క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీలో పంచరత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 29: మినీ ప్రపంచ కప్‌గా ప్రసిద్ధి చెందిన ప్రతిష్ఠాత్మక ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ (సిటి)లో ఈసారి ‘పంచ రత్నాలు’గా పిలవదగ్గ ఐదుగురు బ్యాటింగ్ స్టార్లపై అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది. వారిలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అందరి కంటే ముందున్నాడు. 2013 తర్వాత, సుమారు నాలుగేళ్లకు ఈ టోర్నమెంట్ మళ్లీ జరుగుతుండగా, డిఫెండింగ్ చాంపియన్‌గా టీమిండియా బరిలోకి దగనుంది. ఈ నాలుగేళ్ల కాలంలో కోహ్లీ వనే్డ ఫార్మాట్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానాన్ని సంపాదించాడు. ఏడాది కాలంలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అతను ఆతర్వాత భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియాపై అదే స్థాయిలో రాణించలేకపోయాడు. భుజం గాయం కూడా అతనిని వేధించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అతను చివరి టెస్టులో ఆడలేదు. ఈ వైఫల్యాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోనూ కొనసాగాయి. అతను ఏ రకంగానూ తన స్థాయికి తగినట్టు ఆడలేదు. ఫలితంగా అతని నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసింది. 10 మ్యాచ్‌ల్లో పరాజయాలను చవిచూడగా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కొంతకాలంగా నిలకడలేకుండా సాగుతున్న అతని ఫామ్ చాంపియన్స్ ట్రోఫీలో కుదుటపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వారి అంచనాలకు తగినట్టు ఆడతాడా లేక వైఫల్యాల బాటలోనే నడుస్తాడా అన్నది ఆసక్తి రేపుతున్నది.
వార్నర్ సూపర్ ఫామ్
విరాట్ కోహ్లీ ఎవరూ ఊహించని రీతిలో విఫలమవుతుంటే, ఆస్ట్రేలియా జట్టు వైస్‌కెప్టెన్ డేవిడ్ వార్నర్ సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. పదో ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్న అతను మొత్తం 641 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. వనే్డ ఫార్మాట్ విషయానికి వస్తే, ఇటీవల ఆడిన పది మ్యాచ్‌ల్లో అతను ఐదు శతకాలు సాధించి సత్తా నిరూపించుకున్నాడు. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో తిరుగులేదని రుజువు చేసుకున్న అతను చాంపియన్స్ ట్రోఫీలోనూ చెలరేగిపోయే అవకాశాలు లేకపోలేదు.
సమర్థుడు స్మిత్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. మైఖేల్ క్లార్క్ నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన అతను ఆసీస్ జట్టుకు స్ఫూర్తిదాయమైన మార్గదర్శనం చేస్తున్నాడు. ఐపిఎల్‌లో అతను రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మహేంద్ర సింగ్ ధోనీని తప్పించిన ఫ్రాంచైజీ అధికారులు స్మిత్‌కు పగ్గాలు అప్పగించారంటే, అతని పట్ల వారికి ఉన్న నమ్మకం ఎలాంటిదో స్పష్టమవుతుంది. వారి అంచనాలకు తగ్గట్టునే అతను జట్టును ఫైనల్ వరకూ చేర్చాడు. టైటిల్ పోరులో ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా గెలిచిందిగానీ, చివరి వరకూ స్మిత్ సేన ఆధిపత్యమే కొనసాగింది. వనే్డ ఇంటర్నేషనల్స్ విషయానికి వస్తే, గత సీజన్‌లో అతను 14 మ్యాచ్‌లు ఆడి, 55.58 సగటుతో 667 పరుగులు సాధించాడు. 2009 తర్వాత చాంపియన్స్ ట్రోఫీని సాధించలేకపోయిన ఆస్ట్రేలియాకు టైటిల్ అందించే బాధ్యతను స్వీకరించిన అతను చివరి వరకూ పోరాటం కొనసాగిస్తాడనేది వాస్తవం. కెప్టెన్‌గా అతను ఇప్పటి వరకూ వనే్డ ఫార్మాట్‌లో ఒక్క మేజర్ టోర్నమెంట్‌ను కూడా గెల్చుకోలేదు. కాబట్టి ‘మినీ వరల్డ్ కప్’ చాంపియన్స్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. బ్యాటింగ్ ప్రతిభను రోజురోజుకూ పెంచుకుంటున్న స్మిత్‌కు తన సామర్థ్యాన్ని నిరూపించుకునే సరైన అవకాశం చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ద్వారా లభించింది. దీనిని సద్వినియోగం చేసుకుంటాడనే ఆశిద్దాం.
‘రూట్’ సపరేటు!
ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జో రూట్‌ను ప్రత్యేకంగా చూడాలి. ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకపోవడం, నిలకడగా రాణించడం వంటి లక్షణాలతో రూట్ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. స్వదేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో అతను మిగతా వారికి భిన్నంగా, పిచ్‌ల తీరును తనకు అనుకూలంగా మార్చుకోవడం ఖాయం. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గొప్పగా రాణించి, మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్‌ను అతనే ముందుండి నడిపించనున్నాడు. 85 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అతను 3,466 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. 2016-17 సీజన్‌లో సగటున 81.75 పరుగులు చేయడం అతని సామర్థ్యానికి నిదర్శనం.
విధ్వంసకారుడు డివిలియర్స్
క్రికెట్ చరిత్రలోనే విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఎవరంటే, ముందుగా దక్షిణాఫ్రికా వీరుడు ఎబి డివిలియర్స్ పేరును చెప్పాలి. 216 వనే్డలు ఆడిన అతని స్ట్రయిక్ రేట్ 100.16. ఇప్ప వరకూ బంతికో పరుగు చొప్పున సాధించిన బ్యాట్స్‌మన్ మరొకరు లేరు. ఈ అంశమే అతనికి ప్రత్యేకతను సంతరించి పెడుతున్నది. ఇటీవల జరిగిన ఐపిఎల్‌లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినప్పటికీ అతనిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తున్న అతనికి దక్షిణాఫ్రికాను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉంది. ఐపిఎల్‌లో తొమ్మిది ఇన్నింగ్స్ ఆడిన డివిలియర్స్ కేవలం ఒక అర్ధ శతకం మాత్రమే చేయడం అతని అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. కానీ, ఏ క్షణంలోనైనా ఫామ్‌లోకి వచ్చే శక్తిసామర్థ్యాలు అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అలాంటి స్టార్ బ్యాట్స్‌మన్ ఫామ్‌లో లేకపోవడం అనేది ఎక్కువ కాలం ఉండదు. అందుకే, చాంపియన్స్ ట్రోఫీలో అతను విజృంభించే అవకాశాలే ఎక్కువ.