క్రీడాభూమి

సత్తా చాటిన జీతూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నమెంట్ పురుషుల 50 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో భారత షూటర్ జీతూ రాయ్ మరోసారి అద్భుతంగా విజృంభించి పసిడి పతకంతో సత్తా చాటుకున్నాడు. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం. మంగళవారం 10 మీటర్ల ఎయిర్ పిస్తోలు ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జీతూ రాయ్ బుధవారం 50 మీటర్ల పిస్తోలు ఈవెంట్ ఫైనల్‌లో మరింత విజృంభించాడు. మొత్తం 230.1 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు పోడియంపై అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా, ఇదే ఈవెంట్‌లో భారత్‌కే చెందిన మరో షూటర్ అమన్‌ప్రీత్ సింగ్ 226.9 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకోగా, ఇరాన్‌కు చెందిన వహీద్ గోల్ఖందన్ 208 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
ఈ ఈవెంట్ ఫైనల్‌లో తొలి రెండు సిరీస్‌లు (ఒక్కో సిరీస్‌లో ఐదు షాట్లు) పూర్తయే సరికి జీతూ రాయ్ 93.8 పాయింట్లతో ఆరో స్థానంలో నిలవగా, పంజాబ్‌కు చెందిన అమన్‌ప్రీత్ 98.9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పుంజుకునేందుకు జీతూ రాయ్ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ వరుసగా హైస్కోర్లు సాధించి అమన్‌ప్రీత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అయితే కీలకమైన ఎలిమినేషన్ దశలోని ఒక రౌండ్‌లో అనూహ్యంగా విజృంభించి 10.8 పాయింట్లు సాధించి ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి దూసుకెళ్లిన జీతూ రాయ్ ఆ తర్వాత 10.5 పాయింట్లతో కజకిస్తాన్‌కు చెందిన ప్రముఖ షూటర్ వ్లాదిమిర్ ఇసాచెంక్‌ను చిత్తు చేశాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన జీతూ రాయ్ ఒకసారి 10.4, మరోసారి 10 చొప్పున పాయింట్లు సాధించి కెరీర్‌లో తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన అమన్‌ప్రీత్ ఆశలను నీరుగార్చాడు. అనంతరం గోల్డ్ మెడల్ రౌండ్‌లో మరోసారి మెరుగైన ప్రదర్శనతో 10.5 పాయింట్లు సాధించి అమన్‌ప్రీత్‌తో పాటు గోల్ఖందన్‌ను వెనక్కి నెట్టిన జీతూ రాయ్ పసిడి పతకాన్ని చేజిక్కించుకున్నాడు.
కాగా, స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సొంత అభిమానుల సమక్షంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం అమితమైన సంతోషాన్ని కలిగిస్తోందని, పోడియంపై అగ్రస్థానంలో మన త్రివర్ణ పతాకం సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేయగలగడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానని జీతూ రాయ్ హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఈవెంట్ ఫైనల్ ఆరంభంలో ప్రత్యర్థుల కంటే తాను ఎంతో వెనుకబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయట పడటాన్ని ఎంతగానో ఆస్వాదించానని అతను చెప్పాడు.
నిరాశపర్చిన మహిళా షూటర్లు
అయితే మహిళల విభాగంలో భారత షూటర్లు బుధవారం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చారు. ఈ పోటీల్లో రష్మీ రాథోర్ 17వ స్థానంలోనూ, ఆర్తీ సింగ్ రావు 24వ స్థానంలోనూ, సానియా షేక్ 27వ స్థానంలోనూ నిలవడమే ఇందుకు కారణం. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్తోలు ఈవెంట్‌లో థాయిలాండ్‌కు చెందిన నపాస్వన్ యాంగ్‌పైబూన్ 38 పాయింట్ల స్కోరుతో పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, చైనా షూటర్ జింగ్లింగ్ జంగ్ (30 పాయింట్లు) రజతాన్ని, మిషెల్లీ స్కెరియస్ (27 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
రోడ్ ప్రపంచ రికార్డు
అలాగే మహిళల స్కీట్‌లో అమెరికాకు చెందిన లెజెండరీ షూటర్ కింబర్లీ రోడ్ 56 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరుతో పసిడి పతకాన్ని కైవసం చేసుకోగా, థాయిలాండ్‌కు చెందిన సుతియా (51 పాయింట్లు) రతజతాన్ని, న్యూజిలాండ్ షూటర్ చోల్ టిప్లే (42 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.