క్రీడాభూమి

బౌలింగ్‌లో మెరిసినా.. బ్యాటింగ్‌లో కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్త్ సౌండ్ (ఆంటిగ్వా), జూలై 3: భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల అంతర్జాతీయ వనే్డ క్రికెట్ సిరీస్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఎట్టకేలకు బోణీ చేసింది. నార్త్ సౌండ్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగిన నాలుగో వనే్డలో ఆ జట్టు 11 పరుగుల తేడాతో టీమిండియాను మట్టికరిపించి సంచలనం విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచంలోని క్రికెట్ పండితులంతా ఎంతో బలమైనదిగా ప్రశంసించే టీమిండియా బ్యాటింగ్ లైనప్ మందకొడి పిచ్‌పై పేకమేడ మాదిరిగా కుప్పకూలిపోవడమే ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన ఓటమికి ప్రధాన కారణం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ టీమిండియాను సరిగా ప్రతిఘటించలేకపోయిన వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో కూడా పెద్ద స్కోరేమీ సాధించలేదు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు భారత బౌలర్ల జోరును తట్టుకోలేక మరోసారి చతికిలబడింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే రాబట్టిన వెస్టిండీస్ జట్టు పెద్ద స్కోరు సాధించడంలో మరోసారి విఫలమైంది. భారత బౌలర్లలో పేసర్ ఉమేష్ యాదవ్ (3/36), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (3/40), కుల్దీప్ యాదవ్ (2/31) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా క్రమం తప్పకుండా వికెట్లను కైవసం చేసుకుని కరీబియన్లను సమర్ధవంతంగా ప్రతిఘటించారు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 190 పరుగుల చిన్నపాటి లక్ష్యాన్ని కూడా అందుకోలేక 11 పరుగుల ముందే బొక్కబోర్లా పడింది. ఓపెనర్ అజింక్యా రహానే (60) వరుసగా నాలుగో అర్ధ శతకంతో సత్తా చాటుకున్నప్పటికీ టాప్ ఆర్డర్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (5), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్ (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరగ్గా, మ్యాచ్‌కు అద్భుతమైన ముగింపును ఇవ్వడంలో ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా ప్రశంసలు అందుకొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్‌లో ఎంతో పేలవమైన ప్రదర్శనతో అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చాడు. క్రీజ్‌లో చాలాసేపు నిలబడినప్పటికీ ఎంతో మందకొడిగా ఆడిన అతను 114 బంతుల్లో 54 పరుగులు మాత్రమే రాబట్టి జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ధోనీ తన సుదీర్ఘ కెరీర్‌లో అత్యంత నెమ్మదిగా ఆడిన ఇన్నింగ్స్ ఇదే. ఈ మ్యాచ్‌లో 64వ అర్ధ శతకాన్ని నమోదు చేసుకునేందుకు 108 బంతులను ‘మింగేసిన’ ధోనీ మొదటి బౌండరీని సాధించేందుకు 103 బంతులను ఎదుర్కొన్నాడు. విజయం కోసం చివరి ఐదు ఓవర్లలో టీమిండియా 31 పరుగులు చేయాల్సి ఉండగా, అప్పటికి ధోనీతో పాటు హార్దిక్ పాండ్య (21 బంతుల్లో 20 పరుగులు) క్రీజ్‌లో ఉన్నారు. దీంతో భారత జట్టు విజయం సాధించడం ఖాయమని అంతా భావించారు. అయితే విండీస్ బౌలర్ల ముందు నిలబడలేక భారత జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్న భారత జట్టు 35 నుంచి 43 ఓవర్ల మధ్య కేవలం 23 పరుగులను మాత్రమే రాబట్టింది. అయితే రోస్టన్ చేజ్ వేసిన 44వ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఏకంగా 16 పరుగులు సాధించడంతో జట్టుపై వత్తిడి కొంత మేరకు తగ్గింది. అయితే అంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (3)ను పెవిలియన్‌కు పంపిన విండీస్ సారథి జాసన్ హోల్డర్ (27 పరుగులకు 5 వికెట్లు) మరోసారి విజృంభించి కీలక సమయంలో పాండ్య వికెట్‌తో పాటు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (11 బంతుల్లో 11 పరుగులు) వికెట్‌ను కూడా కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ధోనీ 49వ ఓవర్‌లో కెస్రిక్ విలియమ్స్ వేసిన చివరి బంతిని ఎదుర్కోబోయి బౌండరీ వద్ద అల్జారీ జోసఫ్‌కు దొరికిపోయాడు. దీంతో భారత జట్టు 176 పరుగుల స్కోరు వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోగా, మిగిలిన రెండు వికెట్లను కూడా జాసన్ హోల్డర్ కైవసం చేసుకున్నాడు. చివరి ఓవర్ తొలి బంతికి ఉమేష్ యాదవ్ (0) వికెట్‌ను కైవసం చేసుకున్న అతను నాలుగో బంతికి మహమ్మద్ షమీ (1)ని కూడా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 11 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. ఈ సిరీస్‌లో కరీబియన్లకు ఇదే తొలి విజయం. అయినప్పటికీ 2-1 తేడాతో ఆధిక్యతతో కొనసాగుతున్న భారత జట్టు గురువారం జమైకాలో జరిగే చివరి మ్యాచ్‌లో విండీస్‌తో తలపడనుంది.
----------- స్కోరుబోర్డు -----------
వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఎవిన్ లూయిస్ (సి) విరాట్ కోహ్లీ (బి) కుల్దీప్ యాదవ్ 35, కైల్ హోప్ (సి) కేదార్ జాదవ్ (బి) హార్దిక్ పాండ్య 35, షై హోప్ (సి) మహేంద్ర సింగ్ ధోనీ (బి) హార్దిక్ పాండ్య 25, రోస్టన్ చేజ్ (బి) కుల్దీప్ యాదవ్ 24, జాసన్ మహమ్మద్ (సి) రవీంద్ర జడేజా (బి) హార్దిక్ పాండ్య 20, జాసన్ హోల్డర్ (సి) ధోనీ (బి) ఉమేష్ యాదవ్ 11, రోవ్మన్ పావెల్ (సి) రవీంద్ర జడేజా (బి) ఉమేష్ యాదవ్ 2, ఆష్లే నర్స్ (సి అండ్ బి) ఉమేష్ యాదవ్ 4, దేవేంద్ర బిషూ రనౌట్ (రవీంద్ర జడేజా) 15, అల్జారీ జోసఫ్ నాటౌట్ 5, కెస్రిక్ విలియమ్స్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బై 1, వైడ్స్ 10) 11, మొత్తం: 50 ఓవర్లలో 189/9. వికెట్ల పతనం: 1-57, 2-80, 3-121, 4-136, 5-154, 6-161, 7-162, 8-179, 9-184. బౌలింగ్: మహమ్మద్ షమీ 10-2-33-0, ఉమేష్ యాదవ్ 10-1-36-3, రవీంద్ర జడేజా 10-0-48-0, హార్దిక్ పాండ్య 10-0-40-3, కుల్దీప్ యాదవ్ 10-1-31-2.
భారత్ ఇన్నింగ్స్: అజింక్యా రహానే (సి) షై హోప్ (బి) దేవేంద్ర బిషూ 60, శిఖర్ ధావన్ (సి) హోల్డర్ (బి) అల్జారీ జోసఫ్ 5, విరాట్ కోహ్లీ (సి) షై హోప్ (బి) జాసన్ హోల్డర్ 3, దినేష్ కార్తీక్ (సి) షై హోప్ (బి) అల్జారీ జోసఫ్ 2, మహేంద్ర సింగ్ ధోనీ (సి) అల్జారీ జోసఫ్ (బి) కెస్రిక్ విలియమ్స్ 54, కేదార్ జాదవ్ (సి) షై హోప్ (బి) ఆష్లే నర్స్ 10, హార్దిక్ పాండ్య (బి) జాసన్ హోల్డర్ 20, రవీంద్ర జడేజా (సి) రోవ్మన్ పావెల్ (బి) జాసన్ హోల్డర్ 11, కుల్దీప్ యాదవ్ నాటౌట్ 2, ఉమేష్ యాదవ్ (బి) జాసన్ హోల్డర్ 0, మహమ్మద్ షమీ (సి) రోస్టన్ చేజ్ (బి) జాసన్ హోల్డర్ 1, ఎక్స్‌ట్రాలు: (వైడ్స్ 10) 10, మొత్తం: 49.4 ఓవర్లలో 178 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-10, 2-25, 3-47, 4-101, 5-116, 6-159, 7-173, 8-176, 9-176, 10-178. బౌలింగ్: అల్జారీ జోసఫ్ 9-2-46-2, జాసన్ హోల్డర్ 9.4-2-27-5, కెస్రిక్ విలియమ్స్ 10-0-29-1, దేవేంద్ర బిషూ 10-1-31-1, ఆష్లే నర్స్ 10-0-29-1, రోస్టన్ చేజ్ 1-0-16-0.

చిత్రాలు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ జాసన్ హోల్డర్ (5/27)
*వరుసగా నాలుగో అర్ధ శతకం సాధించిన అజింక్యా రహానే