క్రీడాభూమి

సారథ్యానికి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 6: ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టు సారథ్య బాధ్యతలకు ఆలిస్టర్ కుక్ గుడ్‌బై చెప్పాడు. రికార్డు స్థాయిలో ఇంగ్లాండ్‌కు 59 టెస్టుల్లో సారథ్యం వహించిన తర్వాత అతను కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇది చాలా విచారకరమైన రోజని, అయినప్పటికీ ఈ నిర్ణయం వలన వ్యక్తిగతంగా తనతో పాటు జట్టుకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని అతను చెప్పాడు. టెస్టుల్లో మొత్తం 11,057 పరుగులు సాధించి ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో లీడింగ్ స్కోరర్‌గా ఖ్యాతి పొందిన కుక్ 2012 ఆగస్టులో సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత గడ్డపై 2013లోనూ, అలాగే 2015లోనూ తమ జట్టుకు ప్రతిష్టాత్మక యాషెస్ ట్రోఫీలను అందించడంతో పాటు భారత్, దక్షిణాఫ్రికాల్లో సిరీస్ విజయాలను అందించిన విషయం విదితమే. అయితే ఇంగ్లాండ్ జట్టుకు సారథ్యం వహించే అవకాశాన్ని పొంది టెస్టుల్లో గత ఐదేళ్లుగా జట్టును ముందుకు నడిపించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కుక్ (32) ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాలన్న తన నిర్ణయం కఠినమైనదేనని, అయినప్పటికీ ఈ నిర్ణయం సరైనదేనని, దీని వలన తనతో పాటు జట్టుకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని అతను తెలిపాడు. 2010 నుంచి 2014 మధ్య కాలంలో ఇంగ్లాండ్‌కు 69 అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లలో కూడా కెప్టెన్‌గా వ్యవహరించిన కుక్ ఆ దేశానికి అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించడంతో పాటు అంతకుముందున్న కెప్టెన్లందరి కంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేశాడు. 2012లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గానూ, 2013లో ఐసిసి వరల్డ్ టెస్టు కెప్టెన్‌గానూ ఎంపికైన ఆలిస్టర్ కుక్ ఆదివారం తన సారథ్య బాధ్యతలకు రాజీనామా చేసి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) చైర్మన్ కోలిన్ గ్రావెస్‌కు ఆ లేఖను సమర్పించాడు. అయితే కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినప్పటికీ ఇంగ్లాండ్ జట్టులో ఆటగాడిగా కొనసాగుతూ పూర్తిస్థాయిలో సేవలు అందించాలని భావిస్తున్నట్లు అతను స్పష్టం చేశాడు. ‘వ్యక్తిగతంగా ఇది చాలా విచారకరమైన రోజు. అయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు సారథిగా బాధ్యతలు నిర్వర్తించడంలో నాకు సంపూర్ణ సహకారాలను అందజేసిన సహచర సభ్యులు, కోచ్‌లు, సపోర్టింగ్ స్ట్ఫాతో పాటు ఎప్పుడూ మా వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని కుక్ పేర్కొన్నాడు.
గత ఏడాది చివర్లో భారత పర్యటన సందర్భంగా టీమిండియాతో ఆడిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 0-4 తేడాతో ఘోర పరాజయం పాలవడం కుక్ రాజీనామాకు దారితీసిన కారణాల్లో ప్రధానమైనది. దీంతో కుక్ స్థానంలో తమ జట్టుకు తగిన కొత్త సారథిని ఎంపిక చేసే ప్రక్రియ ప్రారంభమైందని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇప్పటివరకూ కుక్ ఎంతో విశిష్టమైన సేవలు అందించాడని, దేశంలోని మేటి కెప్టెన్లలో ఒకడిగా పరిగణించేందుకు కుక్ అన్నివిధాలుగా అర్హుడని ఇంగ్లాండ్ క్రికెట్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ ఉద్ఘాటించాడు. ప్రస్తుతం తాము జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించామని, గతంలో అడపా దడపా జట్టుకు సారథ్యం వహించిన పలువురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ తదుపరి కెప్టెన్ ఎంపిక విషయమై ఇప్పటివరకూ వారితో మాట్లాడలేదని, ఇకమీదట దీని గురించి జట్టులోని సభ్యులందరితో అరమరికలు లేకుండా చర్చిస్తామని ఆయన చెప్పాడు. ఏది ఏమైనప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఈ నెల 22వ తేదీన వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరే లోగానే కొత్త కెప్టెన్ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నామని స్ట్రాస్ తెలిపాడు. ఇదిలావుంటే, ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టు తదుపరి కెప్టెన్‌గా పలువురు ఆటగాళ్ల పేర్లు తెరమీదికి వస్తున్నప్పటికీ యార్క్‌షైర్ బ్యాట్స్‌మన్ జో రూట్ రేసులో అందరి కంటే ముందున్నట్లు తెలుస్తోంది.