క్రీడాభూమి

గ్రాండ్‌శ్లామ్స్‌లో ‘సాన్-టినా’ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 29: అంతర్జాతీయ ఈవెంట్లలో అప్రతిహతంగా దూసుకెళ్తున్న టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, ఆమె భాగస్వామి మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) గ్రాండ్‌శ్లామ్ పోటీల్లో ‘హ్యాట్రిక్’ టైటిల్ కైవసం చేసుకుని మరోసారి సత్తా చాటుకున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహిళల డబుల్స్ ఫైనల్‌లో శుక్రవారం వీరు చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఏడోసీడ్ ఆండ్రియా హ్లవకోవా, లూసీ హ్రాడెకా జోడీని వరుస సెట్ల తేడాతో మట్టికరిపించి వరుసగా మూడో గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ టోర్నీలో టాప్ సీడ్ జోడీగా బరిలోకి దిగిన సానియా-హింగిస్ (సాన్-టినా) 105 నిమిషాల పాటు సాగిన ఫైనల్ పోరులో 7-6, 6-3 తేడాతో ప్రత్యర్థులను మట్టికరిపించి టైటిల్ విజేతలుగా నిలిచారు. గత ఏడాది వింబుల్డన్, యుఎస్ ఓపెన్ టోర్నీల్లో విజేతలుగా నిలిచిన సానియా-హింగిస్ జోడీకి ఇది వరుసగా మూడో గ్రాండ్‌శ్లామ్ టైటిల్. సానియా-హింగిస్ వరుసగా ఎనిమిది టైటిళ్లు కైవసం చేసుకోవడంతో పాటు వరుసగా 36 మ్యాచ్‌లలో విజయం సాధించినట్లయింది. గత ఏడాది యుఎస్ ఓపెన్‌తో మొదలు పెట్టి వరుసగా ఐదు టైటిళ్లు సాధించిన సానియా-హింగిస్ ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతలుగా ఆవిర్భవించడానికి ముందు బ్రిస్బేన్, సిడ్నీ ఈవెంట్లలో మరో రెండు టైటిళ్లు కైవసం చేసుకున్న విషయం విదితమే. 2009లో మహేష్ భూపతితో కలసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న సానియా మీర్జాకు ఈ టోర్నీలో ఇది రెండో టైటిల్.
అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్‌లో సానియా-హింగిస్ విజేతలుగా నిలిచినప్పటికీ ఫైనల్‌లో వారికి చెక్ రిపబ్లిక్ జోడీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో విజయం కోసం సానియా-హింగిస్ తీవ్రస్థాయిలో శ్రమించాల్సి వచ్చింది. బేస్‌లైన్ వద్ద నుంచి హ్లవకోవా చక్కటి ప్రదర్శనతో అలరించడం, నెట్‌వద్ద హ్రాడెకా అద్భుత స్థాయిలో విజృంభించడంతో ఆరంభం నుంచే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. అయినప్పటికీ 7-6(1) తేడాతో ఆ సెట్‌ను కైవసం చేసుకున్న సానియా-హింగిస్ రెండో సెట్‌లో పవర్‌ఫుల్ షాట్లతో మరింత విజృంభించి ఆడారు. ఫలితంగా 6-3 తేడాతో ఆ సెట్‌లో కూడా ప్రత్యర్థులను మట్టికరిపించారు. ఈ విజయంతో వరుసగా మూడో గ్రాండ్‌శ్లామ్ టైటిల్ కైవసం చేసుకున్న సానియా-హింగిస్ కెరీర్ గ్రాండ్‌శ్లామ్ కిరీటానికి మరో అడుగు దూరంలో నిలిచారు.
మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా జోడీ ఓటమి
ఇదిలావుంటే, ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా జోడీ పోరాటం ముగిసింది. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డోడిగ్‌తో కలసి ఈ విభాగంలోనూ టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సానియా శుక్రవారం సాయంత్రం జరిగిన సెమీఫైనల్‌లో వరుస సెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఏడో సీడ్ జోడీ ఎలెనా వెస్నినా-బ్రూనో సోరెస్‌లతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-డోడిగ్ 5-7, 6-7(4) తేడాతో ఓటమిపాలయ్యారు.