క్రీడాభూమి

హుందాగా ప్రవర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: విభేదాలు లేదా అసంతృప్తులను బహిరంగంగా వ్యక్తీకరించడం సమంజసం కాదని, క్రీడా రంగంలో ఎంతో అనుభవం ఉన్నందున హుందాగా ప్రవర్తించాలనీ లియాండర్ పేస్, మహేష్ భూపతికి అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) హితవు పలికింది. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ ఆసియా/ ఓషియానియా పోటీల్లో డబుల్స్ జట్టు ఎంపికపై పేస్, భూపతి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. భారత డేవిస్ కప్‌కు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న భూపతి డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బొపన్న భాగస్వామిగా పేస్‌ను కాదని, శ్రీరాం బాలాజీని ఎంపిక చేయడం వివాదానికి కారణమైంది. 43 ఏళ్ల పేస్ డేవిస్ కప్ పోటీలకు దూరం కావడం 27 ఏళ్ల సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. ఒకప్పటి తన డబుల్స్ భాగస్వామి భూపతి ఇప్పుడు వ్యక్తిగత కక్షలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని, నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని తనపై ఆయుధంగా ఉపయోగించాడని పేస్ వాపోయాడు. గతంలో వీరిద్దరూ మంచి మిత్రులు. డబుల్స్‌లో భాగస్వాములు. కానీ, క్రమంగా ఒకరికొకరు దూరమయ్యారు. వీరి మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు, వాదోపవాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు ప్రతిసారీ సంచలనం సృష్టించాయి. బద్ధ శత్రువుగా మారిన పేస్‌ను భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఎంపికైన భూపతి ప్రోత్సహించే అవకాశాలు లేవన్న అనుమానం సరైనదేనని అతని చేష్టలు నిరూపించాయి. భూపతి ఎంపిక చేసిన డబుల్స్ జట్టులో పేస్ పేరు కనిపించలేదు. ఇలావుంటే, భూపతి కొట్టిన దెబ్బకు పేస్ తీవ్రంగా స్పందించాడు. జట్టు నుంచి తనను తప్పించడం ఏకపక్ష నిర్ణయమని భూపతిపై మండిపడ్డాడు. తాను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నానన్న విషయాన్ని బెంగళూరు చేరుకోవడానికి కొన్ని రోజుల ముందు మెక్సికోలో జరిగిన టోర్నమెంట్‌లో టైటిల్ సాధించి నిరూపించుకున్నానని వ్యాఖ్యానించాడు. డేవిస్ కప్‌లో రాణించే సామర్థ్యం తనకు ఉన్నప్పటికీ, భూపతి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా, పేస్ వ్యాఖ్యలపై భూపతి ప్రతిస్పందించాడు. నాన్ ప్లేయిన్ కెప్టెన్‌గా తాను జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించానని చెప్పాడు. ఆసియా ఓషియానియా గ్రూప్-1లో ఉజ్బెకిస్తాన్‌ను ఓడించి, ప్లే ఆఫ్ దశకు భారత్ అర్హత సంపాదించాలన్నదే తన లక్ష్యమని, అందుకే, సరైన జట్టునే ఎంపిక చేశానని అన్నాడు. దీనిపై పేస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలావుంటే, పేస్, భూపతి మధ్య కొనసాగిన మాటల యుద్ధాన్ని ఎఐటిఎ సీరియస్‌గా తీసుకుంది. హుందాగా వ్యవహరించాలని ఇరువురికి హితవు పలికింది. డేవిస్ కప్ పోటీలు జరుగుతున్న సమయంలో జట్టు ఎంపికపై పేస్ వ్యాఖ్యలు చేయడం దురదృష్టమని ఎఐటిఎ ప్రధాన కార్యదర్శి హిరణ్మయ్ చటర్జీ అన్నాడు. సోమవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ మ్యాచ్‌లు పూర్తయిన తర్వాతే భూపతి మాట్లాడాడని, ఒక రకంగా ఇది సరైన విధానమని వ్యాఖ్యానించాడు. ఇద్దరితోనూ చర్చిస్తామని, సమస్యలను పరిష్కరించుకోమని సూచిస్తామని పేర్కొన్నాడు. పేస్, భూపతి మధ్య సామరస్యపూర్వక వాతావరణం త్వరలోనే ఏర్పడుతుందన్న ధీమా వ్యక్తం చేశాడు.