క్రీడాభూమి

మా స్టేడియాలు మాకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 7: ఒకప్పుడు ఎడ మొహం పెడ మొహంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ ఒక్కటయ్యారు. లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయకుండా, చివరికి వరకూ పోరాడిన బిసిసిఐ దేశంలో క్రికెట్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు చివరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది. తమ ఆధీనంలో ఉన్న స్టేడియాలను మ్యాచ్‌లకు ఇచ్చేది లేది అనుబంధ యూనిట్లతో హెచ్చరికలు జారీ చేయించే పనిలో పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కారణంగా చిక్కుల్లోపడి, చివరికి బోర్డు అధ్యక్ష పదవికి దూరమైన శ్రీనివాసన్ మరోసారి తెరపైకి రావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. శనివారం ఇక్కడ జరిగిన అనధికార సమావేశానికి శ్రీనివాసన్, ఠాకూర్‌తోపాటు సుప్రీం కోర్టు ఆదేశాలతో పదవులకు దూరమైన అజయ్ షిర్కే, అమితాబ్ చౌదరీ తదితరులు హాజరయ్యారు. బిసిసిఐకి అనుబంధంగా మొత్తం 30 యూనిట్లు ఉండగా, వాటిలో 24 యూనిట్ల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం మీద భారత క్రికెట్‌పై పట్టు కోసం ఆఖరి యుద్ధానికి బిసిసిఐ మాజీ అధికారులంతా అస్త్రాశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. లోధా చేసిన అన్ని సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేస్తే, భారత క్రికెట్‌పై బిసిసిఐ పట్టు కోల్పోతుంది. అంతేగాక, దశాబ్దాల తరబడి ఆడింది ఆట... పాడింది పాటగా ఆధిపత్యాన్ని చెలాయించిన బోర్డుకు ఎంతో మంది ప్రముఖులు దూరమవుతారు. బోర్డు పాలక వర్గంలో ఎవరూ 70 సంవత్సరాల పైబడిన వారు ఉండరాదని, వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడు సార్ల కంటే ఎక్కువగా పదవుల్లో కొనసాగడానికి వీల్లేదని లోధా కమిటీ చేసిన ప్రధాన సూచనల్లో ఉన్నాయి. అదే విధంగా వరుసగా రెండు పర్యాయాలు వర్కింగ్ కమిటీలో ఉండే, ఒక టెర్మ్ పోటీలకు దూరంగా ఉండాలని పేర్కొంటూ, ఆ కాలాన్ని కూలింగ్ పీరియడ్‌గా అభివర్ణించింది. మంత్రులెవరూ బోర్డులో కీలక పదవుల్లో ఉండరాదని స్పష్టం చేసింది. లోధా చేసిన ఇతర సిఫార్సులకు కొంత వరకూ సానుకూలంగా ఉన్నప్పటికీ, ఈ మూడు అంశాలను అమలు చేసేందుకు బిసిసిఐ ససేమిరా అంటున్నది. కేసు సుప్రీం కోర్టుకు చేరుకోగా, సుమారు రెండేళ్లపాటు విచారణ జరిపిన తర్వాత బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేసహా కొంత మంది కీలక అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. లోధా ప్రతిపాదనలను అమలు చేసేందుకు నిరాకరించి, చివరికి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన బిసిసిఐ వ్యూహాన్ని మార్చింది. దేశ క్రికెట్‌పై పట్టును కొనసాగించడానికి చివరి ప్రయత్నాలను మొదలు పెట్టింది. శ్రీనివాసన్ నేతృత్వంలో బెంగళూరులో అనధికార సమావేశం వెనుక ఆంతర్యం ఇదే. దేశంలోని దాదాపుగా అన్ని క్రికెట్ స్టేడియాలను బిసిసిఐ సహాయ సహకారాలతో ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు నిర్మించాయి. కొన్నింటిని నేరుగా బిసిసిఐ పర్యవేక్షిస్తున్నది. కాగా, స్టేడియాల నిర్వాహణ బాధ్యతలను కూడా సంబంధిత క్రికెట్ సంఘాలు చూసుకుంటున్నాయి. ఇంత వరకూ ప్రభుత్వం నుంచి బిసిసిఐ ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం పొందలేదు. తమది స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ అంటూ బిసిసిఐ అధికారులు ఇన్నాళ్లూ చేస్తున్న వాదనను ఇకపై రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వినిపించడం ఖాయంగా కనిపిస్తున్నది. స్టేడియాలు తమ ఆధీనంలో ఉంటాయి కాబట్టి, వాటిని బిసిసిఐ నిర్వహించే మ్యాచ్‌లకు ఇవ్వబోమని స్పష్టం చేయనున్నాయి. ఈ హెచ్చరికతో సుప్రీం కోర్టు తమకు ఏవైనా మినహాయింపులు ఇస్తుందని క్రికెట్‌పై పెత్తనం వదులుకోవడానికి ఇష్టపడని పలువురు మాజీ ప్రముఖుల ఆశ. ఒకవేళ అనుకున్నది జరగకపోతే, అనుబంధ యూనిట్లతో కలిసి కొత్త దుకాణం తెరిచే అవకాశాలున్నాయ.
కోర్టు పర్యవేక్షణలోనే ఖర్చులు!
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బిసిసిఐ పాలనా వ్యవహారాలన్నీ పాదర్శకంగా సాగాలి. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్న క్రికెట్ సంఘంగా ఎదిగిన బిసిసిఐపై చాలా మంది వ్యాపారవేత్తలు, నాయకులు ఆసక్తి ప్రదర్శించడానికి ఇదే ప్రధాన కారణమన్నది అందరికీ తెలిసిన సత్యం. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు నిధుల కొరత ఏర్పడుతుందని, పరిస్థితుల్లో మార్పు లేకపోతే సిరీస్‌లోని చివరి రెండు టెస్టులను రద్దు చేయడం మినహా మరో మార్గం లేదని అప్పట్లో బిసిసిఐ స్పష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత సుప్రీం కోర్టు కొంత సానుకూల వైఖరిని కనబరచింది. చివరి రెండు టెస్టు మ్యాచ్‌లను నిర్వహించే సభ్య సంఘాలకు నిధులు ఇచ్చేందుకు అనుమతించింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని లిఖిత పూర్వకంగా అంగీకరించిన సభ్య సంఘాలకు మాత్రమే చెల్లింపులు జరపాలన్న ఆదేశాల్లో కొద్దిపాటు మార్పులు చేసింది. ఇలావుంటే, త్రిపుర, విదర్భ తప్ప మిగతా క్రికెట్ సంఘాలేవీ లోధా సిఫార్సుల అమలుకు తమ సంపూర్ణ అంగీకారాన్ని తెలుపుతూ అఫిడవిట్‌ను సుప్రీం కోర్టుకు అందచేయలేదు. ఫలితంగా బిసిసిఐ వాటికి నిధులను విడుదల చేసే అవకాశం లేకుండాపోయింది.
అయితే, మ్యాచ్‌లను నిర్వహించే సంఘాలకు నిధులివ్వడానికి సుప్రీం కోర్టు అనుమతించడంతో, బిసిసిఐ పరిస్థితికి కుడితిలో పడిన ఎలుకలా మారింది. ఇంగ్లాండ్‌తో వనే్డ, టి-20 సిరీస్‌లు జరగనున్న నేపథ్యంలో, మరోసారి అదే అస్త్రాన్ని ప్రయోగించే అవకాశాన్ని బిసిసిఐ కోల్పోయింది. అందుకే, స్టేడియాలను మ్యాచ్‌లకు ఇవ్వబోమన్న కొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్టు సమాచారం. బోర్డు మాజీ అధికారులు, సుప్రీం కోర్టు ఆదేశాల కారణంగా పదవిని కోల్పోయిన వారు ఇప్పుడు ఒకే జట్టుగా ఏర్పడుతున్నారు. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేస్తే తమకు పుట్టగతులు ఉండవన్న నిజం తెలుసుకాబట్టి, అలాంటి పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి పోటీ క్రికెట్ బోర్డుకు నడుం బిగిస్తున్నారు. శ్రీనివాసన్ బృందం కొత్త ఎత్తుగడ ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.