క్రీడాభూమి

ఠాకూర్‌కు పదవీ గండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌కు పదవీ గండం తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. జనవరి 3న సుప్రీం కోర్టు బోర్డుకు వ్యతిరేకంగానే వస్తుందన్న అనుమానాలు బలపడుతుండగా, తాను చివరి వరకూ వేచి చూస్తానని ఠాకూర్ అంటున్నాడు. భారత క్రికెట్ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన లోధా కమిటీ సిఫార్సుల్లో కొన్ని ఆమోద యోగ్యంగా లేవంటూ, వాటి అమలును బిసిసిఐ చాలాకాలంగా వాయిదా వేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు పర్యాయాలు, గరిష్టంగా మూడుసార్లకు మించి బిసిసిఐ పాలక మండలిలో సభ్యులుగా ఉండరాదని లోధా కమిటీ చేసిన సూచనల్లో ఒకటి. అదే విధంగా 70 ఏళ్లకు మించిన వారు ఎవరూ పాలక మండలిలో ఉండారదని కూడా స్పష్టం చేసింది. రెండు పర్యాయాలు బిసిసిఐ వర్కింగ్ కమిటీలో కొనసాగితే, ఒక పీరియడ్‌ను విడిచిపెట్టి, ఆతర్వాత మళ్లీ ఒకసారి పోటీ చేయవచ్చని లోధా కమిటీ పేర్కొంది. దీనినే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’గా అభివర్ణించింది. మిగతా సిఫార్సుల విషయం ఎలావున్నా ఈ మూడు అంశాలను బిసిసిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఒకవేళ వీటిని తు.చ తప్పకుండా అమలు చేయాల్సి వస్తే, ముందుగా బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే తమ పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుంది. అందుకే, లోధా ప్రతిపాదనలను అమలు చేయకుండా బిసిసిఐ కాలం నెట్టుకొస్తున్నది. అయితే, సుప్రీం కోర్టు తీర్పు దగ్గరకు పడుతుండడంతో ఠాకూర్, అతని మద్దతుదారుల్లో ఆందోళన పెరుగుతున్నది.
మనోహర్‌తో విభేదాలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ శశాంక్ మనోహర్‌తో ఠాకూర్‌కు చాలాకాలంగా విభేదాలున్నాయి. మాజీ కేంద్ర మంత్రి, మరాఠా యోధుడు శరద్ పవార్‌కు మనోహర్ అత్యంత ఆప్తుడు. పవార్ ఎన్‌పిసి అధినేతగా వ్యవహరిస్తుండగా, ఠాకూర్ బిజెపి తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. రెండు పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలే మనోహర్, ఠాకూర్‌లను భిన్న ధ్రువాలుగా చేశాయి. నిజానికి, బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నికైన ఠాకూర్ అంతకు ముందు వరకూ బోర్డు కార్యదర్శిగా వ్యవహరించాడు. అధ్యక్షుడిగా ఉన్న మనోహర్ ఐసిసి చైర్మన్ హోదా కోసం బిసిసిఐకి రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రెండు వేర్వేరు పదవుల్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి, ఐసిసి చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు అతను బోర్డు పదవిని వదులుకున్నాడు. అతని స్థానంలో ఠాకూర్ అధ్యక్షుడిగా ఎన్నికకాగా, ఠాకూర్ విడిచిపెట్టిన కార్యదర్శి పదవికి అజయ్ షిర్కే ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మనోహర్‌తో ఠాకూర్ దాదాపుగా ప్రతి విషయంలోనూ విభేదిస్తునే ఉన్నాడు. లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేయడం నిబంధనలకు విరుద్ధమా? కాదా? స్పష్టం చేయాల్సిందిగా ఐసిసికి లేఖ రాశామని ఠాకూర్ అంటే, అసలు అలాంటి లేఖే తమకు అందలేదని మనోహర్ తేల్చిచెప్పాడు. వీరి మధ్య అరకొరగా ఉన్న సంబంధాలు కూడా కొత్త వివాదం కారణంగా తెగిపోయాయనే చెప్పాలి. వీరి మధ్య రాజీ కుదరడం లేదన్నది వాస్తవం.
సంక్లిష్ట సమయంలో బాధ్యతలు..
బోర్డు వివిదాల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన తరుణంలో ఠాకూర్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించాడు. మనోహర్ తనకు చిల్లులుపడి, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న నావను అప్పచెప్పాడని ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. బోర్డుపై ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞలు చేసినా, అతనికి సరైన అవకాశాలే రాలేదు. బోర్డును పలు కేసులు చుట్టుముట్టి వేధిస్తుండడంతో అతను ధైర్యంగా ముందడుగు వేయలేకపోయాడు. సరైన దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. సాధ్యమైనంత వరకూ పదవిలో కొనసాగడం మినహా చేసేది ఏమీ లేదని అతను ఒక నిర్ధారణకు వచ్చాడనే అనుకోవాలి.