క్రీడాభూమి

యుద్ధమైదానాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌంట్ డౌన్ 1
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. ఈ టోర్నీలో రాణించడం ద్వారా జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని కొందరు, ఇప్పటికే జాతీయ జట్టులో ఉన్నప్పటికీ తమతమ స్థానాలను పదిలం చేసుకోవాలని మరికొందరు సర్వశక్తులు ఒడ్డుతుంటారు. దీనికితోడు ఫ్రాంచైజీలు తమ కాంట్రాక్టును పొడిగించాలని, మళ్లీ వేలానికి వెళ్లకూడదని దాదాపు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఒకవేళ ఫ్రాంచైజీలకు తనపై ఆసక్తి లేకపోతే, డిమాండ్ తగ్గకుండా ఉండేందుకు సత్తాను చాటాలని ఉవ్విళ్లూరుతారు. అందుకే, ప్రతి ఆటగాడూ మిగతా వారిని ప్రత్యర్థులుగానే చూస్తాడు. తన డిమాండ్‌కు లేదా కెరీర్‌కు అడ్డుగోడగా నిలుస్తున్నారనే అనుమానిస్తాడు. ఇతర దేశాల లేదా ఇతర జట్ల ఆటగాళ్లతోనేకాదు.. తన దేశానికి చెందిన లేదా తన జట్టులోని ఆటగాళ్లతో కూడా అమీతుమీకి సిద్ధమవుతాడు. మొత్తానికి ఆటగాళ్ల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరాటమే ఐపిఎల్ మ్యాచ్‌లను యుద్ధ మైదానాలుగా మార్చేస్తున్నది. స్పాట్ బెట్టింగ్, బెట్టింగ్ వంటి వివాదాలతోనేకాదు.. ఆటగాళ్ల మధ్య వాగ్వాదాలకు, బాహాబాహీకి కూడా ఐపిఎల్ వేదికగా మారింది. హర్భజన్ సింగ్ చేతిలో చెంప దెబ్బతిన్న శ్రీశాంత్ క్రికెట్ మైదానంలోనే ఏడవడం, విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ ముష్ఠి యుద్ధానికి సిద్ధం కావడం వంటి ఎన్నో సంఘటనలు ఐపిఎల్ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో చోటు చేసుకున్న సంఘటనలు ఈసారి ఐపిఎల్‌లో చోటుచేసుకోబోయే పరిణామాలకు అద్దం పడుతున్నాయి. ఈ సిరీస్‌లో ఆడిన ఇరు జట్లకు చెందిన చాలా మంది ఆటగాళ్లు ఐపిఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగుతున్నారు. మునుపటి మాదిరిగానే ఐపిఎల్ మ్యాచ్‌ల్లో ఘర్షణలు తప్పవా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భజ్జీ నంబర్ వన్
మైదానంలో దురుసుగా ప్రవర్తించడంలో, వివాదాలను సృష్టించడంలో సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను నంబర్ వన్‌గా పేర్కోవాలి. ముంబయి తరఫున ఆడుతున్న భజ్జీ 2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌ను చెంప దెబ్బ కొట్టిన సంఘటన సంచలనం సృష్టించింది. శ్రీశాంత్ మైదానంలోనే ఏడవడం, మిగతా ఆటగాళ్లు అతనిని సముదాయించడం టీవీలో ప్రత్యక్షంగా చూసిన వారికి భజ్జీ వైఖరి ఏమిటో స్పష్టమైంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన భజ్జీ ఆ కోపాన్ని శ్రీశాంత్‌పై చూపాడన్నది అందరికీ తెలిసిన నిజం. సంవత్సరాలు గడుస్తున్నా అతనిలో ఏమాత్రం మార్పు రాలేదని నిరుటి ఐపిఎల్‌లో మరోసారి రుజువైంది. ప్రత్యర్థులతోనేకాదు.. తన జట్టు ఆటగాళ్లపైన కూడా హర్భజన్ దరుసుగా ప్రవర్తిస్తాడన్న నిజం బట్టబయలైంది. మార్చి 29న రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భజ్జీ వేసిన ఒక బంతిని సౌరభ్ తివారీ బలంగా బౌండరీ దిశగా కొట్టాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అంబటి రాయుడు డైవ్ చేసి, బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలంకాగా, బంతి బౌండరీ లైన్ దాటింది. రాయుడు కృషిని అభినందించడానికి బదులు భజ్జీ అతనిపై విరుచుకుపడ్డాడు. పరుష పదజాలంతో కించపరిచాడు. రాయుడు కూడా గట్టిగానే సమాధానం చెప్పడంతో, ఇరువురి మధ్య బాహాబాహీ తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, మిగతా ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో, ఒక అసహ్యకరమైన సంఘటన నుంచి ఐపిఎల్ బయటపడింది. కానీ, భజ్జీ నైజం ఎమిటో మళ్లీ బహిర్గతమైంది.
గంభీర్ వర్సెస్ కోహ్లీ!
ఐపిఎల్ టోర్నీలో చోటు చేసుకున్న ఘర్షణల్లో గౌతం గంభీర్, విరాట్ కోహ్లీ ఉదంతం కూడా అభిమానులను ఆందోళనకు గురి చేసింది. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ, జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన గంభీర్ ఢిల్లీ ఆటగాళ్లే. ఐపిఎల్‌లో కోహ్లీ రాజస్థాన్ రాయల్స్‌కు, గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. 2013లో ఈరెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్ కొట్టుకునే వరకూ వెళ్లారు. అప్పటికే రెండు సిక్సర్లు కొట్టి, లక్ష్మీపతి బాలాజీ బంతిని మరోసారి సిక్స్‌గా మార్చేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. కానీ, బౌండరీ వద్ద ఇయాన్ మోర్గాన్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ అవుటయ్యాడు. బెంగళూరు కెప్టెన్ పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో, కోల్‌కతా కెప్టెన్ గంభీర్‌సహా ఆటగాళ్లంతా కేరింతలు కొట్టారు. దీనితో ఆగ్రహించిన కోహ్లీ తిట్లు లంకించుకున్నాడు. గంభీర్ ఎదురుతిరగడంతో పరిస్థితి కొట్టుకునే వరకూ వెళ్లింది. ఢిల్లీలో వీరి సహచరుడైన రజత్ భాటియా జోక్యం చేసుకొని సర్దిచెప్పకపోతే, కోహ్లీ, గంభీర్ ఒకరిపై ఒకరు ముష్ఠిఘాతాలతో విరుచుకపడేవారేమో!
ద్రవిడ్‌కూ తప్పలేదు..
అంతర్జాతీయ కెరీర్‌లోనే అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న ఆటగాడు రాహుల్ ద్రవిడ్. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు అతను ఘర్షణ పడిన సందర్భాలు దాదాపు లేవు. అలాంటి క్రికెటర్‌ను కూడా వివాదాల్లోకి లాగిన ఘనత ఐపిఎల్‌కే దక్కుతుంది. 2013లో, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ద్రవిడ్ నాయకత్వం వహిస్తున్నప్పుడు చోటు చేసుకున్న సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్, మానవీందర్ బిస్లా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, షేన్ వాట్సన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు వివాదం చోటు చేసుకుంది. వాట్నస్ బౌలింగ్‌లో బిస్లా వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. దీనితో కొపం తెచ్చుకున్న వాట్సన్ అతనిని ఉద్దేశించి పరుషంగా మాట్లాడాడు. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న గంభీర్‌కు వాట్సన్ తిడుతున్న విషయాన్ని చెప్పాడు. వెంటనే స్పందించిన గంభీర్ ఈ వివాదానికి కారణమైన వాట్సన్‌ను విడిచిపెట్టి, రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ద్రవిడ్‌తో వాదనకు దిగాడు. బిస్లా కూడా గంభీర్‌కు తోడుగా వచ్చారు. ఇద్దరూ కలిసి అసభ్యకరంగా మాట్లాడడంతో, ఒకానొక దశలో ద్రవిడ్ నిగ్రహం కోల్పోయాడు. అతను ఎదురుతిరగడంతో, పరిస్థితిని గమనించిన అంపైర్లు, మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. ద్రవిడ్ ఈ విధంగా ఆగ్రహించిన సంఘటన బహుశా అదొక్కటే కావచ్చు.
ఐపిఎల్‌లో యుద్ధ వాతారణాన్ని సృష్టించిన సంఘటనల్లో మొట్టమొదటి ఐపిఎల్ (2008)లో షేన్ వాట్సన్, సౌరవ్ గంగూలీ మధ్య ఘర్షణను తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. కోల్‌కతా నైట్ రైడర్స తరఫున ఆడుతున్న గంగూలీ బలంగా కొట్టిన బంతిని డీప్ మిడ్‌వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తన్న గ్రేమ్ స్మిత్ క్యాచ్ పట్టుకున్నాడు. అయితే, బంతి నేలకు తగిలిన తర్వాతే దానిని గ్రేమ్ స్మిత్ ఒడిసిపట్టాడని గంగూలీ అనుమానించాడు. అంపైర్‌పై ఒత్తిడి తేవడంతో, అతను థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని కోరాడు. యాక్షన్ రీ-ప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ గంగూలీని నాటౌట్‌గా ప్రకటించాడు. అదే సమయంలో రాజస్థాన్ బౌలర్ వాట్నస్, గంగూలీ మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరూ మాటల స్థాయిని దాటి, చేతల వరకూ వెళ్లడంతో అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. 2012లో అంబటి రాయుడు, హర్షల్ పటేల్, 2013లో కీరన్ పొలార్డ్, షేన్ వాట్సన్, 2014లో కీరన్ పొలార్డ్, మిచెల్ స్టార్క్ మధ్య జరిగిన ఘర్షణలు కూడా ఐపిఎల్‌లో తరచు కనిపించే యుద్ధ వాతావరణానికి అద్దం పడతాయి. పలు వివాదాలకు కారణమైన పొలార్డ్ 2014లో నోటికి ప్లాస్టర్ అంటించుకొని మ్యాచ్ ఆడి, ఐపిఎల్ ఘర్షణలకు కొత్త మలుపునిచ్చాడు. పొలార్డ్ నిరసన వ్యక్తం చేయడంలో చూపించిన కొత్తతనం మిగతా వారిని కూడా ఆకట్టుకుంటే, ఐపిఎల్‌లో ఒకరి ఆటగాళ్ల మధ్య కొట్లాటలు తగ్గే అవకాశాలు మెరుగు పడతాయన్నది వాస్తవం.

చిత్రాలు..

గౌతం గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్), విరాట్ కోహ్లీ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) వాగ్వాదం. ఐపిఎల్‌లో చోటు చేసుకుంటున్న ఘర్షణలకు ఇదో నిదర్శనం. ఐపిఎల్ వివాదాల్లో తరతమ భేదాలు లేకుండా, ప్రతి ఒక్కరూ మరొకరిపై విరుచుకుపడడం ఆనవాయతీగా మారింది. పదో ఐపిఎల్‌లోనూ ఇదే పరిస్థతి కొనసాగే ప్రమాదం లేకపోలేదు

*వివాదాస్పదుడిగా ముద్ర పడిన హర్భజన్ సింగ్

నోటికి ప్లాస్టర్ అంటించుకొని కీరన్ పొలార్డ్ వింత నిరసన