన్స్!
బెల్జియం జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో జర్మనీపై విజయం సాధించి ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఇరు జట్లు మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించాయి. ఒకరి నుంచి మరొకరు బంతిని అందిపుచ్చుకొని, ఎక్కువ సేపు తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాయి. దీనితో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకోవడంతో, గోల్స్ రావడం అసాధ్యంగా మారింది. మొత్తానికి నిర్ణీత గడువు ముగిసే సమయానికి రెండు జట్లూ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఇంజురీ టైమ్‌లో, ఆతర్వాత ఎక్‌స్ట్రా టైమ్‌లోనూ పరిస్థితి మారకపోవడంతో, పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించాల్సి వచ్చింది. ఇందులో, బెల్జియం తరఫున నికోలాస్ పోనె్సలెట్, ఆర్థర్ డ స్లూవర్, హెన్రీ రయిస్, రాబర్ట్ రూబెన్స్ తమతమ ప్రయత్నాల్లో సఫలమయ్యారు. జర్మనీ తరఫున స్ట్రోక్ తీసుకున్న వారిలో జొహానె్నస్ గ్రాబ్, థియెస్ ఒలె ప్రింజ్, కాన్‌స్టాంటిన్ స్టయిబ్ మాత్రమే సఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక మూడు, నాలుగు స్థానాలకు జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో జర్మనీ పోటీపడుతుంది.
ఇలావుంటే, దక్షిణ కొరియాను 2-1 తేడాతో ఓడించిన జపాన్ 13వ స్థానాన్ని దక్కించుకుంది. జపాన్ తరఫున కొతా వతనాబే, కోజి యమాసాకీ గోల్స్ సాధించారు. కొరియాకు ఒ సెయాంగ్ ఒక్కడే గోల్‌ను అందించాడు. కాగా, ఈజిప్టు 15వ స్థానాన్ని ఆక్రమించింది. కెనడాను ఈ జట్టు 2-1 తేడాతో ఓడించింది. ఈజిప్టు ఆటగాళ్లలో మహమ్మద్ గాదెల్ కరీం, అహ్మద్ ఎల్గానైనీ గోల్స్ సాధించారు. కెనడా తరఫున రోహన్ చోప్రా ఒక్కడే గోల్ చేశాడు.

చిత్రం..ఆస్ట్రేలియాను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి జూ. హాకీ ప్రపంచ కప్ ఫైనల్ చేరిన భారత ఆటగాళ్ల ఆనందం