క్రీడాభూమి

ధోనీ బాదేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఏప్రిల్ 22: హోం గ్రౌండ్‌లో శనివారం చివరి బంతి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పుణే సూపర్ జెయింట్స్ ఆరు వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘గ్రేట్ ఫినిషర్’గా పేరు సంపాదించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒకానొక దశలో అసాధ్యగా కనిపించిన లక్ష్యాన్ని పుణే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 176 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా పుణే చివరి బంతి వరకూ పోరాడి, నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌కు ఇది ఏడో మ్యాచ్‌లో మూడో ఓటమికాగా, పుణే జటుటకు ఆరో మ్యాచ్‌లో మూడో విజయం.
టాస్ గెలిచిన పుణే కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు కెప్టెన్ డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ చక్కటి ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. మొదటి వికెట్‌కు 55 పరుగులు జత కలిసిన తర్వాత ధావన్ వికెట్ కూలింది. అతను 29 బంతులు ఎదర్కొని, ఐదు ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి, ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠీ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన కేన్ విలియమ్‌సన్ 14 బంతుల్లో 21 పరుగులు సాధించి, డానియల్ క్రిస్టియన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. తన స్వతఃసిద్ధమైన ఆటకు భిన్నంగా, నింపాదిగా ఆడిన వార్నర్ 40 బంతుల్లో 43 పరుగులు చేసి, జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని స్కోరులో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఆతర్వాత మోజెస్ హెన్రిక్స్ విజృంభణ కొనసాగింది. దీపక్ హూడాతో కలిసి అతను స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. 20 ఓవర్లలో సన్‌రైజర్స్ మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. హెన్రిక్స్ 28 బంతులు ఎదుర్కొని 55 (రు ఫోర్లు, రెండు సిక్సర్లు), హూడా 10 బంతుల్లో 19 (రెండు ఫోర్లు, ఒక సిక్సర్) చొప్పున పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచారు. పుణే బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్, డానియల్ క్రిస్టియన్, ఇమ్రాన్ తాహిర్ తలా ఒక వికెట్ పంచుకున్నారు.
ఆదుకున్న త్రిపాఠీ
సన్‌రైజర్స్‌ను ఓడించేందుకు 177 పరుగులు సాధించాల్సిన పుణే కేవలం 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ను అజింక్య రహానే రూపంలో చేజార్చుకుంది. అతను ఏడు బంతులు ఎదుర్కొని, రెండు పరుగులు చేసి, సిద్ధార్థ్ కౌల్ క్యాచ్ పట్టగా బిపుల్ శర్మ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆరంభంలోనే వికెట్ కూలినప్పటికీ మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠీ జట్టును ఆదుకున్నాడు. అతను క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతుండగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 21 బంతులు ఎదుర్కొని, 27 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత కొద్దిసేపటికీ త్రిపాఠీ కూడా వెనుదిరిగాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టిన అతను 41 బంతుల్లో 59 పరుగులు సాధించి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. ఈసారి ఐపిఎల్‌లో అందరి కంటే ఎక్కువ సొమ్మును దక్కించుకున్న బెన్ స్టోక్స్ తొమ్మిది బంతుల్లో పది పరుగులు చేసి, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు విజయ్ శంకర్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. 121 పరుగుల వద్ద మూడో వికెట్ కూలగా, ఒకవైపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూనే మరోవైపు జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యతను ధోనీ, మనోజ్ తివారీ స్వీకరించారు. సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతున్నప్పటికీ ఏ మాత్రం తొందర పడకుండా జట్టును ముందుకు నడిపించారు. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరంకాగా, సిద్ధార్థ్ కౌల్ చేసిన ఆ ఓవర్ చివరి బంతిని ధోనీ బౌండరీకి తరలించి పుణేను గెలిపించాడు. మ్యాచ్‌ని గెలిపించే వీరుడిగా తనకు ఉన్న పేరును సార్థకం చేసుకొని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును తీసుకున్నాడు. తన బ్యాటింగ్‌లో పదు ను తగ్గలేదని నిరూ పించుకున్నాడు.

స్కోరుబోర్డు
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ బి జయదేవ్ ఉనాద్కత్ 43, శిఖర్ ధావన్ సి రాహుల్ త్రిపాఠీ బి ఇమ్రాన్ తాహిర్ 30, కేన్ విలియమ్‌సన్ ఎల్‌బి డానియల్ క్రిస్టియన్ 21, మోజెస్ హెన్రిక్స్ 55 నాటౌట్, దీపక్ హూడా 19 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 8, మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 176.
వికెట్ల పతనం: 1-55, 2-84, 3-129.
బౌలింగ్: జయదేవ్ ఉనాద్కత్ 4-0-41-1, వాషింగ్టన్ సుందర్ 3-0-19-0, బెన్ స్టోక్స్ 2-0-19-0, శార్దూల్ ఠాకూర్ 4-0-50-0, డానియల్ క్రిస్టియన్ 4-0-20-1, ఇమ్రాన్ తాహిర్ 3-0-23-1.
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్: అజింక్య రహానే సి సిద్ధార్థ్ కౌల్ బి బిపుల్ శర్మ 2, రాహుల్ త్రిపాఠీ రనౌట్ 59, స్టీవెన్ స్మిత్ ఎల్‌బి రషీద్ ఖాన్ 27, మహేంద్ర సింగ్ ధోనీ 61 నాటౌట్, బెన్ స్టోక్స్ సి సబ్‌స్టిట్యూట్ (విజయ్ శంకర్) బి భువనేశ్వర్ కుమార్ 10, మనోజ్ తివారీ 17 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1-15, 2-87, 3-98, 4-121.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-39-1, బిపుల్ శర్మ 4-0-30-1, మహమ్మద్ సిరాజ్ 4-0-42-0, సిద్ధార్థ్ కౌల్ 3-0-45-0, రషీద్ ఖాన్ 4-0-17-1, మోజెస్ హెన్రిక్స్ 1-0-4-0.

చిత్రాలు..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహేంద్ర సింగ్ ధోనీ
* స్టాండ్స్‌లో ధోనీ అభిమానుల హడావుడి