క్రీడాభూమి

ఈ విజయం క్రికెట్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు మొండికేసిన బిసిసిఐ పెద్దలపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొరడా ఝళిపించి పదవుల నుంచి ఉద్వాసన పలకడాన్ని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా స్వాగతించారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును క్రికెట్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. దేశంలో క్రికెట్‌ను బాగు చేయాలంటే సంస్థాగతంగా బిసిసిఐని సంస్కరించాలని సిఫారసు చేస్తూ జస్టిస్ లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సర్వోన్నత న్యాయస్థానానికి నివేదికలు సమర్పించిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కేలపై సుప్రీం కోర్టు తాజాగా వేటు వేయడంతో ఇక త్వరలోనే తమ సిఫారసులు అమలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు జస్టిస్ లోధా తెలిపారు. ‘ఒకసారి సుప్రీం కోర్టు ఆమోదించిన సిఫారసులను అమలు చేయాల్సిందే. కానీ ఇప్పటివరకూ అలా జరగలేదు. వీటి అమలులో అవరోధాలు ఏర్పడ్డాయి. అందుకే సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఒకసారి తీర్పునిస్తే దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు క్రికెట్ సాధించిన విజయమని, దీంతో ఈ క్రీడ మరింత వర్థిల్లుతుందని, పాలకులు వచ్చి పోతుంటారని, ఆట మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు.
చరిత్రాత్మకమైన తీర్పు..
పలువురు క్రికెట్ ప్రముఖుల హర్షం
ఇదిలావుంటే, జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అమలు విషయమై సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు పట్ల టీమిండియా మాజీ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీతో పాటు పలువురు క్రికెట్ ప్రముఖులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘ఇది చరిత్రాత్మకమైన తీర్పు. దీని వలన ఎంతో మంచి జరుగుతుంది. భారత క్రికెట్ మళ్లీ గాటన పడుతుంది. భారత క్రీడారంగానికి, ప్రత్యేకించి క్రికెట్‌కు ఇది ఎంతో శుభపరిణామం. ఈ తీర్పును వెలువరించిన సుప్రీం కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని బిషన్ సింగ్ బేడీ పేర్కొన్నాడు.
సంస్కరణల అమలు మినహా
మరో గత్యంతరం లేదు..
కాగా, సుప్రీం కోర్టు స్పష్టం చేసినట్లుగా లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడం మినహా బిసిసిఐకి మరో గత్యంతరం లేదని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి నిరంజన్ షా పేర్కొన్నాడు. ‘సుప్రీం కోర్టు ఏమి చెబితే అదే అంతిమం. దానికి తిరుగుండదు. ఆ తీర్పునకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందే’ అని ఆయన పేర్కొన్నాడు. తమిళనాడు క్రికెట్ సంఘ కార్యదర్శి కాశీ విశ్వనాథన్ కూడా ఇదేవిధంగా స్పందించాడు. లోధా కమిటీ సిఫారసులను తమ సంఘం ఆమోదిస్తుందని స్పష్టం చేయగా, సుప్రీం కోర్టు తాజాగా వెలువరించిన తీర్పు ప్రతి కోసం ఎదురు చూస్తున్నట్లు కర్నాటక క్రికెట్ సంఘ కార్యదర్శి బ్రిజేష్ పటేల్ తెలిపాడు. ‘తీర్పు వివరాలు తెలిసే వరకూ నేనేమీ మాట్లాడలేను. ఆ తీర్పును పూర్తిగా పరిశీలించిన తర్వాతే లోధా కమిటీ సిఫారసుల విషయంలో ఏమి చేయాలన్నదీ మేము నిర్ణయించుకోగలం’ అని ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు.

చిత్రం..రిటైర్డ్ జస్టిస్ ఆర్‌ఎం.లోధా