క్రీడాభూమి

ఇన్నింగ్స్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఆగస్టు 6: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. దీనితో ఈనెల 12 నుంచి పల్లేకల్ స్టేడియంలో ప్రారంభం కానున్న చివరి, మూడో టెస్టుకు ప్రాధాన్యం లేకుండాపోయింది. రెండో టెస్టులో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేసినప్పటికీ శ్రీలంకకు 53 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొదటి టెస్టును 304 పరుగుల భారీ తేడాతో గెల్చుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ ఆరంభం నుంచే పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 622 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆతర్వాత శ్రీలంకను మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌట్ చేసింది. 439 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన తర్వాత ప్రత్యర్థిని కెప్టెన్ కోహ్లీ ఫాలోఆన్‌కు దింపాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన అతను ఈసారి వ్యూహాన్ని మార్చుకున్నాడు. ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడాలంటే కనీసం 439 పరుగులు సాధించాల్సి ఉండగా, ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన శ్రీలంక మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆ స్కోరుకు 29 పరుగులు జత కలిసిన తర్వాత మలింత పుష్పకుమార వికెట్ కూలింది. 16 పరుగులు చేసిన అతనిని అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దినేష్ చండీమల్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, రెండు పరుగులకే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగడంతో లంక కష్టాల్లో పడింది.
మూడో రోజు ఆటలో సెంచరీ సాధించిన కుశాల్ మెండిస్‌తో కలిసి జట్టును ఆదుకోవడానికి తీవ్రంగా పోరాడిన దిమిత్ కరుణరత్నే నాలుగో రోజు కూడా క్రీజ్‌లో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే సెంచరీ సాధించిన అతను 141 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అజింక్య రహానేకు చిక్కాడు. మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 66 బంతుల్లో 36 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా చక్కటి క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరాడు. దిల్‌రువాన్ పెరెరా (4), ధనంజయ డిసిల్వ (17), నిరోష్ డిక్‌విల్లా (31), నువాన్ ప్రదీప్ (1) పోరాటాలు ఎక్కువ సేపు సాగలేదు. 116.5 ఓవర్లలో శ్రీలంక 386 పరుగులకు ఆలౌటైంది. అప్పటికి రంగన హెరాత్ 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రవీంద్ర జడేజా 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టగా, అశ్విన్, హార్దిక్ పాండ్య చెరి రెండు వికెట్లు సాధించారు. ఈ టెస్టులో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచి, భారత్‌ను గెలిపించిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

* శ్రీలంకలో టీమిండియా మొదటిసారి ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. పరుగుల పరంగా చూస్తే, గాలేలో జరిగిన మొదటి టెస్టులో 304 ఆధిక్యంతో సాధించిన విజయమే శ్రీలంకపై అతి పెద్దది. కాగా, గత తొమ్మిది టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో ఇన్నింగ్స్ విజయం. శ్రీలంకలో ఎనిమిదో విజయం. ఆ జట్టుపై వరుసగా ఇది నాలుగోది. ఇలావుంటే, శ్రీలంక స్వదేశంలో చివరిసారి 2000 సంవత్సరంలో పాకిస్తాన్‌తో గాలేలో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్ ఓటమిని చవిచూసింది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దారుణ పరాభవాన్ని పొందింది.
* టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఏదో ఒక ఇన్నింగ్స్‌లో యాభైకి పైగా పరుగులు చేసి, ఐదు లేదా అంతకు మించి పరుగులు చేయడం ఇది మూడోసారి. ఈ మ్యాచ్‌లో అశ్విన్, రవీంద్ర జడేజా ఈ పీట్‌ను సాధించారు. 1895లో అడెలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఆటగాళ్లు గార్జి గిఫెన్, అల్బర్ట్ ట్రాక్, 2011లో భారత్‌తో ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ ఆటగాళ్లు టిమ్ బ్రెస్నన్, స్టువర్ట్ బ్రాడ్ ఈ విధంగా అర్ధ శతకాలు, ఐదు లేదా అంతకు మించి వికెట్లు కూల్చారు.
* టెస్టు క్రికెట్‌లో ఫాలోఆన్ ఆడుతున్నప్పుడు ఒక జట్టుకు చెందిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేసిన సంఘటన చివరిసారి 2009లో జరిగింది. న్యూజిలాండ్‌తో నాపీర్‌లో జరిగిన టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్, వివిఎస్ లక్ష్మణ్ ఈ విధంగా శతకాలు చేశారు. కాగా, మొత్తం టెస్టు క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే, ఫాలోఆన్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించడం ఇది 14వసారి. శ్రీలంక తరఫున ఈ ఘనతను అందుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా తిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్ చరిత్ర సృష్టించారు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 158 ఓవర్లలో 9 వికెట్లకు 622 డిక్లేర్డ్ (లోకేష్ రాహుల్ 57, చటేశ్వర్ పుజారా 133, అజింక్య రహానే 132, రవిచంద్రన్ అశ్విన్ 54, వృద్ధిమాన్ సహా 67, రవీంద్ర జడేజా 70, రంగన హెరాత్ 4/154, మలింద పుష్పకుమార 2/156).
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 49.4 ఓవర్లలో 183 ఆలౌట్ (దిముత్ కరుణరత్నే 25, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్ 26, నిరోషన్ డిక్‌విల్లా 51, దిల్‌రువాన్ పెరెరా 25, షమీ 2/13, అశ్విన్ 5/69, రవీంద్ర జడేజా 2/84).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (్ఫలోఆన్/ ఓవర్‌నైట్ స్కోరు 2 వికెట్లకు 209): దిముత్ కరుణరత్నే సి అజింక్య రహానే బి రవీంద్ర జడేజా 141, ఉపుల్ తరంగ బి ఉమేష్ యాదవ్ 2, కుశాల్ మెండిస్ సి వృద్ధిమాన్ సాహా బి హార్దిక్ పాండ్య 110, మలింద పుష్పకుమార బి అశ్విన్ 16, దినేష్ చండీమల్ సి అజింక్య రహానే బి రవీంద్ర జడేజా 2, ఏంజెలో మాథ్యూస్ సి వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 36, నిరోషన్ డిక్‌విల్లా సి అజింక్య రహానే బి హార్దిక్ పాండ్య 31, దిల్‌రువాన్ పెరెరా స్టంప్డ్ వృద్ధిమాన్ సాహా బి రవీంద్ర జడేజా 4, ధనంజయ డి సిల్వ సి అజింక్య రహానే బి రవీంద్ర జడేజా 17, రంగన హెరాత్ 17 నాటౌట్, నువాన్ ప్రదీప్ సి శిఖర్ ధావన్ బి అశ్విన్ 1, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (116.5 ఓవర్లలో ఆలౌట్) 386.
వికెట్ల పతనం: 1-7, 2-198, 3-238, 4-241, 5-310, 6-315, 7-321, 8-343, 9-384, 10-386.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 13-2-39-1, రవిచంద్రన్ అశ్విన్ 37.5-7-132-2, మహమ్మద్ షమీ 12-3-27-0, రవీంద్ర జడేజా 39-5-152-5, హార్దిక్ పాండ్య 15-2-31-2.

చిత్రం.. కొలంబోలో జరిగిన రెండో టెస్టులో శ్రీలంకను ఓడించి, సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా