క్రీడాభూమి

కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, మే 13: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఈసారి ప్లే ఆఫ్ చేరుకోవాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్‌ను ఢీకొన్న డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసి, ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లింది. ప్రత్యర్థిని 154 పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్ ఆతర్వాత లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్, సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్ విజయ్ శంకర్ అర్ధ శతకాలను నమోదు చేయడంతోపాటు, మూడు వికెట్‌కు 133 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి సన్‌రైజర్స్ విజయాన్ని సులభతరం చేశారు. గ్రూప్ దశలో మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఈ జట్టు 14 మ్యాచ్‌ల్లో 8వ విజయాన్ని సాధించింది. ఐదు మ్యాచ్‌లను చేజార్చుకోగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొత్తం 17 పాయింట్లతో ప్లే ఆఫ్ దశకు అర్హత సంపాదించింది.
విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయవచ్చని, ఆతర్వాత లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చని ధీమాతో ఉన్న అతనికి గుజరాత్ ఓపెనర్లు డ్వెయిన్ స్మిత్, ఇషాన్ కిషన్ ముచ్చెమటలు పోయించారు. మొదటి వికెట్‌కు 10.5 ఓవర్లలో 111 పరుగులు జోడించి, సన్‌రైజర్స్ బౌలింగ్ ప్రతిభను సవాలు చేశారు. రషీద్ ఖాన్ చక్కటి బంతికి డ్వెయిన్ స్మిత్ (33 బంతుల్లో 54 పరుగులు. ఏడు ఫోర్లు/ రెండు సిక్సర్లు) ఎల్‌బిగా వెనుదిరిగడంతో గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. టాప్ స్కోరర్ ఇషాన్ కిషన్ 40 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు సాధించి, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో నమన్ ఓఝా క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అప్పటికి గుజరాత్ స్కోరు 120 పరుగులు. ఓపెనర్లు పెవిలియన్ చేరిన తర్వాత గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లో రవీంద్ర జడేజా (20 నాటౌట్) తప్ప ఎవరూ సింగిల్ డిజిట్‌ను దాటలేదు. ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్ చేరడంతో, మరో 34 పరుగులకే ఆ జట్టు మిగతా ఎనిమిది వికెట్లు చేజార్చుకొని, 19.2 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మహమ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లలో 32 పరుగులు చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 34 పరుగులకు మూడు వికెట్లు కూల్చగా, భువనేశ్వర్ కుమార్ 25 పరుగులిచ్చి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆరంభంలో రెండు వికెట్లు..
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్‌ను గుజరాత్ బౌలర్ ప్రవీణ్ కుమార్ దెబ్బతీశాడు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (11 బంతుల్లో 18 పరుగులు)ను జేమ్స్ ఫాల్క్‌నెర్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మరో ఐదు పరుగుల తర్వాత మోజెస్ హెన్రిక్స్ కూడా వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన అతను దినేష్ కార్తీక్ క్యాచ్ అందుకోగా, ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్వీకరించాడు. సెకండ్ డౌన్ బ్యాట్స్‌మన్ విజయ్ శంకర్‌తో కలిసి అతను పరుగుల వేట కొనసాగించాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ, ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగారు. 41 బంతుల్లో వార్నర్ అర్ధ శతకం పూర్తి చేశాడు. టి-20 ఫార్మాట్‌లో అతనికి ఇది 58వ హాఫ్ సెంచరీ. విజయ్ శంకర్ కూడా అతనితో పోటీపడుతూ 35 బంతుల్లో 50 పరుగులు మైలురాయిని చేరాడు. ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో సింగిల్‌ను రాబట్టిన 65 పరుగులకు చేరడం ద్వారా ఈ సీజన్‌లో అతను 600 పరుగులను పూర్తి చేయడం విశేషం. అంకిత్ శర్మ వేసిన 19వ ఓవర్ మొదటి బంతిని బౌండరీకి తరలించిన వార్నర్ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడిపాడు. 18.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయిన ఈ జట్టు 158 పరుగులు సాధించి, ఎనిమిది వికెట్ల ఆధిక్యంతో గెలిచింది. వార్నర్ 52 బంతుల్లో 69 (తొమ్మిది ఫోర్లు), విజయ్ శంకర్ 44 బంతుల్లో 63 (తొమ్మిది ఫోర్లు) పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచారు. కాగా, 14 మ్యాచ్‌ల్లో పదో పరాజయాన్ని చవిచూసిన గుజరాత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
*
గ్రూప్ దశలో అత్యంత కీలకంగా మారిన మ్యాచ్‌ని సన్‌రైజర్స్ గెల్చుకోవడంతో, ప్లే ఆఫ్‌లో స్థానం కోసం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రైజింగ్ పుణే సూపర్‌జెయంట్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో పుణే గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్ చేరుతుంది. పంజాబ్ విజయం సాధిస్తే, రన్‌రేట్ కీలకమవుతుంది.
*

సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ లయన్స్: 19.2 ఓవర్లలో 154 ఆలౌట్ (డ్వెయిన్ స్మిత్ 54, ఇషాన్ కిషన్ 61, రవీంద్ర జడేజా 20 నాటౌట్, మహమ్మద్ సిరాజ్ 4/32, రషీద్ ఖాన్ 3/34, భువనేశ్వర్ కుమార్ 2/25).
సన్‌రైజర్స్ హైదరాబాద్: 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 158 (డేవిడ్ వార్నర్ 69 నాటౌట్, విజయ్ శంకర్ 63 నాటౌట్, ప్రవీణ్ కుమార్ 2/22).
*

గుజరాత్ లయన్స్ యువ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఆట ప్రేక్షకులను అలరించింది. ఈ సీజన్‌లో అతనికి ఇదే ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శన. 19 ఏళ్ల ఇషాన్ కిషన్ ఇంతకు ముందు ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేశాడు. మొత్తం మీద పదో ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ అతను చేసిన పరుగుల సంఖ్య 277కు చేరింది.
*
చిత్రం..సన్‌రైజర్స్ టాప్ స్కోరర్ డేవిడ్ వార్నర్ (69 నాటౌట్).
విజయ్ శంకర్‌తో కలిసిమూడో వికెట్‌కు అజేయంగా 133 పరుగులు జోడించిన అతను జట్టును గెలిపించాడు