క్రీడాభూమి

చుక్కలు చూపిస్తున్న పిచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఫిబ్రవరి 27: మన దేశంలోని కొన్ని పిచ్‌లు క్రికెటర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అలాంటి వాటిలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) మైదానం ఒకటి. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ 333 పరుగుల భారీ తేడాతో ఓడింది ఈ పిచ్‌పైనే. స్పిన్‌కు అనుకూలంగా రూపొందించిన పిచ్‌పై భారత స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆస్ట్రేలియా స్పిన్నర్లు స్టీవ్ ఒకీఫ్, నాథన్ లియాన్ మాత్రం ఈ పిచ్ స్వభావాన్ని తమకు కనుకూలంగా మార్చుకొని, విరాట్ కోహ్లీ సేనను చిత్తుచేశారు. ఒకీఫ్ ఒక్కో ఇన్నింగ్స్‌లో ఆరు చొప్పున మొత్తం 12 వికెట్లు పడగొట్టి, టీమిండియా ఓటమిని శాసించాడు. ఫలితం ఎవరికి అనుకూలంగా మారిందనే విషయాన్ని పక్కకుపెడితే, బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితిని కల్పించే పిచ్‌లు దేశంలో చాలానే ఉన్నాయి. అనూహ్య ఫలితాలకు కేంద్రంగా నిలిచే మైదానాల్లో ముంబయిలోని వాంఖడే స్టేడియానిది అగ్రస్థానం. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2004 నవంబర్‌లో జరిగిన నాలుగో టెస్టును ఇందుకు ఉదాహరణగా పేర్కోవచ్చు. మొదటి రోజు ఆట వర్షం కారణంగా రద్దుకాగా, రెండో రోజు నుంచి ఆట మొదలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 41.3 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. జాసన్ గిలెస్పీ 4, మైఖేల్ కాస్ప్రోవిజ్ 2, మార్టిన్ హౌరిజ్ 3 చొప్పున వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 203 పరుగులు చేసింది. అనిల్ కుంబ్లే 5, మురళీ కార్తీక్ 4 వికెట్లు కూల్చారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసింది. వివిఎస్ లక్ష్మణ్, సచిన్ తెండూల్కర్ అర్ధ శతకాలు సాధించడంతో టీమిండియాకు ఈ స్కోరు సాధ్యమైంది. అప్పటి ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కేవలం తొమ్మిది పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. మొత్తం మీద ప్రత్యర్థి ముందు టీమిండియా 107 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. కానీ, బంతి అనూహ్యంగా దిశను మార్చుకొని, విపరీతమైన స్పిన్ కావడంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్ పరుగులకు ఇబ్బంది పడ్డారు. అత్యంత సాదాసీదా లక్ష్యాన్ని కూడా అందుకోలేక, 30.5 ఓవర్లలో 93 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. ఈ పిచ్ తీరుపై క్లార్క్ నిప్పులు చెరిగాడు. అసలు ఇలాంటి మైదానాన్ని టెస్టుకు ఎంపిక చేయకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వాంఖడే స్టేడియంలోనే, 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 327 పరుగులకు ఆలౌటైంది. చటేశ్వర్ పుజారా శతకాన్ని సంధించగా, మాంటీ పనేసర్ ఐదు, గ్రేమ్ స్వాన్ నాలుగు చొప్పున వికెట్లు పడగొట్టారు. భారత్ స్కోరుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 413 పరుగులు చేసింది. కెప్టెన్ అలస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్ సెంచరీలు సాధించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు వెనుకబడిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. గౌతం గంభీర్ (54), రవిచంద్రన్ అశ్విన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగా, మిగతా వారంతా సింగిల్ డిజిట్స్ వద్దే ఆగిపోయారు. ఫలితంగా 142 పరుగులకే ఆలౌటైంది. మాంటీ పనేసర్ ఆరు, గ్రేమ్ స్వాన్ నాలుగు వికెట్లు కూల్చారు. 57 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండా అందుకొని, పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అంతకు ముందు ఎనిమిదేళ్ల క్రితం ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఎదుర్కొన్న సమస్యలే ఈసారి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ముంచేశాయి.
దక్షిణాఫ్రికా 2008లో భారత్‌లో పర్యటించినప్పుడు ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌ని డ్రా చేసుకొని 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. సిరీస్‌ను కైవసం చేసుకునే ఊపుమీద కనిపించిన ఆ జట్టుకు చివరిదైన మూడో టెస్టులో చుక్కెదురైంది. కాన్పూర్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్ గ్రేమ్ స్మిత్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికాకు ఓ పీడ కలగా మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులు సాధించింది. కెప్టెన్ స్మిత్ (69), షహీం ఆమ్లా (51) హాఫ్ సెంచరీలు చేశారు. ఇశాంత్ శర్మ, హర్భజన్ సింగ్ చెరి మూడు వికెట్లు పడగొట్టగా, పీయూష్ చావ్లా రెండు వికెట్లు కూల్చాడు. ఆతర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. వివిఎస్ లక్ష్మణ్ (50), సౌరవ్ గంగూలీ (87) అర్ధ శతకాలు నమోదు చేశారు. డేల్ స్టెయిన్, మోర్న్ మోర్కెల్, పాల్ హారిస్ తలా మూడేసి వికెట్లు సాధించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు వెనుకబడిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. స్మిత్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎవరూ ఊహించని రీతిలో స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై హర్భజన్ సింగ్ నాలుగు వికెట్లు పడగొడితే, పార్ట్‌టైమ్ స్పిన్నర్ వీరేందర్ సెవాగ్‌కు మూడు వికెట్లు లభించాయి. ఇశాంత్ శర్మ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 61 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ రెండు వికెట్లు కోల్పోయి, ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. కాన్పూర్ పిచ్‌ని నాసిరకంగా రూపొందించారంటూ స్మిత్ మండిపడ్డాడు.
దక్షిణాఫ్రికాతోనే 2015లో మొహాలీ, జంతా (నాగపూర్)లో జరిగిన టెస్టులు కూడా బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసిరి, మూడు రోజుల్లోనే ముగిశాయి. మొహాలీలో జరిగిన టెస్టులో భారత్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకు పరిమితం చేశామన్న ఆనందం దక్షిణాఫ్రికాకు ఎక్కువ సేపు నిలవలేదు. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 184 పరుగులకే ఆలౌటైంది. కొత్త బంతితో బౌల్ చేసిన స్పిన్నర్ అశ్విన్ ఐదు వికెట్లు కూల్చాడు. రవీంద్ర జడేజా మూడు, అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీసుకున్నారు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. 218 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 109 పరుగులకే చాప చుట్టేసింది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొడితే, అశ్విన్‌కు మూడు వికెట్లు దక్కాయి.
నాగపూర్‌లో జరిగిన మూడో టెస్టులోనూ దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తప్పలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 215 పరుగులు చేస్తే, అందుకు సమాధానంగా దక్షిణాఫ్రికా 79 పరుగులకే ఆలౌటైంది. జెపి డుమినీ ఒంటరి పోరాటాన్ని కొనసాగించి 35 పరుగులు చేసి ఉండకపోతే, ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అతి కష్టం మీద 173 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మాదిరిగానే టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా పరుగుల కోసం నానా తంటాలు పడ్డారు. ఇమ్రాన్ తాహిర్‌కు ఐదు వికెట్లు లభించాయి. 310 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా 185 పరుగులకు ఆలౌటైంది. భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించడంలో అశ్విన్ (7 వికెట్లు), అమిత్ మిశ్రా (3 వికెట్లు) కీలక పాత్ర పోషించాడు. ఇది కూడా మూడు రోజుల్లో ముగిసిన మ్యాచే. బ్యాట్స్‌మెన్ సామర్థ్యానికి పరీక్షపెట్టే పిచ్‌లు మన దేశంలో కొత్తేమీ కాదు. పుణే పిచ్ వాటిలో ఒకటి. అయితే, చాలా వరకు భారత పిచ్‌లపై విదేశీ జట్లు తంటాలు పడితే, పుణేలో టీమిండియానే చావు దెబ్బతిన్నది.

చిత్రం..ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చావుదెబ్బతిన్న
పుణెలోని ఎంసిఎ క్రికెట్ స్టేడియం