క్రీడాభూమి

పోరాటయోధుడికి ఆల్ ఇంగ్లాండ్ కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, మార్చి 13: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెల్చుకున్న డిఫెండింగ్ చాంపియన్ లీ చాంగ్ వెయ్ తాను పోరాట యోధుడినని నిరూపించుకున్నాడు. మలేసియాకు చెందిన ఈ సూపర్ స్టార్ ఫైనల్‌లో షి యుకీని 21-12, 21-10 తేడాతో చిత్తుచేసి, ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో నాలుగోసారి విజేతగా నిలిచాడు. ఇది ఓపెన్ టోర్నీగా మారిన తర్వాత, టైటిల్ సాధించిన ఆటగాళ్లలో ఎక్కువ వయసున్న వాడిగా 34 ఏళ్ల చాంగ్ వెయ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. అతను విజయం సాధించిన వెంటనే వేలాది మంది ప్రేక్షకులు నిలబడి హర్షధ్వానాలతో అతనికి జేజేలు పలికారు. ఇందుకు కారణం లేకపోలేదు. సుమారు నెల రోజుల క్రితం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చాంగ్ వెయ్ కాలి పిక్కల్లో కండరాలు చిట్లాయి. గాయం తీవ్రతను పరీక్షించిన వైద్యులు కనీసం మూడు నెలలు విశ్రాంతి అవసరమని స్పష్టం చేశారు. కోచ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అప్పటికి ఆల్ ఇంగ్లాండ్ టోర్నీకి మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో, అతను వైదొలగడం ఖాయమని అంతా ముక్తకంఠంతో అన్నారు. కానీ, పట్టుదలకు మారుపేరైన చాంగ్ వెయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ బర్మింగ్‌హామ్ వెళ్లాలని, డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి, టైటిల్‌ను నిలబెట్టుకోవడాలని పట్టుదలతో శ్రమించాడు. అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతూ, మూడు వారాల్లోనే కోలుకున్నాడు. టోర్నమెంట్ ఆరంభానికి ముందు మరోసారి పరీక్షలు జరిపిన వైద్యులు సైతం అతను కోలుకున్న విధానాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, అతని గాయం పూర్తిగా నయంకాలేదని, టోర్నమెంట్‌లో ఆడితే ఒత్తిడి పెరిగి తిరగబెట్టే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేశారు. కానీ, ఆల్ ఇంగ్లాండ్ టోర్నీలో ఆడాలన్న తన ఆలోచనను చాంగ్ వెయ్ విరమించుకోలేదు. నొప్పి నూరుశాతం తగ్గకపోయినా, బాధను భరిస్తూనే ఆల్ ఇంగ్లాండ్ టోర్నీకి హాజరయ్యాడు. ఒక్కో రౌండ్‌ను అధిగమించడానికి అతను చూపిన పోరాటపటిమ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఫైనల్‌లో ప్రత్యర్థిని వరుస సెట్లలో ఓడించి టైటిల్ సాధించడం చాంగ్ వెయ్‌ని హీరోగా నిలబెట్టింది.
మహిళా విజేత జూ ఇంగ్
మహిళల సింగిల్స్ టైటిల్‌ను తాయ్ జూ ఇంగ్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఆమె రచానొక్ ఇంతనాన్‌ను 21-16, 22-20 తేడాతో ఓడించింది. కాగా, పురుషు డబుల్స్ టైటిల్‌ను మార్కస్ ఫెర్నాల్డీ గిడియాన్, కెవిన్ సంజయ సుకముజో జోడీ గెల్చుకుంది. వీరు ఫైనల్‌లో లీ జున్‌హుయ్, లియూ యూచెన్ జోడీని 21-19, 21-14 ఆధిక్యంతో ఓడించారు. మహిళల డబుల్స్‌లో కమిల్లా రైటర్ జూహీ, క్రిస్టిన్నా పెడెర్సన్ జోడీని 21-18, 21-13 తేడాతో చిత్తుచేసిన చాంగ్ యేనా, లీ సో హీ జోడీ టైటిల్‌ను అందుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో లీ కాయ్, హువాంగ్ యాక్వియాంగ్ జోడీ 18-21, 21-19, 21-16 స్కోరుతో చాన్ పెంగ్ సూన్, జో లియో ఇంగ్ జోడీని ఓడించి విజేతగా నిలిచింది.

చిత్రం.. ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ నిలబెట్టుకున్న లీ చాంగ్ వెయ్ (ఇన్‌సెట్‌లో) మహిళల సింగిల్స్ విజేత తాయ్ జూ ఇంగ్