క్రీడాభూమి

కుర్రాళ్లు సాధించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 18: ఒకటిన్నర దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. సీనియర్లకు అసాధ్యంగా మారిన ప్రపంచ కప్‌ను కుర్రాళ్లు సాధించారు. భవిష్యత్తు తమదేనని నిరూపించుకున్నారు. హరేంద్ర సింగ్ శిక్షణలో రాటుదేలిన భారత జూనియర్ హాకీ జట్టు ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో బెల్జియంపై 2-1 తేడాతో విజయభేరి మోగించి, రెండోసారి ఈ టైటిల్‌ను గెల్చుకుంది. 2001లో గగన్ అజిత్ సింగ్, యుగ్రాజ్ సింగ్ అసాధారణ ప్రతిభతో భారత్‌కు టైటిల్ దక్కితే, ఈసారి సమష్టి కృషితో గెలిచింది. ఐదు పర్యాయాలు చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న జర్మనీ, అత్యంత బలమైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియా ఫైనల్ చేరుకోలేకపోవడంతో, భారత్ విజయావకాశాలు మెరుగుపడ్డాయి. బెల్జియంపై ఫేవరిట్‌గా బరిలోకి దిగిన హర్జీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ మొదటి నుంచి చివరి వరకూ వ్యూహాత్మకంగా ఆడింది. ఆరంభంలో ప్రత్యర్థిపై ముమ్మర దాడులు చేసింది. రెండు గోల్స్ ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత రక్షణ విధానాన్ని అనుసరించింది. గోల్స్ కోసం బెల్జియం చేసిన ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంది. చివరి క్షణాల్లో బెల్జియం ఒక గోల్ చేసినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది. తుది పోరును ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గాలన్న పట్టుదలతో మైదానంలోకి దిగిన భారత ఆటగాళ్లు, మ్యాచ్ మొదలైన మరుక్షణం నుంచే దాడులకు ఉపక్రమించారు. మ్యాచ్ 8వ నిమిషంలో గుజ్రంత్ సింగ్ చక్కటి ఫీల్డ్ గోల్ చేసి, భారత్ ఖాతాను తెరిచాడు. ఆతర్వాత కూడా భారత్ ఏమాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించకుండా, ప్రత్యర్థి గోల్ పోస్టును లక్ష్యంగా చేసుకొని మెరుపుదాడులు చేసింది. 22వ నిమిషంలో సిమ్రన్‌జిత్ సింగ్ ద్వారా రెండో గోల్‌ను అందుకుంది. వరుసగా రెండు గోల్స్ లభించిన తర్వాత వ్యూహాన్ని మార్చుకుంది. పటిష్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకొని, బెల్జియం ఆటగాళ్లు విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకుంది. మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు ఫాబ్రి వాన్ బొక్రిక్ ఒక గోల్ చేసినప్పటికీ బెల్జియంను ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.
జర్మనీకి మూడో స్థానం
డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ ఈసారి కాంస్య పతకంతో సంతృప్తి చెందింది. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 3-0 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టిమ్ హెర్చ్‌బ్రచ్ రెండు గోల్స్ చేసి, జర్మనీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను 51, 60 నిమిషాల్లో సాధించగా, అంతకు ముందు 11వ నిమిషంలో జాన్ షిఫర్ గోల్ చేశాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా సాధించలేకపోయారు.
ఇతర క్లాసిఫికేషన్ మ్యాచ్‌ల్లోకి వెళితే, అర్జెంటీనా ఐదు, స్పెయిన్ ఆరు స్థానాలను ఆక్రమించాయి. ఐదు, ఆరు స్థానాల క్లాసిఫికేషన్‌లో అర్జెంటీనాకు నికొలాస్ కీనన్ (51వ నిమిషం), థామస్ డొమెన్ (54వ నిమిషం) గోల్స్ అందించారు. ఏడు, ఎనిమిది స్థానాలకు జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 6-2 ఆధిక్యంతో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ను ఓడించింది.

చిత్రం..లక్నోలో ఆదివారం జరిగిన జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో
బెల్జియంను ఓడించి టైటిల్ సాధించిన భారత ఆటగాళ్ల ఆనందం