క్రీడాభూమి

టీమిండియా కోచ్ పదవి రవిశాస్ర్తీకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: టీమిండియా ప్రధాన కోచ్ పదవి రవిశాస్ర్తీని వరించనుందా?. ఈ వ్యవహారంపై మాజీ కెప్టెన్ గవాస్కర్ వ్యక్తం చేసిన ‘అభిప్రాయాలు’, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ చుట్టూ షికారు చేస్తున్న పుకార్లను చూస్తుంటే ఈ ప్రశ్నకు అవునన్న సమాధానమే వస్తోంది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి తన మాజీ సహచరుడు రవిశాస్ర్తీ ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గవాస్కర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ పదవి కోసం రవిశాస్ర్తీ సోమవారం లాంఛనంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే. దీంతో ఈ పదవి కోసం పోటీపడుతున్న వారిలో అందరికంటే రవిశాస్ర్తీ ముందున్నాడు. వాస్తవానికి 2014లో రవిశాస్ర్తీ హయాం (అతను టీమిండియా డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి) నుంచే భారత జట్టు పుంజుకోవడం ప్రారంభమైందని గవాస్కర్ పేర్కొన్నాడు. ‘ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఓటమిపాలైన తర్వాత టీమిండియా కోచ్ పదవిని చేపట్టాల్సిందిగా రవిశాస్ర్తీని బిసిసిఐ కోరింది. ఆ తర్వాత భారత జట్టు అదృష్టం అకస్మాత్తుగా మారిపోయి కొంత కాలం పాటు విజయపథంలో పయనించింది. ఈ మార్పునకు రవిశాస్త్రే కారకుడు. అందుకే అతను ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. బహుశా ఈ పదవి రవిశాస్ర్తీకే దక్కవచ్చు. అందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని గవాస్కర్ ఎన్‌డిటివితో అన్నాడు. 2014 ఆగస్టు నుంచి 2016 జూన్ వరకు టీమిండియా డైరెక్టర్‌గా సేవలు అందించిన రవిశాస్ర్తీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లందరితో ఎంతో చనువుగా వ్యవహరించి వారి అభిమానాన్ని చూరగొన్నాడు. రవిశాస్ర్తీ టీమిండియా డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భారత జట్టు 2014లో ఇంగ్లాండ్‌ను సొంత గడ్డపై ఓడించి పరిమిత ఓవర్ల సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు 2015లో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్‌లోనూ, 2016లో జరిగిన ప్రపంచ టి-20 చాంపియన్‌షిప్‌లోనూ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. అలాగే శ్రీలంకలో టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్‌ను, ఆస్ట్రేలియాలో జరిగిన టి-20 సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం విదితమే. అయితే ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం రవిశాస్ర్తీతో పాటు డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెవాగ్, మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్, దొడ్డ గణేశ్, లాల్‌చంద్ రాజ్‌పుట్, విదేశీ ఆటగాళ్లు టామ్ మూడీ (ఆస్ట్రేలియా), ఫిల్ సిమ్మన్స్ (వెస్టిండీస్) రేసులో ఉన్నారు.
సచిన్ ‘విజ్ఞప్తి’ మేరకే..
ఇదిలావుంటే, ప్రస్తుతం బిసిసిఐ క్రికెట్ సలహా కమిటీ (సిఎసి)లో సభ్యుడిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ విజ్ఞప్తి మేరకే రవిశాస్ర్తీ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడన్న పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన ఈ పదవి కోసం రవిశాస్ర్తీ సోమవారం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో చర్చకు తెర లేచింది. ఈ మొత్తం వ్యవహారం భవిష్యత్తులో భారత క్రికెట్‌కు తీవ్రమైన హాని కలిగిస్తుందని పలువురు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీమిండియా ప్రధాన కోచ్ పదవిలో రవిశాస్ర్తీని నియమించాలని కెప్టెన్ కోహ్లీతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లంతా కోరుకుంటున్నారని బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రధాన కోచ్ పదవి కోసం అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు బిసిసిఐ పొడిగించిన గడువు ఈ నెల 9వ తేదీతో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు అభ్యర్థులకు సిఎసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. సిఎసిలో సచిన్‌తో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వివిఎస్.లక్ష్మణ్ కూడా సభ్యులుగా ఉన్న విషయం విదితమే.