క్రీడాభూమి

జొకోవిచ్‌కు ఇస్టోమిన్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 19: ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్ ఆటగాడు డెనిస్ ఇస్టోమిన్ 7-6, 5-7, 2-6, 7-6, 6-4 తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసి, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో మొదటి అనూహ్య ఫలితాన్ని సాధించాడు. రాడ్ లవెర్ ఎరినాలో 4 గంటల 48 నిమిషాలు జరిగిన ఈ పోరు ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. మొదటి సెట్‌ను అతి కష్టం మీద గెలిచిన ఇస్టోమిన్ ఆతర్వాత వరుసగా రెండు సెట్లను కోల్పోయాడు. దీనితో జొకోవిచ్ ఫామ్‌లోకి వచ్చాడని, ప్రత్యర్థిని సులభంగానే ఓడిస్తాడని అభిమానులు ఆశించారు. అయితే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 117వ స్థానంలో ఉన్న ఇస్టోమిన్ ఎవరి అంచనాలకూ అందని రీతిలో ఎదురుదాడికి దిగాడు. చివరి రెండు సెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఎనిమిదేళ్ల తర్వాత..
జొకోవిచ్ సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీ రెండో రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించాడు. మొదటిసారి 2008 వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ రెండో రౌండ్‌లో మారత్ సఫిన్ చేతిలో ఓడాడు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ‘టాప్-100’లో కూడా చోటు దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లను ఢీకొని పరాజయాన్ని ఎదుర్కోవడం గత ఏడు సంవత్సరాల్లో జొకోవిచ్‌కు ఇది రెండోసారి. నిరుడు రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో అతనిని 145వ ర్యాంక్ ఆటగాడు జువాన్ మార్టిన్ డెల్ పొట్రో ఓడించాడు. ఇప్పుడు 117వ స్థానంలో ఉన్న డెనిస్ ఇస్టోమిన్ అతనిని ఇంటిదారి పట్టించాడు.
నిరుడు ఇదే టోర్నీ నాలుగో రౌండ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు గిలెస్ సిమోన్‌తో సుమారు నాలుగున్నర గంటలు పోరాడి, అతి కష్టం మీద గెలిచిన జొకోవిచ్ ఈసారి ఇస్టోమిన్‌తో అదే స్థాయిలో సర్వశక్తులు కేంద్రీకరించినప్పటికీ ఫలితం లేకపోయింది. నిరుడు మారథాన్ మ్యాచ్‌ని గెలిచి, అదే ఊపులో టైటిల్‌ను కూడా సాధించిన అతను ఈసారి రెండో రౌండ్‌లోనే వెనుదిరిగాడు.
కాగా, మూడో ర్యాంక్ ఆటగాడు మిలోస్ రోనిక్ రెండో రౌండ్‌లో గిలెస్ ముల్లర్‌ను 6-3, 6-4, 7-6 తేడాతో ఓడించి మూడో రౌండ్ చేరాడు. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ గేల్ మోన్ఫిల్స్ 6-3, 6-4, 1-6, 6-0 స్కోరుతో అలెగ్జాండర్ డొగ్లొపొలొవ్‌పై గెలిచాడు. ఎనిమిదో సీడ్ డొమినిక్ థియెమ్ 6-2, 6-1, 6-7, 6-4 ఆధిక్యంతో జోర్డాన్ థాంప్సన్‌ను ఓడించి ముందంజ వేశాడు.
రద్వాన్‌స్కా నిష్క్రమణ
మూడో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లోనే ఓటమిపాలైంది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి మిర్జానా లుసిక్ బరోనీ ఆమెను 6-3, 6-2 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. కాగా, సారా ఎరానీ గాయం కారణంగా మ్యాచ్‌ని కొనసాగించలేకపోవడంతో ఎకతరీన మకరోవా మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. రెండో రౌండ్ మొదటి రౌండ్‌ను 6-2 తేడాతో గెల్చుకున్న మకరోవా రెండో సెట్‌లో 3-2 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ దశలో ఎరానీ కండరాల నొప్పి కారణంగా మ్యాచ్ నుంచి వైదొలగింది. 22వ సీడ్ డారియా గవ్రిలొవా 6-2, 1-6, 6-4 ఆధిక్యంతో అనా కొన్జుపై నెగ్గింది.

చిత్రాలు..నొవాక్ జొకోవిచ్, డెనిస్ ఇస్టోమిన్