క్రీడాభూమి

నారైన్ ఓపెనరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 14: ‘మిస్టీరియస్ స్పిన్నర్’ సునీల్ నారైన్‌ను ఓపెనర్‌గా ఎవరైనా ఊహించగలుగుతారా? ఐపిఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతం గంభీర్‌కు మాత్రమే నారైన్‌లో ఒక బ్యాట్స్‌మన్ కనిపించాడు. క్రిస్ లిన్ గాయం కారణంగా దూరంకావడంతో, అతని స్థానంలో హార్డ్ హిట్టర్‌ను ఓపెనర్‌గా దించాల్సిన అవసరం ఏర్పడింది. అప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌లు గెల్చుకొని, మంచి ఫామ్‌లో ఉన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు సరైన సమాధానం ఇవ్వడానికి రాబిన్ ఉతప్పను కాదని నారైన్‌ను ఎంపిక చేసిన గంధీర్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఇప్పుడు అతని నిర్ణయంపై చర్చ కొనసాగుతున్నది. 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన నారైన్ తాను రెగ్యులర్ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు. 18 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడానికి ప్రతి బౌలర్‌కూ ఒక స్పష్టమైన వ్యూహం ఉంటుంది. బ్యాట్స్‌మెన్ బలాబలాలు తెలుసుకొని, దానికి అనుగుణంగానే బంతులు వేస్తారు. కొందరు స్పిన్‌కు, మరికొందరు స్వింగ్‌కు భయపడతారు. కొంత మంది బౌన్సర్ లేదా షార్ట్‌పిచ్ బంతులను ఎదుర్కోలేక హుక్ షాట్లకు ప్రయత్నించి అవుటవుతారు. స్టంప్స్ నుంచి దూరంగా వెళుతున్న బంతులను వెంటాడి, అనవసరమైన షాట్‌కొట్టి అవుటయ్యేవారు కూడా ఉంటారు. గుడ్‌లెంగ్త్ బంతులకు కొందరు, గుగ్లీలకు మరికొందరు వికెట్లు పారేసుకుంటారు. అయితే, బౌలర్ల వ్యూహాలన్నీ స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌కు మాత్రమే పరిమితం. కానీ, నారైన్ లాంటి టెయిలెండర్ ఏకంగా ఓపెనర్‌గా రావడంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బౌలర్లు కంగుతిన్నారు. అతనికి ఎలాంటి బంతులు వేయాలో అర్థం కాలేదని ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ వాపోయాడు.
ఒక స్పెషలిస్టు బౌలర్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభింప చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. క్రికెట్ మూల సూత్రాలను పక్కకుపెట్టి, ఇలాంటి ప్రయోగాలు చేయడం క్రీడపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ప్రయత్నాలు మంచివేనని, ప్రత్యేకించి టి-20 వంటి ఫార్మాట్స్‌లో ప్రయోగాలు జరగాల్సిందేనని కొంత మంది వాదన. కానీ, ఎక్కువ మంది క్రికెట్ ప్రేమికులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. పేసర్లకు బదులు స్పిన్నర్లతో తొలి ఓవర్లు వేయించడం, ఫాస్ట్, స్పిన్ కాంబినేషన్‌తో మార్పులు తీసుకురావడం, మిడిల్ లేదా లోయర్ మిడిల్ ఆర్డర్‌లో వచ్చేవారికి ప్రమోషన్ ఇవ్వడం వంటి ప్రయోగాలు ఇది వరకు కూడా జరిగాయి. అయితే, ఒక స్పెషలిస్టు బౌలర్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టడం చాలా అరుదు. ఈ వ్యూహం ఎప్పుడూ సత్ఫలితాలనిచ్చే వ్యూహంగా చెప్పడానికి వీల్లేదు. దీనికితోడు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవైపు జాతీయ జట్లలో స్థానం దక్కించుకునేందుకు సరైన వేదికగా ఐపిఎల్‌ను పేర్కొంటున్న క్రికెట్ పెద్దలు మరోవైపు ఇలాంటి దుష్ట సంప్రదాయాలను ప్రోత్సహించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఐపిఎల్ వంటి టి-20 టోర్నీల్లో వినోదం పంచడం అనేది కీలకాంశమైనప్పటికీ, క్రికెట్ మూలాలను నాశనం చేయకూడదన్న వాదనతో ఏకీభవించక తప్పదు. ఇశాంత్ శర్మ వంటి జాతీయ టెస్టు బౌలర్లను బ్యాట్స్‌మన్‌గా తమ జట్టువారే గుర్తించని వెస్టిండీస్ స్పిన్నర్ నారైన్ చితకదడాన్ని చూసి గంభీర్ ఆనందించి ఉండవచ్చు. కానీ, భారత అభిమానులు ఈ పరిణామాన్ని జీర్ణించుకోవడం కష్టం.

చిత్రం..కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన సునీల్ నారైన్